టీ20 వరల్డ్‌కప్ ముందు జరిగిన పెద్ద రచ్చ అందరికీ గుర్తే ఉంటుంది. ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను ఐపీఎల్ నుంచి తొలగించిన తర్వాత బంగ్లాదేశ్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
పాకిస్తాన్ సపోర్ట్‌తో ఏకంగా టీ20 వరల్డ్‌కప్ నుంచే వైదొలిగింది. భారత్‌లో టీ20 వరల్డ్‌కప్ ఆడే ప్రసక్తే లేదంటూ టోర్నీ నుంచి నిష్క్రమించింది. కట్ చేస్తే ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. అప్పట్లో విర్రవీగిన బంగ్లాదేశ్ ఇప్పుడు కాళ్లబేరాలకు వచ్చింది. అన్నీ మరచిపోయి మాతో క్రికెట్ ఆడండంటూ భారత్‌ను బతిమిలాడుకుంటోంది.
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ నజ్ముల్ ఫాహీమ్ బీసీసీఐకి ఒక లేఖ రాశారు. అందులో భారత్‌ను తమ దేశంలో క్రికెట్ ఆడాలంటూ ఆహ్వానించారు. అదేవిధంగా ఇరు దేశాల మధ్య మళ్లీ ఫ్రెష్‌గా క్రికెట్ సంబంధాలు కొనసాగించాలని ఆయన కోరారు. బంగ్లాదేశ్ రాజకీయాల్లో వచ్చిన మార్పులు కూడా ఇందుకు ఒక కారణంగా కనిపిస్తోంది.
"మేము ఇతర దేశాల క్రికెట్ బోర్డులతో సాధారణంగా కమ్యూనికేషన్ కొనసాగిస్తూనే ఉంటాం. అదే క్రమంలో బీసీసీఐకి కూడా మెయిల్ ద్వారా ఒక లేఖని పంపాం" అంటూ బీసీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ నజ్ముల్ ఫాహీమ్ ఓ అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీకి వివరించారు.
"తాజాగా బీసీసీఐకి ఓ లేఖ పంపాము. సెప్టెంబర్‌లో భారత జట్టు బంగ్లాదేశ్‌లో సిరీస్ ఆడాలని కోరాము. అదేవిధంగా అన్నీ సజావుగా ఉంటే మా మహిళా జట్టును భారత్‌లో ఆడేందుకు పంపిస్తాము. ఇప్పటి వరకు జరిగినవన్నీ వదిలేసి ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య సంబంధాలు మళ్లీ ఫ్రెష్‌గా స్టార్ట్ చేద్దామని అడిగాము" అంటూ నజ్ముల్ తెలిపారు.
గత కొంతకాలంగా భారత్ - బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు కూడా సరిగాలేవు. అయితే, ఏప్రిల్ 7-8 తేదీల్లో బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ మంత్రి రెహ్మాన్ భారత పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ కూడా బీసీసీఐకి లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పరిస్థితులన్నీ చూస్తే రానున్న సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్ - భారత్ సిరీస్ జరిగే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

