Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పని ఇప్పిస్తానని తీసుకెళ్లి మహిళను బావిలో తోసేసింది 21 ఏళ్ల కుర్రాడు.. ఇంత క్రూరానికి ఎందుకు ఒడిగట్టాడంటే?

పని ఇప్పిస్తానని తీసుకెళ్లి మహిళను బావిలో తోసేసింది 21 ఏళ్ల కుర్రాడు.. ఇంత క్రూరానికి ఎందుకు ఒడిగట్టాడంటే?

Telugu Samayam 1 week ago

Karimnagar Well Survival Miracle: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో సంచలనం సృష్టించిన కూలీ మహిళ గంగాధర లక్ష్మి (55) హత్యాయత్నం కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

ఆన్‌లైన్ జూదానికి బానిసై, లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేకే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్ధారించారు. కరీంనగర్ టవర్ సర్కిల్ వద్ద అమరవీరుల స్థూపం సమీపంలో ప్రధాన నిందితుడితో పాటు దొంగిలించిన సొమ్మును కొనుగోలు చేసిన ఒక బంగారు వ్యాపారిని సైతం పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ క్రైమ్ మిస్టరీని ఛేదించడంలో సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ ఫుటేజ్ కీలక పాత్ర పోషించాయి.

లోన్ యాప్‌ల ఒత్తిడి.. ఈజీ మనీ కోసం స్కెచ్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా గొల్లపల్లి గ్రామానికి చెందిన 21 ఏళ్ల దమ్మ దినేష్ రెడ్డి అనే యువకుడు కరీంనగర్‌లోని ఒక ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో అతను ఈజీ మనీ కోసం ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు బానిసయ్యాడు. జూదంలో దాదాపు రూ. 4 లక్షల వరకు నష్టపోయాడు. ఈ అప్పులు తీర్చడం కోసం పలు ఆన్‌లైన్ లోన్ యాప్‌ల ద్వారా రుణాలు తీసుకున్నాడు. గడువు ముగియడంతో లోన్ యాప్ ఆపరేటర్లు డబ్బులు కట్టాలంటూ తీవ్రస్థాయిలో వేధింపులు, ఒత్తిడి ప్రారంభించారు. దీంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలనే క్రూరమైన ఆలోచనతో దినేష్ రెడ్డి దౌర్జన్యపూరిత దోపిడీకి ప్లాన్ వేశాడు.

పని ఆశ చూపి.. బావిలోకి తోసేసి పరార్!

ఈ నెల 1వ తేదీన కరీంనగర్ కూలీల అడ్డా వద్ద నిలబడిన వృద్ధురాలు గంగాధర లక్ష్మిని నిందితుడు దినేష్ రెడ్డి టార్గెట్ చేశాడు. తన తోటలో మంచి పని ఉందంటూ ర్యాపిడో బైక్‌ను బుక్ చేసి ఆమెను తిమ్మాపూర్ పరిధిలోని నుస్తులాపూర్ శివార్లకు తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతానికి చేరగానే ఆమెను బెదిరించి మెడలోని అర తులం బంగారు గొలుసు, 20 గ్రాముల వెండి వస్తువులను బలవంతంగా తీయించుకున్నాడు. ఆపై ఆమె పోలీసులకు చెబుతుందనే భయంతో పక్కనే ఉన్న లోతైన వ్యవసాయ బావిలోకి తోసేశాడు. అంతటితో ఆగకుండా ఆమె రక్షణ కోసం పట్టుకున్న తాడును కత్తితో కోసేసి చనిపోయి ఉంటుందని భావించి పారిపోయాడు. అయితే బాధితురాలు మోటార్ పైపు పట్టుకుని దాదాపు 21 గంటల పాటు బావిలోనే ప్రాణాలతో పోరాడింది. మరుసటి రోజు ఉదయం పొలం యజమాని, గ్రామస్థులు ఆమెను రక్షించి పోలీసులకు సమాచారం అందించారు.

ర్యాపిడో బుకింగ్.. టవర్ సర్కిల్ వ్యాపారి అరెస్ట్!

బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడు మహిళను తీసుకువెళ్లేందుకు ఉపయోగించిన ర్యాపిడో బైక్ బుకింగ్ మొబైల్ నంబర్, రూట్ పరిధిలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. దీని ఆధారంగా నిందితుడు దమ్మ దినేష్ రెడ్డిగా గుర్తిస్తూ.. కరీంనగర్ అమరవీరుల స్థూపం వద్ద అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో దినేష్ రెడ్డి తాను దొంగిలించిన బంగారాన్ని కరీంనగర్ టవర్ సర్కిల్ వద్ద నివాసముండే వేణు మనోహరాచారి అనే స్వర్ణకారుడికి విక్రయించి.. రూ. 30,000 నగదు తీసుకున్నట్లు అంగీకరించాడు. చోరీ సొత్తు అని తెలిసి కూడా తక్కువ ధరకు కొనుగోలు చేసినందుకు గాను సదరు గోల్డ్ ట్రేడర్ వేణు మనోహరాచారిని కూడా పోలీసులు నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam