Dailyhunt
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కష్టాలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం, మే 1 నుంచి కొత్త విధానం

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కష్టాలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం, మే 1 నుంచి కొత్త విధానం

Telugu Samayam 2 weeks ago

తెలంగాణలో పని చేస్తున్న ప్రభుత్వ ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు నిజంగా ఇది తీపి కబురే. ఇక నుంచి రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే వీరికి కూడా సమయానికే జీతాలు చెల్లించనున్నారు.

ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తోంది. అయితే ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు మాత్రం జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. కొన్ని శాఖలు మొదటి వారంలో, మరికొన్ని రెండో వారంలో, ఇంకొన్ని శాఖల్లో అయితే ఏకంగా నెల చివరన చెల్లిస్తున్నారు. కొందరికైతే రెండు, మూడు నెలలకు ఒకసారి జీతాలు అకౌంట్లలో జమ అవుతున్నాయి. దీంతో ఆయా ఉద్యోగుల కుటుంబ ఆర్థిక పరిస్థితి భారంగా మారుతోంది. ఉద్యోగులు తమ ఖర్చుల కోసం అప్పులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక నుంచి ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది.

అందుకోసం అన్ని ప్రభుత్వ శాఖలకు సర్క్యులర్ జారీ చేసినట్లు సమాచారం. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సేవలు అందించే ఏజెన్సీలకు వారం రోజుల ముందే ఆయా బిల్లులు చెల్లించాలని సర్క్యులర్‌లో ఆదేశించినట్లు తెలిసింది. తద్వారా ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది. ఏప్రిల్ నెల జీతం మే ఒకటో తేదీన ఉద్యోగుల ఖాతాల్లో పడేవిధంగా ప్రణాళికలు సిద్ధం రెడీ చేసినట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ అధికారులు అన్ని శాఖలకు, హెచ్‌వోడీలకు లేఖలు రాసింది.

ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఇచ్చే విధంగా ప్రణాళిక రూపొందించాలని లేఖల్లో సూచించారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను ప్రతి నెల 25వ తేదీ నుంచి తర్వాతి నెల 25వ తేదీ వరకు ఒక నెలగా పరిగణించి బిల్లులను క్లెయిమ్ చేస్తుంటారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఇదే పద్ధతిలో జీతాలు చెల్లించాలని భావిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల దాదాపు 5 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. అయితే ఏజెన్సీలు బాధ్యతగా అటెండెన్స్‌ను ప్రతి నెల 25వ తేదీ లోపు సంబంధిత శాఖలకు సమర్పించాల్సి ఉంటుందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ప్రస్తుతం కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపు విషయంలో సదరు ఏజెన్సీలపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉండటం లేదు. అయితే ఇక నుంచి ఒకటో తేదీనే జీతాల చెల్లింపు, పీఎఫ్, ఇతర అంశాలను ఆర్థిక శాఖ పర్యవేక్షించనుంది. అందుకోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించినట్లు సమాచారం. ఈ పోర్టల్‌లోనే ఏజెన్సీలు విధిగా ఉద్యోగుల వివరాలను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు అందించిన ఆయా ఏజెన్సీలకు వారం రోజుల ముందే ప్రతి నెల బిల్లులు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏజెన్సీలు తమ వాటా కింద పీఎఫ్, ఈఎస్‌ఐ చెల్లించకపోతే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam