వైవిధ్యమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు నారా రోహిత్ త్వరలో తండ్రి కాబోతున్నారు. ఆయన భార్య శిరీష ప్రస్తుతం గర్భంతో ఉన్నారు.
ఈ జంటకు సంబంధించిన ప్రత్యేక బేబీ బంప్ ఫోటో షూట్ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ వీడియో కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారడంతో, నారా వారి ఇంటికి కొత్త అతిథి రాబోతున్నారనే వార్త సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా రోహిత్ అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు ఈ దంపతులకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆ వీడియోలో ఈ జంట ఎంతో సంతోషంగా కనిపిస్తుండటం అభిమానులను ఆకట్టుకుంటోంది.
* ఆ స్టార్ హీరోకి భార్య ఉన్నా గర్ల్‌ఫ్రెండ్‌తోనే ఉంటాడు.. ఫుల్లుగా తాగేసి సెట్స్‌కి టైమ్‌కి రాడు - జేడీ
నారా రోహిత్, శిరీషల పరిచయం వెండితెరపైనే మొదలైంది. రోహిత్ నటించిన రాజకీయ నేపథ్య చిత్రం 'ప్రతినిధి 2' షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఈ చిత్రంలో శిరీష హీరోయిన్‌గా నటించారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి, చివరకు పెళ్లి పీటల వరకు వెళ్ళింది. ముఖ్యంగా నారా రోహిత్ పిన్ని నారా భువనేశ్వరి గారు స్వయంగా ఈ సంబంధం గురించి పెద్దలతో మాట్లాడి సంబంధాన్ని ఖరారు చేయడం విశేషం. అక్టోబర్ 30, 2025న హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా వీరి వివాహం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ వంటి ప్రముఖులు హాజరై ఈ జంటను ఆశీర్వదించారు.
శిరీష లేళ్ల నేపథ్యం
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా రెంటచింతల గ్రామానికి చెందిన శిరీష.. చదువులోనూ మేటి. ఆస్ట్రేలియాలో మాస్టర్స్ పూర్తి చేసి అక్కడ కొంతకాలం ఉద్యోగం కూడా చేశారు. అయితే సినిమాలపై ఉన్న ఆసక్తితో భారత్ తిరిగి వచ్చి మోడలింగ్‌లో రాణించారు. పలు ఆడిషన్స్ తర్వాత 'ప్రతినిధి 2' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.
* బాక్సాఫీస్ వద్ద 'రంగస్థలం' జంట పోటీ.. చిట్టిబాబు - రామలక్ష్మి మధ్య క్లాష్ తప్పదా?
నారా రోహిత్ సినీ ప్రస్థానం
2009లో 'బాణం' సినిమాతో ఒక విలక్షణమైన హీరోగా కెరీర్ ప్రారంభించిన రోహిత్, తన బేస్ వాయిస్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 'సోలో', 'ప్రతినిధి', 'రౌడీ ఫెలో', 'అసుర', 'జ్యో అచ్యుతానంద' వంటి చిత్రాలు ఆయన కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచాయి. అరాన్ మీడియా వర్క్స్ బ్యానర్‌పై పలు ప్రయోగాత్మక చిత్రాలను నిర్మించడమే కాకుండా, ఇతర సినిమాలకు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు. ఇటీవల 'ప్రతినిధి 2', 'సుందరకాండ' బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్‌లతో కలిసి 'భైరవం' వంటి చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించారు. ఓవైపు కెరీర్ పరంగా వరుస సినిమాలతో దూసుకుపోతున్న రోహిత్, మరోవైపు వ్యక్తిగత జీవితంలో తండ్రిగా ప్రమోషన్ పొందబోతుండటంతో నారా కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది.

