Dailyhunt
మూడో తరగతి విద్యార్థికి గుండెపోటు.. ఫ్రెండ్స్‌తో ఆడుకుంటుండగా విషాదం

మూడో తరగతి విద్యార్థికి గుండెపోటు.. ఫ్రెండ్స్‌తో ఆడుకుంటుండగా విషాదం

Telugu Samayam 1 week ago

త కొన్నేళ్లుగా గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య పెరిగి పోతుండటం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఆరోగ్యంగా కనిపించిన వారు, రోజూ జిమ్ చేసేవారు కూడా చూస్తుండగానే క్షణాల్లో కుప్పకూలిపోయిన ఘటనలు కొంత కాలం క్రితం ఎక్కువగా నమోదయ్యాయి.

బడికెళ్లే చిన్న పిల్లలు సైతం గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు నమోదయ్యాయి. తాజాగా జగిత్యాల జిల్లాలో మూడో తరగతి చదువుతున్న 9 ఏళ్ల బాలుడు గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు.

జగిత్యాల రూరల్‌ మండలం పోరండ్ల గ్రామంలో ఈ విషాదం సంఘటన జరిగింది. తోపారపు చంద్రశేఖర్‌-నవిత దంపతుల కుమారుడైన నిశాంత్‌ (9) స్థానికంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. సోమవారం పోరండ్ల గ్రామ శివారులో ఉన్న శివాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వెళ్లిన నిశాంత్ అందరితో సరదాగా గడిపాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న తన ఫ్రెండ్స్‌తో కలిసి ఆడుకోవడం ప్రారంభించాడు.

తోటి పిల్లలతో ఆడుకుంటున్న నిశాంత్ ఒక్కసారిగా కూలబడిపోయాడు. అక్కడ ఉన్న వారు వెంటనే అప్రమత్తమై నిశాంత్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. గ్రామస్థుల సాయంతో తల్లిదండ్రులు బాలుణ్ని చికిత్స కోసం జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. నిశాంత్‌ను పరీక్షించిన డాక్టర్లు.. అప్పటికే అతడు ప్రాణాలు విడిచినట్లు నిర్ధారించారు.

చంద్రశేఖర్-నవిత జంటకు నిశాంత్ ఒక్కడే సంతానం. అప్పటి వరకూ ఎంతో ఉత్సాహంగా కనిపించిన తమ కుమారుడు అనూహ్యంగా చనిపోవడంతో ఆ తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతంగా మారింది. 9 ఏళ్ల వయసులోనే బాలుడు గుండెపోటుతో చనిపోవడం పొరండ్ల గ్రామస్తులను తీవ్రంగా కలిచివేసింది. అప్పటి వరకు గుడిలో అన్నదానంలో పాల్గొని, ఆడుకుంటూ.. అటు కుటుంబ సభ్యులు, ఇటు ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపిన నిశాంత్.. ఆకస్మికంగా మరణించడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు.

చిన్నపిల్లల్లో గుండెపోటుకు కారణాలు..

చిన్నపిల్లలు గుండెపోటు బారిన పడటానికి జీవనశైలిలో మార్పులు రావడంతోపాటు చాలా కారణాలే ఉన్నాయి. అధిక బరువు ఉండటం, జంక్ ఫుడ్ తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడంతో చిన్న వయసులోనే శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతోంది. పుట్టుకతో వచ్చే గుండె లోపాలను సకాలంలో గుర్తించకపోవడం కూడా మరణాలకు కారణం అవుతోంది. కార్డియోమయోపతి అనే గుండె కండరాలకు సంబంధించిన వ్యాధి బారిన పడిన పిల్లల్లో గుండె రక్తాన్ని సరిగా పంపింగ్ చేయలేదు. దీంతో హఠాత్తుగా గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. గుండె కొట్టుకునే వేగంలో అసాధారణ మార్పులు రావడం వల్ల కూడా రక్త ప్రసరణ దెబ్బతినే ప్రమాదం ఉంది. వైరస్‌లు గుండె కండరాలపై దాడి చేసినప్పుడు కూడా హార్ట్ పంపింగ్ సామర్థ్యం తగ్గుతుంది.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam