Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'పెద్ది' మూవీ రివ్యూ - Peddi Movie Review

'పెద్ది' మూవీ రివ్యూ - Peddi Movie Review

Telugu Samayam 2 weeks ago

సినిమా ఆడటం అనేది ఆ సినిమా హీరోకి.. లేదంటే ఆ డైరెక్టర్‌కో, నిర్మాతకో, హీరోయిన్‌కో అవసరం. కానీ ఇప్పుడు పెద్ది సినిమా హిట్ అవ్వడం ఇండస్ట్రీకి అత్యవసరం.

గత ఆర్నెళ్లుగా ఒక్కటంటే ఒక్క సూపర్ హిట్ సినిమా లేదు. దాదాపు కోవిడ్ టైమ్‌లోనూ ఇదే పరిస్థితి. అప్పట్లో ప్రాణభయంతో థియేటర్స్‌కి వచ్చేవారు కాదు.. అలాంటి టైమ్‌లో ఉప్పెనలా వచ్చింది 'ఉప్పెన' సినిమా. కానీ ఇప్పుడు అలాంటి ప్రాణభయాలు లేకపోయినా కూడా.. ప్రేక్షకుడు థియేటర్స్‌కి రావడం లేదు. వెండితెరపై వెలుగుల్లేక థియేటర్స్ వెలవెలబోతున్న తరుణంతో ఐదేళ్ల గ్యాప్ తరువాత మళ్లీ థియేటర్స్‌కి పూర్వ వైభవాన్ని 'ఉప్పెన'లా తీసుకొచ్చారు 'పెద్ది' దర్శకుడు బుచ్చిబాబు సాన. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కుస్తీ పట్టించి మరీ బాక్సాఫీస్ గస్తీకాస్తూ విజయఢంకా మోగించారు.

రామ్ చరణ్ సినీ లైబ్రరీలో టాప్ మూవీ అంటే రెండో ఆలోచన లేకుండా టక్కున చెప్పే సినిమా అంటే 'రంగస్థలం'. ఆ సినిమాతోనే రామ్ చరణ్.. తనలోని పరిపూర్ణ నటుడ్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. అప్పటి వరకూ తనపై ఉన్న విమర్శలకు చిట్టిబాబు పాత్రతో చెక్ పెట్టారు. రంగస్థలం వరకూ రామ్ చరణ్ అంటే.. చిరంజీవి కొడుకుగా మాత్రమే గుర్తింపు. కానీ ఆ సినిమా తరువాత లెక్కలన్నీ మారిపోయేట్టు చేశారు మన లెక్కల మాస్టార్ సుకుమార్. ఇప్పుడు గురువుని మించిన శిష్యుడిగా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన 'పెద్ది'ని చాలా పే..ద్దగా రూపొందించారు. తన సినీ లైబ్రరీలో 'పెద్ది'నే టాప్ అని స్వయంగా రామ్ చరణ్‌తోనే బుచ్చిబాబు అనిపించారంటే.. రంగస్థలాన్ని మించే 'పెద్ది' ఉండబోతుందనే హోప్స్ కలిగించారు. మరి పెద్ది ఆడించిన ఆట.. బాక్సాఫీస్‌ని చేయబోయే వేట ఎలా ఉంటుందో సమీక్షలో చూద్దాం.

