Dailyhunt
నేనూ శర్వానంద్ ఇంట్రోవర్ట్స్.. పెద్దగా మాట్లాడుకోము కానీ, మా మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది: మాళవిక నాయర్

నేనూ శర్వానంద్ ఇంట్రోవర్ట్స్.. పెద్దగా మాట్లాడుకోము కానీ, మా మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది: మాళవిక నాయర్

Telugu Samayam 2 weeks ago

'ఎవడే సుబ్రమణ్యం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైంది మాళవిక నాయర్. 'కళ్యాణ వైభోగమే', 'మహానటి', 'విజేత', 'టాక్సీవాలా', 'ఒరేయ్ బుజ్జిగా', 'థాంక్యూ', 'అన్నీ మంచి శకునములే', 'డెవిల్' వంటి చిత్రాలతో అలరించింది.

కానీ టాలీవుడ్ లో ఆమె క్రేజీ హీరోయిన్ గా మారలేకపోయింది. దీనికి కారణం ఇప్పటి వరకూ ఆమెకు సాలిడ్ బ్లాక్ బస్టర్ పడకపోవడమే. చివరగా 'కల్కి 2898 ఏడీ' సినిమాలో స్పెషల్ రోల్ లో కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు 'బైకర్' మూవీతో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తోంది.

శర్వానంద్ హీరోగా నటించిన మోస్ట్ ఎవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా 'బైకర్'. ఇందులో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించగా.. సీనియర్ నటుడు రాజశేఖర్ కీలక పాత్రని పోషించారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో UV క్రియేషన్స్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందింది. ఇది భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ డ్రామా. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఏప్రిల్ 3న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. మాళవిక నాయర్ ఈ చిత్రంపై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆసక్తికర విషయాలు పంచుకుంది.

''నాకు ప్రతి సారి కొత్త క్యారెక్టర్ చేయాలని ఉంటుంది. డిఫరెంట్ లేయర్స్ ఉన్న పాత్రలు చేయాలని అనుకుంటాను. అలాంటి పాత్రలు వస్తే ఖచ్చితంగా చేస్తాను. ఒక పాత్ర చేసే ముందు ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుంటాను. మనం సినిమాలు చేస్తున్నదే వాళ్ల కోసం. అలాగే ఆ క్యారెక్టర్ నాకు పర్సనల్‌గా కనెక్ట్ అవుతుందా లేదా చూసుకుంటాను. ఖచ్చితంగా కొత్తగా అనిపిస్తే చేస్తాను. ఇప్పటివరకు నా జర్నీ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా మంచి పాత్రలు చేయాలని కోరుకుంటున్నాను'' అని మాళవిక తెలిపింది.

''2024 ఏప్రిల్‌లో 'బైకర్' కథ విన్నాను. చాలా నచ్చింది. దర్శకుడు అభిలాష్ చాలా ఫ్రెష్ కంటెంట్ ఉన్న క్యారెక్టర్ రాశారు. ఇండియాలో ఫస్ట్ మోటోక్రాస్ ఫిల్మ్ బైకర్. ఈ సినిమా కోసం చాలా ఎక్సైట్‌గా ఉన్నాను. ఇది హై అడ్రినలిన్, హై ఆక్టేన్ ఫిల్మ్. మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. నా క్యారెక్టర్ గురించి ఎక్కువగా రివీల్ చేయకూడదు. ఇందులో నా పాత్ర స్టోరీకి ఒక బ్రిడ్జ్‌లా ఉంటుంది. ఒక స్పోర్ట్స్‌మన్ జీవితంలో ఫ్యామిలీ రోల్ చాలా కీలకం. ఇందులో వైఫ్ అండ్ హస్బెండ్ ఏ నిర్ణయం అయినా కలిసి తీసుకుంటారు. కథ మూడు టైమ్‌లైన్స్‌లో సాగుతుంది. నా పాత్ర కూడా ఇవాల్వ్ అవుతూ ఉంటుంది. పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న మంచి ఇంపాక్ట్‌ఫుల్ రోల్ చేశాను'' అని మాళవిక నాయర్ చెప్పింది.

''శర్వానంద్ నేనూ రియల్ లైఫ్‌లో మేమిద్దరం కూడా ఇంట్రోవర్ట్స్. పెద్దగా మాట్లాడుకోము. కానీ సినిమాలో క్యారెక్టర్ల పరంగా మంచి కెమిస్ట్రీ కుదిరింది. శర్వా చాలా స్పాంటేనియస్‌గా ఉంటారు. ప్రమోషన్స్‌లో ఇంకా బాగా ఇంటరాక్ట్ అయ్యాం. రాజశేఖర్ గారితో కూడా నాకు సీన్స్ ఉన్నాయి. ఆయనతో కలిసి నటించడం మంచి అనుభవం. అంత సీనియర్ అయినప్పటికీ సెట్లో అందరితో చాలా క్లోజ్‌గా ఉంటారు. మనం ఏదైనా చెబితే వింటారు. అది చాలా గొప్ప గుణం. చాలా కైండ్ పర్సన్'' అని తెలిపింది.

''మోటోక్రాస్ స్పోర్ట్‌ను షూట్ చేయడం చాలా కష్టం. మ్యూజిక్ టెక్నికల్‌గా ఖచ్చితంగా మంచి హై ఇస్తుంది. అలాగే ఇందులో మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. ఫాదర్-సన్ ఎమోషన్ ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సినిమాలో ప్రతి పాత్రకు మంచి ఆర్క్ ఉంటుంది. సినిమా చూసిన ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. సినిమా మంచి స్పూర్తిని ఇస్తుంది. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది'' అని మాళవిక చెప్పుకొచ్చింది. మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న 'బైకర్' చిత్రం ఆమెకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam