ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ అనారోగ్యంతో మృతి చెందాడు. హనుమకొండకు చెందిన పొనుగంటి నిరంజన్.. కొంతకాలంగా కిడ్నీ సమస్యలు, అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో పోరాడుతున్నాడు.
అయితే ఆరోగ్యం మరింత విషమించటంతో హనుమాన్ నగర్‌లోని తన ఇంట్లో కన్నుమూశాడు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిరంజన్‌ను కలిసిన క్షణాలు ఇంకా తన మదిలో సజీవంగా ఉన్నాయన్న పవన్ కళ్యాణ్.. ఇంతలోనే అతను లేడన్న వార్త తన హృదయాన్ని కలిచివేస్తోందని ఎమోషనల్ అయ్యారు. ఈ వయసులోనే నిరంజన్ చూపించిన ధైర్యం, అతని చిరునవ్వు తన హృదయంలో ఎప్పటికీ నిలిచి ఉంటాయంటూ భావోద్వేగంతో ట్వీట్ చేశారు.
" నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది. కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి.. నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు.. ఇవన్నీ ఎప్పటికీ మరవలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. నిరంజన్ శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపించిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. "
"అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ప్రియమైన నిరంజన్.. నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను" అంటూ పవన్ కళ్యాణ్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
అరుదైన జన్యు సంబంధిత వ్యాధి కారణంగా మంచానికే పరిమితమైన నిరంజన్‌కు పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన అభిమానం. ఈ విషయాన్ని తెలుసుకున్న రాధా మనోహర్ దాస్.. పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇటీవలే నిరంజన్ ఇంటికి వచ్చిన పవన్ కళ్యాణ్.. తన అభిమానిని ఆప్యాయంగా పలకరించారు. శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. అండగా ఉంటామంటూ అతని కుటుంబానికి ధైర్యం చెప్పారు. నిరంజన్ కోరిన కుక్కపిల్లను గంటల్లోనే అందించటంతో పాటుగా ఆ కుటుంబం వ్యాపారం చేసుకునేందుకు సహకరిస్తామని మాట ఇచ్చారు. అనంతరం బండ్ల గణేష్ వంటి ప్రముఖులు కూడా నిరంజన్ కుటుంబాన్ని పరామర్శించి.. అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అయితే ఈలోపే నిరంజన్ చనిపోవటంతో పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు.