1990ల కాలం బ్యాక్ డ్రాప్‌లో నడిచే కథ 'పెద్ది'. ఊరు పేరే లేని కొండ ప్రాంతం వాళ్లు.. విజయనగరం వలస వెళ్లి అందరూ కూలీ పనులు చేస్తుంటారు. నెలకు నాలుగైదు రోజులు మాత్రం గ్రామంలో ఉంటారు. కొండ ఎక్కి దిగి మండలంలోకి రావాలంటే ఉదయించిన సూర్యుడు అస్తమించాల్సి వస్తుంది. ఎలాంటి ఓ గుర్తింపు లేని ఆ గ్రామస్తులు పొట్టకూటి కోసం కూలీ పనులు చేస్తుంటారు. ఇక కొండ ప్రాంతం మీదుగా వెళ్లే రైలు ఒక్క నిమిషం పాటు ఆగితే తమ బతుకులు మారుతాయ్ అని ముప్పై ఏళ్ల నుంచి అప్పలసూరి (జగపతి బాబు) పోరాటం చేస్తుంటాడు. ఇక ఊరి గ్రామస్తుల్లో పెద్ది (రామ్ చరణ్) ఆట కూలీగా మారి తన గుర్తింపుని సంపాదించుకుంటాడు. క్రికెట్ ఆటలో పెద్ది దిట్ట. మరో వైపు ఎన్నికల వైరంతో అచ్చియమ్మ (జాన్వీ కపూర్)ని రాంబుజ్జి (దివ్యేందు) దారుణంగా అవమానిస్తాడు. అచ్చియమ్మ కోసం రాంబుజ్జిని చితకబాదేస్తాడు. ఓ కూలీ వాడు తమను కొట్టడం ఏంటి? అని క్రికెట్ గ్రౌండ్‌లో సింహంలా తిరిగే పెద్దిని దారుణంగా అవమానిస్తారు. ఇంకో వైపు అప్పలసూరి పోరాటం చేసి చేసి అలిసిపోయి చివరకు రైలుకి ఎదురుగా నిలబడి ప్రాణాలు వదిలేస్తాడు. ఆటే తన గుర్తింపు అనుకునే పెద్ది ఆ తర్వాత ఏం చేస్తాడు? గౌర్నాయుడు వద్ద శిష్యరికం ఎలాంటి మలుపు తిప్పుతుంది? చివరకు పెద్ది ఆ ఊరి కోసం ఎంత దూరం వెళ్తాడు? ఏం చేస్తాడు? అన్నదే కథ. ఆట నుంచి పెద్ది ఏం నేర్చుకున్నాడు.. అదే ఆట చివరికి అతనికి ఏమిచ్చింది.. ఏ కోల్పేయేట్టు చేసింది అనేదే కథాంశం.

స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలోని కథలన్నీ దాదాపు ఒకే విధంగా ఉంటాయి. ఆట ఏదైనా.. బరిలో నిలిచి గెలవాలి కాబట్టి బోరింగ్ ఫ్యాక్టర్ కూడా ఎక్కువే ఉంటుంది. అలాంటి బోరింగ్ లేకుండా భావోద్వేగాన్ని జతచేస్తే.. ఆట రసవత్తరంగా సాగుతుంది. పెద్దిలో ఒక గ్రామ సమస్యని ఆటతో ముడిపెట్టి నడిపించిన తీరు.. క్రాస్ ఓవర్ అథ్లెట్ అనే కాన్సెప్ట్ 'పెద్ద'కి ప్రత్యేకతను తీసుకొచ్చింది.

సినిమాలో పెద్ది జర్నీ మూడు దశల్లో ఉంటుంది.. ఒక్కో దశకు ఒక్కో క్యారెక్టరైజేషన్, డిఫరెంట్ గెటప్ కనిపిస్తుంది. అయితే ఒక పాత్రని మంచి మరొక పాత్ర అన్నట్టుగా మూడు వేరియేషన్స్ చూపిస్తూ.. మైండ్ బ్లోయింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో కనిపించారు రామ్ చరణ్. నిద్రాణమై ఉన్న మెగా జీన్స్‌ అన్నీ.. ఒక్కసారిగా పూనకం వచ్చి విజృంభిస్తే ఎలా ఉంటుందో 'పెద్ది'లో రామ్ చరణ్ విజృంభణ అట్టా ఉంటుంది. అసలు రామ్ చరణ్ హీరో మెటీరియల్‌నా అని హేళన చేసిన వాళ్లతోనే.. హీరో అంటే వీడ్రా అనేట్టుగా చేశాడు. మళ్లీ ఆ స్థాయిలో మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి చెప్పేలా 'పెద్ది' పాత్రను తీర్చిదిద్దాడు. తనకి కనెక్ట్ అయ్యే పాత్ర పడితే.. జీవించడం కాదు. ఆ పాత్రలో ఎంతలా లీనం కాగలడో 'పెద్ది'తో చేసి చూపించాడు.

ఖచ్చితంగా రామ్ చరణ్ నటన గురించి మరోసారి అందరూ మాట్లాడుకుంటారు. చిట్టిబాబు తర్వాత పెద్ది అంటూ రామ్ చరణ్ అందరినీ ఆకట్టుకుంటాడు. ఆటే నా పొగరు అని డైలాగ్ చెప్పడమే కాదు.. ఆ బాడీ లాంగ్వేజ్‌లో కూడా ఆ పొగరు కనిపిస్తుంది. యాక్షన్, ఎమోషన్ ఇలా ప్రతీ ఒక్క సీన్‌లో రామ్ చరణ్ అదరగొట్టేస్తాడు. జాన్వీ కపూర్ ఉన్నది కొంత సేపే. జాన్వీకి ఈ చిత్రం కూడా పెద్దగా ఉపయోగపడకపోవచ్చనిపిస్తుంది. దివ్యేందు శర్మ పాత్ర నుంచి ఆడియెన్స్ ఎక్కువగా ఆశిస్తే మాత్రం కచ్చితంగా భంగపడే అవకాశం ఉంది. జగపతి బాబు పాత్ర ఈ సినిమాకి ఆత్మ. శివ రాజ్ కుమార్ ఎంతో గంభీరంగా, హుందాగా అనిపిస్తాడు. బొమాన్ ఇరానీ పాత్రలో పెద్ద వేరియేషన్స్, ఇంపార్టెన్స్ ఉన్నట్టుగా అనిపించదు. అలా మిగిలిన పాత్రలన్నీ పర్వాలేదనిపిస్తాయి.

