జస్ప్రీత్ బుమ్రా ఈ ఐపీఎల్‌లో దారుణంగా విఫలమయ్యాడు. వికెట్లు తీసుకోకపోయినా కనీసం రన్స్‌ని అయినా కంట్రోల్ చేయలేకపోయాడు. వాంఖడే వేదికగా లక్నోతో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్ చూసి సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు.
టెంపర్ కోల్పోయిన గవాస్కర్ నువ్వో ప్రొఫెషనల్ క్రికెటర్‌వి అంటూ సహనం కోల్పోయి కామెంట్రీలో అనేశాడు.
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా మూడు నో బాల్స్ వేశాడు. అందులో ఒకే ఓవర్‌లో రెండు నో బాల్స్ వేయడంతో సునీల్ గవాస్కర్ చిర్రెత్తిపోయాడు. అసలు వరల్డ్ నెంబర్ వన్ బౌలరేనా బౌలింగ్ చేస్తుంది అనేలా బుమ్రా బౌలింగ్ సాగడంతో కాస్తంత ఆగ్రహానికి గురయ్యాడు. వైడ్లు ఓకే, కానీ ఈ నో బాల్స్ ఏంటి అంటూ అరిచేశాడు. వెంటనే కెమెరామెన్ బౌలింగ్ కోచ్ మలింగాను చూయించడంతో ఇది నిజంగా పెద్ద లోపమే అనేశాడు.
మ్యాచ్ 14వ ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన బుమ్రా తొలి రెండు బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. మూడో బంతికి హిమ్మత్ సింగ్ కీపర్ క్యాచ్‌గా అవుటవ్వడంతో అందరూ సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. కానీ, థర్డ్ అంపైర్ వెంటనే నో బాల్ అని సిగ్నల్ ఇవ్వడంతో డిజప్పాయింట్ అయ్యారు. ఫ్రీ హిట్ బంతి వైడ్‌గా వెళ్లగా.. ఆ తర్వాత బంతి కూడా నో బాల్ అయింది. ఈ సారి బుమ్రా కాలు క్రీజుకు భారీగా అవతలికి వెళ్లింది. దాంతో ఇది ఏమాత్రం ఒప్పుకోవడానికి వీల్లేదని జస్ప్రీత్ బుమ్రాపై సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు.
ఎప్పుడూ పర్పుల్ క్యాప్ లిస్ట్‌లో ముందు వరుసలో ఉండే బుమ్రా ఈ ఏడాది విఫలమయ్యాడు. ఇప్పటి వరకు ముంబై ఆడిన పది మ్యాచ్‌లలోనూ బుమ్రా బౌలింగ్ చేశాడు. అందులో తొలి ఐదు మ్యాచ్‌లలో కనీసం ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయాడు. ఇప్పటి వరకు 37 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా కేవలం మూడంటే మూడు వికెట్లు మాత్రమే దక్కించుకున్నాడు. టీ20 వరల్డ్‌కప్ 2026లో 14 వికెట్లతో వరుణ్ చక్రవర్తితో సమానంగా అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా నిలిచిన బుమ్రా.. ఐపీఎల్ 2026లో మాత్రం దారుణంగా విఫలమవుతుండటంతో టీమిండియా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.

