Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పవన్ కళ్యాణ్ చలవ.. పిఠాపురం దశ తిరిగింది.. వందల కోట్లతో రూపురేఖలు మారేలా..

పవన్ కళ్యాణ్ చలవ.. పిఠాపురం దశ తిరిగింది.. వందల కోట్లతో రూపురేఖలు మారేలా..

Telugu Samayam 2 weeks ago

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో పిఠాపురం పట్టణం అభివృద్ధి దిశగా పయనిస్తోంది. పిఠాపురం పట్టణ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేలా వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు.

రూ.308 కోట్లతో భూగర్భ మురుగు నీటి వ్యవస్థ, పారిశుద్ధ్య సదుపాయాలు, మురుగు నీటి శుద్ధి కేంద్రాలు, రహదారులు, కాలువలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రం, పార్కుల అభివృద్ధి, తాగునీటి సరఫరా వంటి అభివృద్ధి పనులు చేపడుతున్నారు. పిఠాపురం అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు కోసం ప్రభుత్వం రూ.200 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో 120 కిలోమీటర్ల మేర భూగర్భ మురుగునీటి పైప్‌లైన్లను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, పిఠాపురంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

ఇక పిఠాపురం ప్రజల తాగు నీటి సమస్యకు చెక్ పెట్టేలా రూ. 59.52 కోట్లతో పనులు చేపడుతున్నారు. 600 కిలోలీటర్ల సామర్థ్యంతో నీటి నిల్వ ట్యాంకు నిర్మాణ పనులు సాగుతున్నాయి. మరో 400 కిలోలీటర్ల సామర్థ్యం గల నీటి నిల్వ ట్యాంకు నిర్మాణం త్వరలోనే ప్రారంభించనున్నారు. కొత్తగా 5 వేల తాగునీటి కొళాయి కనెక్షన్లు ఇవ్వనున్నారు. పిఠాపురం పట్టణానికి ఏలేశ్వరం జలాశయం నుంచి రోజుకు 55 లక్షల లీటర్ల నీటిని తరలించేందుకు పైప్‌లైన్ ఏర్పాటు జరుగుతోంది. రోజుకు రెండు పూటలా సురక్షితమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నారు.

పిఠాపురంలో రూ. 4 కోట్లతో తడి చెత్త నిర్వహణ కేంద్రం, రూ.1.43 కోట్లతో మల వ్యర్థాల శుద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. పట్టణంలోని 18,468 ఇళ్ల నుంచి రోజూ 25 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. ఇక మురుగు నీటి సమస్య పరిష్కారం కోసం రూ. 21.82 కోట్లతో రెండు భారీ మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం జరుగుతోంది. ఈ రెండు ప్లాంట్లు అందుబాటులోకి వస్తే, పిఠాపురంలో మురుగు నీటిని శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేసే వీలవుతుంది.అలాగే పిఠాపురం పురపాలక సంఘం పరిధిలో రహదారులు, కాలువల పనులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. యువత కోసం రూ.2.10 కోట్లతో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ నిర్మిస్తున్నారు. ఈ పనులన్నీ పూర్తయితే పిఠాపురం రూపురేఖలు మారిపోతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam