Dailyhunt
ఒకే కుటుంబం.. మూడు పార్టీలు.. ముగ్గురూ విజేతలే: తమిళనాడులో పొలిటికల్ జాక్‌పాట్ కొట్టిన ఫ్యామిలీ

ఒకే కుటుంబం.. మూడు పార్టీలు.. ముగ్గురూ విజేతలే: తమిళనాడులో పొలిటికల్ జాక్‌పాట్ కొట్టిన ఫ్యామిలీ

Telugu Samayam 1 week ago

Santiago Martin Family TN Election Win: ఒక కుటుంబానికి చెందిన వారు దాదాపుగా ఒకే పార్టీలో ఉంటారు. ఎక్కడో ఓ చోట మాత్రమే ఒకే కుటుంబంలోని వ్యక్తులు వేర్వేరు పార్టీల్లో కొనసాగుతూ కనిపిస్తుంటారు.

ఇంట్లో గొడవలు రావడం వల్లో.. ఒకే పార్టీలో ఉంటే తాము ఆశించిన టికెట్లు రావని భావించి మాత్రమే వేర్వేరు పార్టీల్లో చేరుతుంటారు. తీరా టికెట్లు పొందినా ఎవరో ఒకరే గెలవడమో, ఓడిపోవడమో జరుగుతుంది. కానీ మనం ఇప్పుడు చూడబోయే ఓ కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు మాత్రం.. మూడు వేర్వేరు పార్టీల నుంచి.. మూడు వేర్వేరు చోట పోటీ చేశారు. ముగ్గురూ విజయం సాధించి.. పొలిటికల్ జాక్‌పాట్ కొట్టిన ఫ్యామిలీగా రికార్డు సృష్టించారు. మరి వారెవరో, ఏయే పార్టీల తరఫున వారు పోటీ చేశారో మనం ఇప్పుడు తెలుసుకందాం పదండి.

లాల్‌గుడిలో 'లీమారోజ్' ప్రభంజనం

శాంటియాగో మార్టిన్ భార్య లీమారోజ్ మార్టిన్ తమిళనాడులోని లాల్‌గుడి నియోజకవర్గం నుంచి ఏఐఏడీఎంకే అభ్యర్థిగా పోటీ చేసి సంచలనం సృష్టించారు. గత 20 ఏళ్లుగా డీఎంకేకు కంచుకోటగా ఉన్న ఈ స్థానాన్ని ఆమె కైవసం చేసుకున్నారు. టీవీకే అభ్యర్థి కుపా కృష్ణన్‌పై 2,739 ఓట్ల మెజారిటీతో, డీఎంకే అభ్యర్థి టి. పరివల్లాపై 5,000 పైగా ఓట్ల తేడాతో ఆమె గెలుపొందారు. ఎన్నికలకు కొద్దిరోజుల ముందే ఏఐఏడీఎంకేలో చేరిన ఆమెకు ఎడప్పాడి పళనిస్వామి పార్టీ మహిళా విభాగం జాయింట్ సెక్రటరీ పదవిని కూడా కట్టబెట్టారు.

విజయ్ పార్టీలో అల్లుడి జోరు..

మరోవైపు మార్టిన్ అల్లుడు ఆధవ్ అర్జున నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) తరపున విక్కివాక్కం నియోజక వర్గంలో పోటీ చేశారు. టీవీకే జనరల్ సెక్రటరీగా ఉన్న ఆయన.. డీఎంకే అభ్యర్థి కార్తీక్ మోహన్‌పై 17,302 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. గత రెండు పర్యాయాలుగా డీఎంకే గెలుస్తున్న ఈ స్థానంలో టీవీకే జెండా పాతడం ద్వారా ఆధవ్ అర్జున తన రాజకీయ సత్తాను చాటుకున్నారు.

ఇదీ చూడండి: తమిళనాడు ఎన్నికల ఫలితాలు: రాజకీయ ధురంధరులను ఓడించిన టీవీకే ఆటో డ్రైవర్..

పుదుచ్చేరిలో సొంత పార్టీతో కొడుకు విజయం..

తమిళనాడులోనే కాకుండా పుదుచ్చేరిలోనూ మార్టిన్ కుటుంబం జైత్రయాత్ర కొనసాగింది. శాంటియాగో మార్టిన్ కుమారుడు జోస్ చార్లెస్ మార్టిన్.. తన సొంత పార్టీ అయిన లచ్చియ జననాయక కట్చి (ఎల్‌జేకే) తరపున కామరాజ్ నగర్ నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిని 10,000 ఓట్ల తేడాతో ఓడించి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పుదుచ్చేరిని సింగపూర్, హాంగ్‌కాంగ్‌లా మారుస్తానని ఆయన చేసిన వాగ్దానం ఓటర్లను ఆకట్టుకుంది. దాని వల్లే ఈయన విజయం సాధించారని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు.


ఇదీ చూడండి: తమిళనాడు సీఎం స్టాలిన్‌ను మట్టికరిపించిన 75 ఏళ్ల టీవీకే అభ్యర్థి.. 30 ఏళ్ల తర్వాత ఓటమి, ఎవరీ వీఎస్ బాబు?

ఒకప్పుడు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ విరాళాలు ఇచ్చి వార్తల్లో నిలిచిన మార్టిన్ కుటుంబం.. ఇప్పుడు నేరుగా అధికార పీఠాలను అధిరోహించడం విశేషంగా నిలుస్తోంది. ముఖ్యంగా భార్య ఏఐఏడీఎంకేలో, అల్లుడు టీవీకేలో, కొడుకు సొంత పార్టీతో.. ఇలా అన్ని ప్రధాన పక్షాల్లో తమ ఉనికిని చాటుకోవడం ద్వారా ఏ కూటమి అధికారంలోకి వచ్చినా తమ పరపతి దెబ్బతినకుండా ఉండేలా మార్టిన్ కుటుంబం 'పొలిటికల్ జాక్‌పాట్' కొట్టిందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam