నిర్మల్ జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఫ్రిడ్జ్ పేలి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బంగల్‌పేట్ వద్ద మహాలక్ష్మివాడలోని డబుల్ బెడ్‌రూం ఇళ్లు సి బ్లాక్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఫ్రిడ్జ్ పేలిన సమయంలో ఇంట్లో ఉన్న ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. దీంతో స్థానికులు వారిని అంబులెన్సులో జిల్లా కేంద్ర హాస్పిటల్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఓ మహిళతో పాటు ఇంటి యజమాని ఒడిసెల విజయ్ ప్రాణాలు కోల్పోయారు. మరణించిన మహిళ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వేసవిలో ఫ్రిడ్జ్‌లు ఎందుకు పేలుతాయి..?
కాగా, వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల కంప్రెషర్లపై అదనపు భారం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. వోల్టేజ్ హెచ్చుతగ్గులు, నాణ్యత లేని వైరింగ్, ఫ్రిడ్జ్ వెనుక భాగంలో గాలి సరిగ్గా ఆడకపోవడం వల్ల కంప్రెషర్ వేడెక్కి పేలుడుకు దారితీస్తుందని అంటున్నారు. ముఖ్యంగా పాత గ్యాస్ లీకేజీలు విద్యుత్ స్పార్క్‌తో కలిసినప్పుడు ప్రమాద తీవ్రత పెరుగుతుందని చెబుతున్నారు. ఫ్రిడ్జ్ గోడకు ఆనించి ఉంచకూడదని.. కనీసం ఒక అడుగు దూరం ఉంచడం వల్ల వేడి బయటకు పోతుందని సూచిస్తున్నారు. వోల్టేజ్ హెచ్చుతగ్గుల నుండి రక్షించుకోవడానికి నాణ్యమైన స్టెబిలైజర్‌ను తప్పనిసరిగా వాడాలని చెబుతున్నారు.
వేసవి ప్రారంభానికి ముందే ఏసీ, ఫ్రిడ్జ్ కంప్రెషర్లను, గ్యాస్ లీకేజీలను నిపుణులతో తనిఖీ చేయించాలని సూచిస్తున్నారు. పాత ఇంట్లోని వైరింగ్ లోపాలు ఉంటే మార్పించాలని.. సాకెట్లలో ఓవర్ లోడ్ కాకుండా చూసుకోవాలని చెబుతున్నారు. నిరంతరాయంగా వాడకుండా మధ్యలో వాటికి కాసేపు విరామం ఇవ్వటం ఉత్తమమని అంటున్నారు. ఫ్రిడ్జ్ వెనుక భాగంలో ధూళి, చెత్త పేరుకుపోకుండా చూసుకోవాలని.. ధూళి వల్ల వేడి సరిగ్గా బయటకు వెళ్లక కంప్రెషర్ ఓవర్ హీట్ అవుతుందని సూచిస్తున్నారు. 10-15 ఏళ్ల కంటే పాతవైన ఫ్రిడ్జ్‌లు లేదా ఏసీలు అధిక విద్యుత్ వినియోగించడమే కాకుండా ప్రమాదాలకు కేంద్రంగా మారతాయని.. వీలైతే పాత వాటిని మార్చి కొత్తవి ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు.

