Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాకిస్థాన్‌లో మదర్సా విస్తరణ కోసం.. 100 ఏళ్లనాటి పురాతన హిందూ దేవాలయం కూల్చివేత!

పాకిస్థాన్‌లో మదర్సా విస్తరణ కోసం.. 100 ఏళ్లనాటి పురాతన హిందూ దేవాలయం కూల్చివేత!

Telugu Samayam 2 weeks ago

Pakistan Hindu Temple Demolition: పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రాంతంలో శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన ఒక ప్రాచీన హిందూ దేవాలయం దారుణంగా ధ్వంసమైంది.

లాహోర్‌కు సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న నారోవాల్ జిల్లాలోని సిరాజ్ గ్రామంలో దాదాపు 1000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న 125 ఏళ్ల నాటి ఈ ఆలయాన్ని ఆగస్టు 21వ తేదీన కూల్చివేశారు. పక్కనే ఉన్న మదర్సాను విస్తరించేందుకు.. ఆ స్థలాన్ని ఆక్రమించుకునే కుట్రలో భాగంగానే నిషేధిత మత తీవ్రవాద సంస్థ 'తహ్రీక్-ఇ-లబ్బాయిక్ పాకిస్థాన్' (టీఎల్‌పీ)కి చెందిన ఆకతాయిలు ఈ ఆకృత్యానికి పాల్పడ్డారని స్థానిక మైనార్టీ సంఘాలు, మానవ హక్కుల నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

ఆధారాలు మాయం.. అధికారుల నిర్లక్ష్యంపై నిరసనలు

పాకిస్థాన్ మసీహా మిల్లత్ పార్టీ (పీఎమ్ఎమ్‌పీ) ఛైర్మన్ అస్లాం పర్వేజ్ సహోత్రా ఈ దారుణాన్ని తీవ్రంగా ఖండించారు. పంజాబ్ ప్రావిన్స్ అదనపు హోం కార్యదర్శిని కలసి వినతిపత్రం సమర్పించిన ఆయన.. ఆలయాన్ని ధ్వంసం చేయడమే కాకుండా దాని గోపురంపై ఉన్న లోహపు అమరికలు, ఇటుకలు, ఇతర పురాతన సామాగ్రిని సైతం అక్కడి నుంచి మాయం చేశారని ఆరోపించారు. గతంలో ఈ స్థలాన్ని ఇవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్ (ఈటీపీబీ) మదర్సాకు లీజుకు ఇచ్చినప్పటికీ.. అద్దె చెల్లించకపోవడంతో లీజు రద్దయిందని తెలిపారు. ఆక్రమణదారులను ఖాళీ చేయించాలని జనవరిలోనే ఉత్తర్వులు వచ్చినా అధికారులు అమలు చేయకపోవడం వల్లే ఈ అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

భయంతో వణికిపోతున్న హిందువులు..!

నారోవాల్ జిల్లా శాంతి కమిటీ సభ్యుడు, హిందూ నాయకుడు రతన్ లాల్ మాట్లాడుతూ.. మదర్సా నిర్వాహకుల బెదిరింపుల కారణంగా స్థానిక హిందువులు ఆ ప్రాంతానికి వెళ్లడానికి కూడా భయపడుతున్నారని తెలిపారు. ధ్వంసమైన ఆలయాన్ని యథావిధిగా పునరుద్ధరించాలని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే పంజాబ్‌లోని హిందూ, సిక్కు, క్రిస్టియన్ మైనార్టీల ప్రార్థనా మందిరాలకు రక్షణ కల్పించాలని ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, పంజాబ్ సీఎం మర్యమ్ నవాజ్ ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

వర్షాల వల్లే కూలిపోయిందంటూ ప్రభుత్వం సమర్థన..!

అయితే ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరు వివాదాస్పదంగా మారింది. ఈటీపీబీ సీనియర్ అధికారి రాణా ఇఫ్తిఖార్ మాట్లాడుతూ.. ఈ ఆలయం చాలా పురాతనమైనదని, భారీ వర్షాల కారణంగానే కూలిపోయిందని ఆరోపణలను తోసిపుచ్చే ప్రయత్నం చేశారు. ఆలయ స్థలాన్ని ఎవరికీ లీజుకు ఇవ్వలేదని, స్థలాన్ని పరిశీలించి ఉన్నతాధికారులు దాని పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటారని వివరణ ఇచ్చారు. అయినప్పటికీ.. ఏప్రిల్ నెలలోనే ఈ ఆలయ భద్రతపై పోలీసులకు ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ నిర్లక్ష్యం వహించారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam