తెలంగాణ ప్రభుత్వం వైద్యారోగ్యశాఖను బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు. కొత్త ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణం, వైద్య సిబ్బంది నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇక పెద్దాసుపత్రుల్లో అత్యాధునిక వైద్య పరికరాలతో పేదలకు వైద్యం అందిస్తున్నారు. తాజాగా.. ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్‌కే పరిమితమైన అత్యాధునిక రేడియేషన్ థెరపీ చికిత్సలు హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్‌లో అందుబాటులోకి వచ్చాయి. అత్యంత కచ్చితత్వంతో కూడిన రేడియేషన్ ట్రీట్‌మెంట్ అందించే ట్రూబీమ్ లీనియర్ యాక్సిలరేటర్ యంత్రాన్ని హాస్పిటల్‌లో ప్రవేశపెట్టారు. దీని ధర రూ.30 కోట్ల వరకు ఉంటుందని నిమ్స్ డైరెక్టర్ బీరప్ప తెలిపారు.
సాధారణ రేడియేషన్ థెరపీతో కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. క్యాన్సర్ కణితులతోపాటు పక్కనే ఉన్న ఆరోగ్యకరమైన కణాలూ దెబ్బతిని పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అత్యాధునిక ట్రూబీమ్ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యంత్రం హైరెజల్యూషన్ ఇమేజింగ్‌తోపాటు ట్యూమర్ కదలికను ట్రాక్ చేసి నాశనం చేస్తుంది. క్యాన్సర్ కణితి చుట్టూ ఉన్న ఆరోగ్యకరమైన కణజాలానికి ఏ మాత్రం నష్టం చేయకుండా రేడియేషన్ చేస్తుంది. చర్మంపై నుంచి ట్యూమర్ ఎంత లోతు కణజాలంలో ఉన్నా దానిని పక్కగా గుర్తించి తొలగిస్తుంది.
ఫలితంగా లోతుగా ఉన్న వీర్యగ్రంథి, క్లోమగ్రంథి, కాలేయంలో ఉన్న క్యాన్సర్ కణితులకు సైతం సర్జరీ అవసరం లేకుండా చికిత్స చేసే అవకాశం ఉంటుందని నిమ్స్ డాక్టర్లు వెల్లడిస్తున్నారు. అత్యాధునిక సాంకేతికతతో మెదడు, ఊపిరితిత్తులు, వెన్నెముక, కాలేయం వంటి సున్నిత ప్రాంతాల్లోని అతి చిన్న ట్యూమర్లను తక్కువ సెషన్లతో అత్యధిక డోసుతో ట్రీట్‌మెంట్ అందిస్తుంది. ఈ ట్రూబీమ్ ద్వారా ఒక్కో సెషన్ కొన్ని నిమిషాల్లోనే పూర్తవుతుందని నిమ్స్ డైరెక్టర్ బీరప్ప తెలిపారు. ప్రైవేటులో రూ.లక్షలు వ్యయమయ్యే చికిత్సలను నిమ్స్ హాస్పిటల్‌లో పేదలకు ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. మిగతా వారికి అతి తక్కువ ఖర్చుతో ట్రీట్‌మెంట్ అందించనున్నట్లు డాక్టర్ బీరప్ప వెల్లడించారు.
నిమ్స్‌లో అత్యాధునిక యంత్రం అందుబాటులోకి..
ఇక అత్యాధునిక సదుపాయాలతో నిర్మిస్తున్న తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) హాస్పిటల్ కేవలం రాష్ట్ర ప్రజలకే కాకుండా విదేశీ రోగులకు కూడా అందుబాటులోకి తీసుకురావాలని సర్కార్ నిర్ణయించింది. జూన్ 2న సనత్ నగర్, అల్వాల్ టిమ్స్ ఆస్పత్రులను ప్రారంభించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోండగా.. ఇందులో విదేశీ రోగులకు కూడా చికిత్సలు అందించనున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రత్యేక ఇంటర్నేషనల్ పేషెంట్ వింగ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