బుచ్చిబాబు కథ చెప్పే విధానం ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా స్టైట్ నెరేషన్‌తోనే ఉంటుంది. చాలా వరకూ సహజత్వాన్ని ప్రతిబింబించేదిగానే చెక్కుతారు. బలమైన కథకి భావోద్వేగా సన్నివేషాలను జోడించి.. అరెరే అయ్యో పాపం అని ప్రేక్షకులతోనే జాలిచూపించేట్టు చేయడం బుచ్చిబాబులో ఉన్న దర్శకత్వ ప్రతిభ. ఒక పాత్రని చూసి ప్రేక్షకుడు ఫీల్ అవుతున్నారు అంటే.. దర్శకుడు సక్సెస్ అయినట్టే. నాటి ఉప్పెనలో కానీ.. నేటి 'పెద్ది'లో కానీ.. పాత్రలతో ప్రేక్షకుడ్ని జర్నీ అయ్యేట్టు చేశారు. గుర్తింపుకోసం పెద్ది చేసే పోరాటానికి ఆటని ఆయుధంగా సంధించి వదిలారు.

బుచ్చిబాబు సానా నిజాయితీతో ఈ కథను రాసుకుని అంతే హానెస్ట్ అటెంప్ట్ చేశాడు. కథలోని కీలకఘట్టాలన్నీ ఊహించినట్టుగానే అనిపించినా.. ఆ పాత్రల్ని తీర్చిదిద్దిన తీరు ఆసక్తికరంగా ఉంటుంది. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో దిట్ట అంటే సుకుమార్. తొడలు కొట్టడం మీసం మెలేయడాల్లాంటి అతి చేష్టలతో కాకుండా.. హీరో తిరగబడాలి.. కొట్టాలి.. తిట్టాలి అని ప్రేక్షకులతోనే అనిపిస్తాడు. ఆయన శిష్యుడిగా ఆ లక్షణాన్ని ఒడిసిపట్టుకున్న బుచ్చిబాబు.. గురువు కంటే ఓ అడుగు ముందే ఉన్నారనిపించేలా 'పెద్ది'లో హీరోయిజాన్ని ప్రేక్షకుడు ఆహ్వానించేట్టుగా, హత్తుకునేట్టుగా చూపించారు.

అయితే ఎప్పుడో అరిగిపోయిన టెంప్లెట్, ఫార్మాట్‌ను వాడారు బుచ్చిబాబు. హీరో ఇంట్రో, ఆ తరువాత సాంగ్, ఆపై హీరోయిన్ ఎంట్రీ.. కామెడీ సీన్, ఓ సీరియస్ సీన్.. ఓ ఫైట్ అన్నట్టుగా ఫస్ట్ హాప్ మరీ ప్రెడిక్టబుల్‌గా సాగుతుంది. ఇంటర్వెల్‌కి కాస్త కథ బరువు ఎక్కినట్టుగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్‌లో కుస్తీ సీన్ అదిరిపోతుంది. అలా మాస్‌కి నచ్చే ఎలిమెంట్స్ పెట్టడం, ఎలివేట్ చేయడంలో మాత్రం బుచ్చి సక్సెస్ అయ్యారు.

ఇక సెకండాఫ్‌లో కథ చాలానే ఉంటుంది. కానీ ఆ కథ కాస్త నీరసంగా అనిపిస్తుంది. ఎక్కడా కూడా కొత్తగా అనిపించే సీన్లు కానీ, వావ్ మూమెంట్స్ కానీ కనిపించవు. ట్రైలర్ చూసి గెస్ చేసిన స్టోరీనే థియేటర్లో కనిపిస్తుంది. అసలు నెక్ట్స్ ఏ సీన్ వస్తుందనేది ఇట్టే గెస్ చేయొచ్చు. ప్రీ క్లైమాక్స్‌లో హీరో ఇచ్చే విన్నింగ్ స్పీచ్ మాత్రం గుండెల్ని తాకుతుంది.. కంటతడి పెట్టిస్తుంది.

