హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. కరెంట్ షాక్ కారణంగా చనిపోయిన ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కుటుంబానికి అండగా నిలిచారు.
రమేష్ అనే మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి.. ఇటీవల కరెంట్ షాక్ కొట్టి ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ పెద్ద ప్రమాదవశాత్తు చనిపోవటంతో.. అతని కుటుంబం ఇబ్బందుల్లో పడింది. ఈ విషయం బాలకృష్ణ వరకూ చేరటంతో.. రమేష్ కుటుంబానికి అండగా నిలిచారు నందమూరి బాలకృష్ణ. ఇటీవల హిందూపురం నియోజకవర్గంలో పర్యటించిన సమయంలో రమేష్ కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందించారు. అక్కడికక్కడే ఐదు లక్షల రూపాయల సొంత డబ్బులను రమేష్ కుటుంబానికి అందించారు. దీంతో రమేష్ కుటుంబసభ్యులు.. బాలకృష్ణకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరో వైపు హిందూపురం నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణకై బాలకృష్ణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అందులో భాగంగా పోలీసులకు కావాల్సిన మౌలిక సౌకర్యాలు సమకూరుస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు బొలెరో వాహనాలు, బైక్‌లను నందమూరి బాలకృష్ణ అందజేశారు. రూ.50 లక్షలు విలువ చేసే వాహనాలను హిందూపురం పర్యటనలో ప్రారంభించారు బాలకృష్ణ. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ నిధులు, దాతల సహకారంతో ఈ వాహనాలను సమకూర్చారు. జిల్లా ఎస్పీ సతీశ్‌కుమార్‌తో కలిసి ఈ వాహనాలను ప్రారంభించిన బాలకృష్ణ.. నేరాలను కట్టడి చేసే విషయంలో ఏపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. ఏదైనా నేరం జరిగితే పోలీసులు వెంటనే అక్కడకు చేరుకోవటానికి వాహనాలు ఎంతో కీలకమన్న ఎస్పీ.. ఈ అవసరాన్ని గుర్తించి వాహనాలను సమకూర్చినందుకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ధన్యవాదాలు తెలియజేశారు.
మరోవైపు హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు బాలకృష్ణ. హిందూపురం నుంచే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన బాలయ్య.. వైసీపీ వేవ్‌లోనూ 2019లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొన్న జరిగిన ఎన్నికల్లో మరోసారి విజయం సాధించిన బాలకృష్ణ.. హ్యాట్రిక్ కొట్టారు. ఎమ్మెల్యేగా హిందూపురం నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, కొత్త పరిశ్రమల ఏర్పాటుకై చర్యలు చేపడుతున్నారు. హిందూపురం నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు.

