తిరుమలలో రెండు వారాలుగా భక్తులు రద్దీ పెరిగింది.. శ్రీవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలి వస్తున్నారు. టీటీడీ రద్దీని పర్యవేక్షిస్తూ భక్తులు త్వరగా దర్శనాలు పూర్తి చేసుకునేలా ఏర్పాట్లు చేస్తోంది.
తిరుమలలో రద్దీ పెరుగుతున్న వేళ టీటీడీ పాలకమండలి సభ్యులు, టీవీఎస్ మోటార్స్ ఎండీ సుదర్శన్ వేణు కీలక నిర్ణయం తీసుకున్నారు. వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలలో రద్దీ పెరిగిందని.. కొండపై రద్దీని కొంతవరకు తగ్గించేలా తన సిఫార్సు లేఖలపై, దర్శనం, వసతి కోటాను 50శాతం వదులుకుంటానని తెలిపారు. జులై 15 వరకు ఈ కోటాను వదిలేస్తానని టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి లేఖ రాశారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి రోజుకు లక్షమంది వరకు భక్తులు వస్తున్నారని.. దర్శనానికి ఏకంగా 30 గంటల సమయం పడుతోందని వేణు గుర్తు చేశారు. టీటీడీ రద్దీని గమనిస్తూ భక్తులకు దర్శనం, వసతి, అన్నప్రసాదాలు అందించేందుకుకృషి చేస్తోందని తెలిపారు. అందుకే తాను టీటీడీ మరింత మెరుగైన సేవలందించేలా తనవంతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుదర్శన్ వేణు తన లేఖలో పేర్కొన్నారు. సుదర్శన్ వేణు తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేపట్టంది టీటీడీ. సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత ఇస్తూ అన్ని విభాగాలు సమన్వయంతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తిరుమలలో శ్రీవారి దర్శనం, అన్నప్రసాదం, తాగునీరు, భద్రత తదితర సేవలను సమర్థవంతంగా అందిస్తున్నామని తెలిపారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణునివాసం కేంద్రాలలో సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామన్నారు. భక్తుల కోసం మౌలిక వసతులు, ఫ్యాన్లు, తాగునీటి సదుపాయం, ఎప్పటికప్పుడు సమాచారం అందించే విధానం, వర్షాలకు తడవకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టామన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టిటిడి విజిలెన్స్, జిల్లా పోలీసులు, టిటిడిలోని వివిధ విభాగాలు, శ్రీవారి సేవకులు సమన్వయంతో నిరంతరం సేవలందిస్తున్నారన్నారు.
రోజుకు లక్ష మందికి పైగా భక్తులు తిరుమలకు వచ్చినప్పటికీ, భక్తుల సంఖ్య, దర్శన సమయం, క్యూలైన్ల పరిస్థితి, ముందురోజు దర్శనాల వివరాలు వంటి అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి సీజన్‌లో భక్తుల రద్దీ భిన్నంగా ఉంటుందని, అందుకు అనుగుణంగా నిర్వహణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. టిటిడి అధికారిక సమాచారాన్ని ఆధారంగా చేసుకుని భక్తులు తిరుమలకు వస్తే, అందరికీ సమర్థవంతంగా శ్రీవారి దర్శనం కల్పించడం మరింత సులభమవుతుంది అన్నారు. భక్తులు సురక్షిత వాతావరణంలో దర్శనం చేసుకుని వెళ్లేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.

