Dailyhunt
నెలకు రూ.10 వేల పెట్టుబడితో.. రూ.10 కోట్లు  సాధ్యమేనా? ఆర్థిక నిపుణుల సూచనలు ఇవే..!

నెలకు రూ.10 వేల పెట్టుబడితో.. రూ.10 కోట్లు సాధ్యమేనా? ఆర్థిక నిపుణుల సూచనలు ఇవే..!

Telugu Samayam 5 days ago

Investment Tips: పిల్లల చదువులు, పెళ్లిళ్లు, పదవీ విరమణ కోసం పెట్టుబడులు పెడుతుంటారు. అయితే, భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక అవసరాల కోసం పెట్టుబడి పెట్టడం అనేది ఒక ప్రణాళిక బద్ధంగా ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు.

ద్రవ్యోల్బణం కారణంగా ఏటికేడు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇన్‌ఫ్లేషన్ మించి రాబడులు అందుకున్నప్పుడే పెట్టిన పెట్టుబడికి విలువ ఉంటుంది. చిన్న మొత్తాల్లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెద్ద మొత్తంలో అంటే కోట్ల రూపాయలు అందుకోవచ్చని చాలా సార్లు వినే ఉంటారు. అలా నెలకు రూ.10 వేల చొప్పున పెట్టుబడి పెట్టి రూ.10 కోట్లు సంపాదించవచ్చా? సాధ్యమైతే ఎలాంటి పథకాలను ఎంచుకోవాలి? ఎన్ని సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే ఈ లక్ష్యాన్ని చేరుకోవచ్చు?

నెలకు రూ.10 వేల పెట్టుబడితో ఒకేసారి రూ.10 కోట్లు అందుకోవడం సాధ్యమేనా అంటే పక్కా ప్రణాళికతో మ్యూచువల్ ఫండ్స్‌లోని సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సాధ్యమేనని ఆర్థిక నిపుణులు అంటున్నారు. చిన్న మొత్తాలతోనే క్రమానుగతంగా క్రమశిక్షణతో దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టగలిగితే అనుకున్న లక్ష్యం సాధ్యమేని చెబుతున్నారు. మీరు రూ.10 వేల సిప్ పెట్టుబడితో రూ.10 కోట్లు అందుకోవాలంటే 35 సంవత్సరాల పాటు పెట్టుబడిని కొనసాగించాల్సి ఉంటుంది. 35 ఏళ్లపాటు నెలకు రూ.10 వేలు మదుపు చేస్తూ వెళ్తే పెట్టుబడి మొత్తం రూ.42 లక్షలు అవుతుంది. మీ మొత్తం పెట్టుబడిపై ప్రతి సంవత్సరం 12 శాతం వార్షిక వడ్డీ లభిస్తుందని అంచనా వేస్తే మెచ్యూరిటీ సమయానికి సుమారు రూ.6 కోట్లు మీ చేతికి వస్తుంది.

అదే మీరు పెద్ద మొత్తం లక్ష్యం పెట్టుకున్నారు కాబట్టి సెప్ అప్ సిప్ (Step Up SIP) విధానంలో పెట్టుబడిని కొనసాగించాల్సి ఉంటుంది. మొదటి సంవత్సరంలో మీరు నెలకు రూ.10 వేలు పెట్టుబడి పెడితే రెండో సంవత్సరంలో రూ.11 వేలు పెట్టాలి. అలా మీ పెట్టుబడిని ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వెళ్లాలి. ఇలా మీరు 30 సంవత్సరాలు పెట్టుబడి క్రమం తప్పకుండా కొనసాగిస్తే సుమారు రూ.2 కోట్లు అవుతుంది. దీనికి 12 శాతం వార్షిక రాబడి వస్తుందని అంచనా వేస్తే 30 ఏళ్ల తర్వాత మీ చేతిలో రూ.10 కోట్లు ఉండేందుకు అవకాశం ఉంది.

మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు ముఖ్య గమనిక. ఈ కథనం కేవలం సమాచారం కోసమే. ఎలాంటి పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కాదు. మ్యూచువల్ ఫండ్స్‌లోనూ హైరిస్క్ ఉంటుంది. ఎంచుకున్న ఫండ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఆర్థిక నిపుణుల సలహా మేరకు ఇన్వెస్ట్ చేయాలి. దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేసే వారు తమ పోర్ట్ ఫోలియోను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి. లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంటుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam