Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మీరు టీవీ చూడడం కాదు.. అదే మిమ్మల్ని చూస్తోంది.. అందరిపై నిఘా పెడ్తున్న ఈ ఏసీఆర్ టెక్నాలజీ ఏంటి?

మీరు టీవీ చూడడం కాదు.. అదే మిమ్మల్ని చూస్తోంది.. అందరిపై నిఘా పెడ్తున్న ఈ ఏసీఆర్ టెక్నాలజీ ఏంటి?

Telugu Samayam 3 weeks ago

Smart TV ACR Tracking News: నేటి ఆధునిక కాలంలో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు లేని ఇళ్లే లేవు. ఇంటర్నెట్ సౌకర్యం, అద్భుతమైన పిక్చర్ క్వాలిటీతో మన వినోదాన్ని రెట్టింపు చేస్తున్న ఈ టీవీలు..

మన గోప్యతకు తూట్లు పొడుస్తుందన్న చేదు నిజం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మీరు టీవీ చూస్తున్నంత సేపు అది మిమ్మల్ని చూస్తోందని.. అప్పుడే మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, ఇతరులతో షేర్ చేసుకుంటుందని తెలిసింది. అసలు టీవీ ఎలా మన వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుంది, ఇతరులతో పంచుకుంటుంది, దీన్నుంచి మనం ఎలా బయటపడాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

ఏమిటీ ఏసీఆర్ టెక్నాలజీ..?

స్మార్ట్ టీవీలలో ఉండే 'ఆటోమేటిక్ కంటెంట్ రికగ్నిషన్' (ఏసీఆర్) అనే ఫీచర్ ఈ నిఘాకు ప్రధాన కారణం అని వెలుగులోకి వచ్చింది. ఇది టీవీ స్క్రీన్‌పై ప్రసారమయ్యే ప్రతి అంశాన్ని విశ్లేషిస్తుంది. మీరు నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా చూస్తున్నా, యూట్యూబ్ వీడియోలు చూస్తున్నా లేదా హెచ్‌డీఎమ్‌ఐ కేబుల్ ద్వారా ల్యాప్‌టాప్‌ను కనెక్ట్ చేసి ఏదైనా ఫైల్‌ను చూస్తున్నా.. ఈ టెక్నాలజీ ఆ పిక్సెల్స్ లేదా ఆడియోను స్కాన్ చేసి ఒక 'డిజిటల్ ఫింగర్‌ప్రింట్'గా మారుస్తుంది. ఈ సమాచారాన్ని మెటా డేటాగా మార్చి, టీవీ తయారీ సంస్థలకు పంపిస్తుంది. తద్వారా మీ అభిరుచులు, అలవాట్లను ఆ కంపెనీలు పసిగడతాయి.

ల్యాప్‌టాప్ కనెక్ట్ చేసినా వదలదు!

చాలామంది యూజర్లు నెట్‌ఫ్లిక్స్ లేదా యూట్యూబ్ ప్రైవసీ సెట్టింగ్స్ మార్చుకుంటే సరిపోతుందని భావిస్తారు. కానీ అసలు ప్రమాదం టీవీ హార్డ్‌వేర్‌లోనే ఉందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో ఇటీవల జరిగిన ఒక పరిశోధనలో దిగ్భ్రాంతికర విషయాలు బయటపడ్డాయి. సామ్‌సంగ్, ఎల్‌జీ వంటి ప్రముఖ కంపెనీల టీవీలను కేవలం ఎక్స్‌టర్నల్ డిస్‌ప్లేగా (ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసి) వాడుతున్నప్పుడు కూడా అవి డేటాను సేకరిస్తున్నట్లు గుర్తించారు.

"టీవీ హార్డ్‌వేర్ నేరుగా పిక్సెల్స్‌ను గుర్తిస్తుంది. మీరు ల్యాప్‌టాప్ కనెక్ట్ చేసి పర్సనల్ ఫొటోలు చూసినా లేదా బ్యాంకింగ్ స్టేట్‌మెంట్స్ వంటి సున్నితమైన డాక్యుమెంట్లు ఓపెన్ చేసినా.. ఆ వివరాలు కూడా టెక్నాలజీ గుప్పిట్లోకి వెళ్లే ప్రమాదం ఉంది" అని '63శాట్స్ సైబర్ టెక్' సీఈఓ నీహార్ పఠారే హెచ్చరించారు.

మీ డేటానే వారి వ్యాపారం..!

ఇలా సేకరించిన డేటాను అడ్వర్టైజింగ్ ఏజెన్సీలకు విక్రయిస్తారు. మీరు టీవీలో ఏ కంటెంట్ ఎక్కువగా చూస్తున్నారో దానికి తగ్గట్లుగా మీకు మొబైల్స్‌లో లేదా సోషల్ మీడియాలో ప్రకటనలు కనిపించడం వెనుక ఉన్న అసలు మర్మం ఇదేనని చెబుతున్నారు.

ప్రైవసీని కాపాడుకోవడం ఎలా?

మీ స్మార్ట్ టీవీ మీపై గూఢచర్యం చేయకుండా ఉండాలంటే కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మీ టీవీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి 'ఎసీఆర్' లేదా 'వ్యూయింగ్ డేటా' లేదా 'అడ్వర్టైజింగ్' వంటి ఆప్షన్లను వెతికి వాటిని డిసేబుల్ చేయండి. అలాగే టీవీని మొదటిసారి సెటప్ చేసేటప్పుడు వచ్చే అన్ని నిబంధనలకు కళ్లు మూసుకుని అగ్రీ నొక్కకండి. డేటా సేకరణకు సంబంధించిన ఆప్షన్లను జాగ్రత్తగా గమనించండి. టీవీకి ఇంటర్నెట్ అవసరం లేనప్పుడు వైఫై డిస్‌కనెక్ట్ చేయడం ఉత్తమం అని నిపుణులు వివరిస్తున్నారు.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam