గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వయసుతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నారు. యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తూ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను లైన్‌లో పెడుతున్నారు.
ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'NBK111' చిత్రం దాదాపు ముగింపు దశకు చేరుకుంది. 'వీరసింహారెడ్డి' ఘనవిజయం తర్వాత వస్తున్న ఈ కాంబోపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, ఈ ఏడాది చివర్లో లేదా సంక్రాంతి బరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరోవైపు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య ఒక భారీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అమరావతి వేదికగా పూజా కార్యక్రమాలు జరిగిన ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గతంలో బాలకృష్ణ నటించిన బ్లాక్‌బస్టర్ 'సింహా' చిత్రానికి కొరటాల శివ రచయితగా సేవలుందించినప్పటికీ, దర్శకుడిగా ఆయన బాలయ్యను డైరెక్ట్ చేయడం ఇదే తొలిసారి. దీంతో నటసింహాన్ని తెరపై కొరటాల ఏ స్థాయిలో ఆవిష్కరిస్తారోనని అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
* ఆ పాత్ర చేయడానికి కారణమదే.. 'రామాయణ' శూర్పణఖ రోల్‌పై రకుల్ క్రేజీ రియాక్షన్
కొరటాల ప్లాన్ ఛేంజ్ - అక్టోబరులో తొలి షెడ్యూల్
ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి ఒక కీలక వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని నిజానికి ఆగస్టు మూడో వారంలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లాలని భావించారు. అయితే ఇటీవలే బాలకృష్ణ మోకాలికి చిన్నపాటి శస్త్రచికిత్స జరగడంతో, వైద్యుల సూచన మేరకు ఆయన కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. హీరో పూర్తిస్థాయిలో కోలుకున్న తర్వాతే చిత్రీకరణ ప్రారంభించాలని మేకర్స్ నిశ్చయించారు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా రెగ్యులర్ షూట్ అక్టోబరు నుంచి మొదలుకానుంది. మొదట బాలయ్య లేని సన్నివేశాలను చిత్రీకరించాలని కొరటాల శివ భావించినప్పటికీ, ఆ ప్లాన్‌ను మార్చుకున్నారు. కథానాయకుడి మాస్ ఎంట్రీ, పవర్‌ఫుల్ సీన్లతోనే మొదటి షెడ్యూల్ ప్రారంభించాలని దర్శకుడు నిర్ణయించారు.
నెగిటివ్ షేడ్స్‌లో ఐశ్వర్య రాజేష్?
'దేవర' వంటి సంచలన విజయం తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో కథ, కథనాలపై ప్రత్యేక దృష్టి సారించారు. కమర్షియల్ మాస్ అంశాలతో పాటు బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇక ఈ చిత్రంలో నటి ఐశ్వర్య రాజేష్‌ను ఒక విభిన్నమైన పాత్ర కోసం ఎంపిక చేసినట్లు సమాచారం. ఆమె ఇందులో కథానాయికగా కాకుండా నెగెటివ్ షేడ్స్ ఉన్న ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే, వెండితెరపై బాలయ్య, ఐశ్వర్య రాజేష్ ల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని తెలుస్తోంది. సుధాకర్ చెరుకూరి, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా అత్యంత నిష్కర్శగా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

