Dailyhunt
Nora Fatehi: కేడీ సాంగ్ వివాదం.. హీరోయిన్‌పై మహిళా కమిషన్ సీరియస్

Nora Fatehi: కేడీ సాంగ్ వివాదం.. హీరోయిన్‌పై మహిళా కమిషన్ సీరియస్

Telugu Samayam 1 week ago

ధ్రువ సర్జా హీరోగా కన్నడ డైరెక్టర్ ప్రేమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కేడీ: ది డెవిల్‌'. ఇందులోని 'సర్కే చునార్‌ తేరీ సర్కే' అనే పాట వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.

బాలీవుడ్ యాక్టర్స్ సంజయ్‌ దత్‌ - నోరా ఫతేహిలపై చిత్రీకరించిన ఈ సాంగ్ లిరిక్స్, డ్యాన్స్ లపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపై కేంద్రం తీవ్రంగా స్పందించి, ఆ లోఅతని తొలగించాలని ఆదేశించింది. దీంతో యూట్యూబ్ తో సహా మిగతా అన్ని మ్యూజిక్ ఫ్లాట్ ఫామ్స్ నుంచి ఆ సాంగ్ డిలీట్ చేశారు. అయితే ఇప్పుడు 'కేడీ' పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్ అయింది.

'సర్కే చునార్‌ తేరీ సర్కే' వివాదంపై విచారణకు హాజరుకావాలంటూ ఆ పాటలో నటించిన నోరా ఫతేహి, సంజయ్‌ దత్‌లకు జాతీయ మహిళా కమిషన్ ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్‌ 6న విచారణకు హాజరు కావాలని పేర్కొంది. అయితే నోరా తరఫున ఆమె లాయర్‌ హాజరు కావడంపై మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నోరా కచ్చితంగా వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనని పేర్కొంది. ఏప్రిల్‌ 27వ తేదీ వరకూ సమయం ఇస్తున్నట్లు తెలిపింది. అలానే సంజయ్‌ దత్‌ ఏప్రిల్‌ 8న హాజరుకావాలని కమిషన్ ఆదేశించింది.

'కేడీ: ది డెవిల్‌' పాట వివాదం నేపథ్యంలో, దానితో సంబంధమున్న ప్రతీ ఒక్కరూ ఇప్పటికే స్పందించారు. హిందీ లిరిసిస్ట్ రకీబ్‌ ఆలం, దర్శకుడు ప్రేమ్‌, నిర్మాతలు క్షమాపణలు చెబుతూ మహిళా కమిషన్‌కు లేఖ రాశారు. ఆ పాటను యూట్యూబ్‌ తో సహా అన్ని ఫ్లాట్ ఫామ్స్ నుంచి తొలగించినట్లు తెలిపారు. దీనిపై మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ విజయ రహాత్కర్‌ స్పందిస్తూ.. 'సర్కే చునార్‌ తేరీ సర్కే' లిరిక్స్‌ అభ్యంతరకరంగా ఉండడమే కాకుండా.. మహిళల గౌరవాన్ని కించపరిచేలా అవమానకరంగా ఉన్నాయన్నారు. ఆ లిరిక్స్‌ అర్థం తెలియదని సాకులు చెప్పొద్దని చిత్ర బృందాన్ని ఆమె హెచ్చరించారు.

'సర్కే చునార్‌ తేరీ సర్కే' గీతానికి అర్జున్ జన్యా ట్యూన్ కంపోజ్ చేయగా.. హిందీ, తెలుగు వెర్షన్స్ ని సింగర్ మంగ్లీ ఆలపించారు. కన్నడ వెర్షన్ కి డైరెక్టర్ ప్రేమ్ లిరిక్స్ రాయగా.. హిందీలో మాత్రం రకీబ్‌ ఆలం సాహిత్యం అందించారు. తెలుగులో 'జరిపే నాతో పండగ జరిపే' అంటూ చంద్రబోస్ లిరిక్స్ రాశారు. పాట వివాదాస్పదంగా మారడంతో సింగర్ మంగ్లీ స్పందిస్తూ క్షమాపణలు చెప్పారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం తమకు లేదని, అనుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు చింతిస్తున్నామని మంగ్లీ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. దర్శకుడు ప్రేమ్‌ స్పందిస్తూ.. ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం చిత్రీకరించిన పాట మాత్రమేనని.. ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం తమకు లేదని క్లారిటీ ఇచ్చారు. 'కేడీ: ది డెవిల్‌' మూవీ ఏప్రిల్‌ 30న థియేటర్లలో విడుదల కానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam