Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పదవి నుంచి తప్పించాలని సింగిల్‌ జడ్జి తీర్పు.. హైకోర్టులో అప్పీల్ చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్‌

పదవి నుంచి తప్పించాలని సింగిల్‌ జడ్జి తీర్పు.. హైకోర్టులో అప్పీల్ చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్‌

Telugu Samayam 1 week ago

శాంతా శ్రీరామ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ అప్పీల్‌కు వెళ్లారు.

తనను హైడ్రా కమిషనర్‌ బాధ్యతల నుంచి తప్పించి మరో అధికారిని నియమించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇచ్చిన ఆదేశాలు, తనపై చేసిన వ్యాఖ్యలను ఆయన సవాలు చేశారు. తీర్పు వెలువడిన నెలరోజుల తర్వాత అప్పీల్‌ దాఖలు కావడంతో తదుపరి విచారణపై ఆసక్తి నెలకొంది.

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి మండలం లోతుకుంట గ్రామంలోని సర్వే నంబర్లు 1, 2లో ఉన్న సుమారు 40 ఎకరాల భూమిలో హైడ్రా చేపట్టిన కూల్చివేతలను సవాలు చేస్తూ శాంతా శ్రీరామ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కోర్టును ఆశ్రయించింది. జులై 17న జరిగిన కూల్చివేతలను ప్రస్తావిస్తూ దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై జస్టిస్‌ జూకంటి అనిల్‌కుమార్‌ విచారణ చేపట్టారు. వివాదాస్పద ఆస్తికి సంబంధించి గతంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు అమల్లో ఉండగానే హైడ్రా అధికారులు యంత్రాలు, సిబ్బందితో భూమిలోకి ప్రవేశించడం కోర్టు ఆదేశాల ఉల్లంఘనకు దారితీసిందని సింగిల్‌ జడ్జి తీవ్రంగా వ్యాఖ్యానించారు. పరిపాలనలో వ్యక్తుల ఆధిపత్యం కాకుండా చట్టపాలన కొనసాగాల్సిన అవసరాన్ని న్యాయస్థానం స్పష్టం చేసింది.

పదవిలో కొనసాగుతున్న అధికారిపై ఏడాదిన్నర వ్యవధిలో 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు పెండింగ్‌లో ఉండటాన్ని న్యాయస్థానం అసాధారణ అంశంగా పేర్కొంది. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 9,290 కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఒక అధికారిపై ఇంత సంఖ్యలో పిటిషన్లు ఉండటం ఆందోళన కలిగించే అంశమని వ్యాఖ్యానించింది. హైడ్రాను ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో 99 ప్రకారం ప్రభుత్వ ఆస్తులను, ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఆస్తులను పరిరక్షించడం కమిషనర్‌ బాధ్యతల్లో ముఖ్యమైనదని కోర్టు పేర్కొంది. ఒకే భూవివాదానికి సంబంధించి మూడుసార్లు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు కావడం, హైడ్రాపై 60కి పైగా పిటిషన్లు ఉండటాన్ని కూడా న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది.

ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కరణ విచారణను ముగిస్తూ రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్‌ బాధ్యతల నుంచి బదిలీ చేసి, ఆ స్థానంలో మరో అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించింది. గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన టాటా మోహన్‌రావు కేసు తీర్పును ప్రస్తావిస్తూ శిక్షించడం కంటే క్షమించడంలో ఔన్నత్యం ఉందన్న భావనను కూడా న్యాయస్థానం పేర్కొంది. సింగిల్‌ జడ్జి తీర్పుతో పాటు తనపై చేసిన వ్యాఖ్యలు, బదిలీకి సంబంధించిన సూచనలను సవాలు చేస్తూ రంగనాథ్‌ హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేశారు. కోర్టు ధిక్కరణ వ్యవహారంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్‌ బెంచ్‌ ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది. అప్పీల్‌ విచారణలో వెలువడే తదుపరి ఆదేశాల ఆధారంగా హైడ్రా కమిషనర్‌ పదవిపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam