Nepal Floods In Google Trends: నేపాల్‌లో సంభవించిన మెరుపు వరద భీభత్సానికి సంబంధించి ప్లానెట్ ల్యాబ్స్ విడుదల చేసిన శాటిలైట్ ఫోటోలు విధ్వంసాన్ని కళ్లకు కడుతున్నాయి.
ఈ విపత్తులో ఇప్పటి వరకు కనీసం 98 మంది ప్రాణాలు కోల్పోగా.. వందల మంది గల్లంతయ్యారు. వీరిలో 133 మంది భారతీయులు ఉన్నారు. అయితే, ఆస్తి, ప్రాణనష్టం భారీగానే ఉంటుందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. టిబెట్ సరిహద్దు ప్రాంతంలో బుధవారం సంభవించిన ఆకస్మిక వరదలకు పలు గ్రామాలు, ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. రసువాగధి బోర్డర్‌కు ఈశాన్యంగా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేపాల్-చైనా సరిహద్దు గ్లేసియర్ ప్రాంతంలో భారీ మంచు, కొండచరియలు విరిగిపడినట్టు నేపాల్ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
ఆ మంచు చరియలు ఒక గ్లేసియల్ సరస్సులో పడటం లేదా నదీ ప్రవాహాన్ని అడ్డుకోవడంతో హిమనాదీ మంచు, కరిగిన నీరు, బురద వ్యర్థాలతో కూడిన వరద తీవ్ర ఉద్ధృతితో లేండే ఖోలా గుండా భోటే కోషి నదిలోకి ప్రవహించింది. ఆగస్టు 25, 26 తేదీలకు సంబంధించిన శాటిలైట్ ఫోటోలను పక్కపక్కనే ఉంచి, వరదలకు ముందు, తర్వాత అక్కడి పరిస్థితులను పోల్చి చూపుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది.
నేపాల్ ప్రధాన మంత్రి బాలేన్ షాతో మాట్లాడిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ''నేపాల్‌కు సాధ్యమైన అన్ని రకాల మానవతా సహాయాన్ని అందించడానికి భారత్ సిద్ధంగా ఉంది. సహాయ, పునరావాస చర్యలలో అక్కడి అధికారులతో మన బృందాలు నిరంతరం సమన్వయం చేసుకుంటున్నాయి'' అని ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
గతేడాది ఆగస్టులో కూడా ఇదే ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా టిబెట్‌లోని ఒక హిమానీ నది సరస్సు పొంగిపొర్లి ఇలాంటి మెరుపు వరదలే సంభవించాయి. ఆ ఘటనలో తొమ్మిది మంది మరణించగా, నేపాల్-చైనాలను కలిపే ఒక కీలక వంతెనతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

గూగుల్ ట్రెండ్స్‌లో నేపాల్ వరదలు..
నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు పొరుగునే ఉన్న భారత ప్రజలను ఉలిక్కి పడేలా చేశాయి. ఈ వరదల్లో పెద్ద సంఖ్యలో భారతీయ యాత్రికులు చనిపోవడంతో.. నేపాల్ వరదల గురించిన భారత్‌లోనూ ఎక్కువగా సెర్చ్ చేశారు. దీంతో Nepal Floods అనే పదం 2 లక్షలకుపైగా సెర్చ్ వాల్యూమ్‌తో గూగుల్ ట్రెండ్స్‌లో నిలిచింది. నేపాల్ వరదల గురించి ఆ దేశం పొరుగునే ఉన్న హిమాలయ రాష్ట్రం సిక్కింలో ఎక్కువ మంది సెర్చ్ చేశారు. ఆ తర్వాత మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు కూడా ఎక్కువగా నేపాల్ వరదల గురించి గూగుల్‌లో వెతికారు.