ఊర్లో పెద్ద అయిన రాంబుజ్జి, అతని తమ్ముడ్ని కొడితే ఏమీ చేయరా? ఫస్ట్ హాఫ్‌లో జాన్వీ ఓ మూడు, నాలుగు సీన్ల తరువాత కనిపించకుండా పోతుంది. అంత పెద్ద ఘటన జరిగిన తరువాత మళ్లీ జాన్వీ కపూర్ తెరపై ఎందుకు కనిపించదు? అనే లాజిక్ మిస్ అవుతుంది. మళ్లీ బుచ్చికి గుర్తు వచ్చి సెకండాఫ్‌లో తీసుకు వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇక తారక్ పొన్నప్ప పాత్రని అర్దాంతరంగా ముగించినట్టు అనిపిస్తుంది. అసలు రాంబుజ్జి సెకండాఫ్‌లో అంత మంచివాడిలా ఎందుకు మారాడో అర్థం కాదు.. ఇలా చాలా వరకు లాజిక్స్ మిస్ అవుతాయి.

హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఏదో ఎదని ఎత్తుపెట్టే జబ్బు ఉన్నట్టుగా ప్రతి సీన్‌లోనూ కూడా ఎదని ఎగ్గొట్టి చూపిస్తూ చిరాకు తెప్పించింది. ఆమె మొహం కంటే ఆమె బాడీ పార్ట్స్‌ని చూపించడానికే ఎక్కువ ఆసక్తి చూపించారు. నిజానికి అందమైనా అందాలైనా చూపిస్తే బావుండు అని అనిపించాలి తప్పితే.. విప్పి చూపించేస్తుంటే అక్కడేముంది చూడ్డానికి అనే నిరాసక్తి రాకూడదు. జాన్వీని చూస్తే అదే అనిపిస్తుంది.

సాంకేతికంగా పెద్ది ఎంతో గొప్ప స్థాయిలో కనిపిస్తుంది. విజువల్స్ అదిరిపోతాయి. రెహమాన్ పాటలు తెరపై కనులపండువగా అనిపిస్తాయి. స్పోర్ట్స్ డ్రామాలో బలమైన భావోద్వేగాలు పలకాలంటే.. నేపథ్య సంగీతం వారధిగా మారాలి. బీజీఎం చాలా చోట్ల కొత్తగా వినిపిస్తుంది. ఏఆర్ రెహమాన్ ప్రపంచస్థాయి మ్యూజిషియన్ అయినా కూడా.. ఆయన తెలుగులో నేరుగా చేసిన సినిమాలు మెప్పించలేకపోయాయి. కానీ 'పెద్ది' సినిమాలోని చికిరి చికిరి పాటతో పటాపంచలు చేశారు ఏఆర్ రెహమాన్. అసలు ఈ పాటకి మ్యూజిక్ కొట్టింది ఈయనేనా? అన్నంతగా తెలుగు నేటివిటీకి తగ్గ ట్యూన్స్ ఇచ్చారు. రై రై రామా, హల్లో హల్లల్లో సాంగ్స్‌ కూడా మెప్పించాయి. మస్స, మస్స సాంగ్ అంచనాలను పెంచింది. చాలా వరకు రెహమాన్ ఆర్ఆర్ సినిమాని నిలబెట్టినట్టుగా అనిపిస్తుంది. క్యాస్టూమ్స్, పాటలు, మాటలు అన్నీ కూడా బాగుంటాయి.

కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్టు మీ లాజిక్స్ ఏంటి? అని ఇవన్నీ ఆడియెన్స్ పట్టించుకోకపోతే సినిమా ఫలితం ఓ రేంజ్‌లో ఉంటుంది. రెగ్యులర్ సినీ లవర్స్‌కి ఓ మోస్తరుగా నచ్చినా మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి మాత్రం సినిమా ఎక్కేస్తుంది. చివరకు లాజిక్స్ అన్నీ పక్కన పెడితే.. బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ జరుగుతుంది.

చివరిగా.. తన గ్రామం గుర్తింపుకోసం పోరాడిన ఓ వీరుడి విజయగాథ.

పెద్ది ప్రారంభం నుంచి రిలీజ్ వరకూ..
నటీనటులు: రామ్ చరణ్, జాన్వీ కపూర్, శృతి హాసన్ (ఐటమ్ సాంగ్), శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ, రవి కిషన్.
దర్శకత్వం: బుచ్చిబాబు సాన
సంగీతం: ఎ.ఆర్ రెహమాన్
నిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్
బడ్జెట్: దాదాపు రూ.350 కోట్లు
ఓటీటీ రైట్స్: రిలీజ్ తరువాత ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. పెద్ది డిజిటల్ రైట్స్ రూ.105 కోట్లకు అమ్ముడైనట్టు సమాచారం.

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో భారీ పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా 'RC16' ప్రాజెక్ట్‌ 2024 మార్చి 20న గ్రాండ్‌గా ప్రారంభమైంది.
'RC16' ప్రాజెక్ట్‌కి 2025 మార్చిలో 'పెద్ది' అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించి.. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం 2025 ఏప్రిల్‌లో వీడియో గ్లింప్స్‌ విడుదల కాగా.. రామ్ చరణ్ ఊర మాస్ గెటప్‌లో సర్ ప్రైజ్ చేశారు.
2024 మార్చి 20న షూటింగ్ ప్రారంభం కాగా.. 2026 ఏప్రిల్ ఎండింగ్‌కి షూటింగ్ కంప్లీట్ చేశారు.
పెద్ది పాత్ర కోసం రామ్ చరణ్ కుస్తీలో కఠోర శిక్షణ తీసుకున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్.. పవర్ ఫుల్ రెజ్లర్‌గా కనిపించడం కోసం 'దంగల్' టీంని రంగంలోకి దింపారు. అప్పట్లో అమీర్ ఖాన్‌కి దంగల్ సినిమా కోసం శిక్షణ ఇచ్చిన టీం.. 'పెద్ది'ని పదునెక్కించింది. 'దంగల్' కోచ్‌ ఆధ్వర్యంలో సుమారు 4 నెలల పాటు కఠినమైన కుస్తీ శిక్షణ తీసుకున్నారు రామ్ చరణ్. ఇంటర్నేషనల్ ట్రైనర్స్‌ని మాత్రమే కాకుండా.. సహజసిద్ధమైన నేటివిటీ లుక్ కోసం.. లంగాణకు చెందిన స్థానిక రెజ్లర్లతో కూడా శిక్షణ తీసుకున్నారు. తెలంగాణకు చెందిన కొంతమంది రైజర్లను రియలిస్టిక్ లుక్ కోసం షూటింగ్‌లో భాగంలో చేశారు.
ఈ యాక్షన్స్ సీక్వెన్స్‌లలో భాగంగా.. రామ్ చరణ్ కంటికి కాళ్లకి చేతులకు బలమైన గాయాలు అయ్యాయి. కంటికి తగిలినా.. చేయి విరిగినా కూడా వెనక్కి తగ్గలేదు పెద్ది. ప్రాణం పెట్టి ఈ సినిమా కోసం పనిచేశారు.
'పెద్ది' క్యారెక్టర్‌లో చాలా వేరియేషన్స్ ఉండటంతో.. దానికి తగ్గట్టుగా వివిధ ప్రాంతాల్లో షూటింగ్ జరిపారు బుచ్చిబాబు సన. హైదరాబాద్‌తో పాటు పుణే, కన్యాకుమారి, కొలంబో పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరిపారు. పల్లెటూరి వాతావరణంలో జరిగే క్రికెట్ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా గ్రౌండ్‌ని ఏర్పాటు చేశారు.
రంగస్థలం తరువాత అటు రామ్ చరణ్‌ నటించిన.. వినయ విధేయ రామ, ఆచార్య, గేమ్ ఛేంజర్ వరుసగా నిరాశపర్చాయి. మధ్యలో ఆర్ఆర్ఆర్ వచ్చి పెద్ద హిట్ అయినా కూడా.. ఆ క్రెడిట్‌ ఒక్క రామ్ చరణ్‌కే కాకుండా రాజమౌళి, ఎన్టీఆర్‌లు పంచుకోవడంతో రామ్ చరణ్ సోలో హిట్ కోసం గట్టిగానే 'కుస్తీ' పట్టారు పెద్దితో.
ద్వితీయ విఘ్నం దాటేనా? బుచ్చిబాబు అనే డౌటానుమానం కూడా చాలామందిలో ఉంది. ఎందుకంటే ఫస్ట్ సినిమా సూపర్ హిట్ అయితే రెండో సినిమా ఫ్లాప్ అయిన దర్శకులు చాలామందే ఉన్నారు. కాబట్టి.. బుచ్చిబాబు సన.. తన తొలి చిత్రం ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా.. జాతీయ స్థాయిలో అవార్డుల్ని కొల్లగొట్టింది. ఇప్పుడు 'పెద్ది' ద్వితీయ విఘ్నం జయించాల్సిందే మరి. జయించాడు కూడా.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam