Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పిల్లను ఇవ్వాలంటే అబ్బాయికి రూ.కోటి జీతం, రూ.10 కోట్ల ఆస్తులు ఉండాలి.. అమ్మాయిల తల్లిదండ్రుల కోరికలు

పిల్లను ఇవ్వాలంటే అబ్బాయికి రూ.కోటి జీతం, రూ.10 కోట్ల ఆస్తులు ఉండాలి.. అమ్మాయిల తల్లిదండ్రుల కోరికలు

Telugu Samayam 1 week ago

తెలుగు రాష్ట్రాల్లో వివాహాల విషయంలో పెరుగుతున్న అంచనాలపై సోషల్ మీడియాలో మరోసారి పెద్ద చర్చ మొదలైంది. పెళ్లి సంబంధాల కోసం కొందరు అమ్మాయిల కుటుంబాలు పెడుతున్న డిమాండ్లు, వారి కోరికలు, ఆశలపై తీవ్ర దుమారం రేగుతోంది.

వరుడికి భారీ జీతంతోపాటు.. కోట్ల రూపాయల ఆస్తులు, విదేశీ ఉద్యోగం, హెచ్-1బీ వీసా వంటి పెద్ద పెద్ద డిమాండ్లు పెడుతున్నారు. అయితే కొంతమంది అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు.. తమ పిల్లలకు అబ్బాయిలు కావాలని.. సంబంధాలు చూడాలంటూ తనకు చెప్పారంటూ ఓ మహిళ సోషల్ మీడియాలో పెట్టిన వీడియోపై ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక అమ్మాయిల పేరెంట్స్ తమకు కాబోయే అల్లుడి విషయంలో పెద్ద పెద్ద కోరికలతో ఉన్నారని ఆ మహిళ పేర్కొంది. అబ్బాయి భారత్‌లో ఉద్యోగం చేస్తే కనీసం సంవత్సరానికి రూ.40 లక్షల ప్యాకేజీ ఉండాలని.. ఇక విదేశాల్లో ఉంటే కనీసం రూ.1 కోటి వార్షిక వేతనంతోపాటు హెచ్-1బీ వీసా ఉండాలని కొందరు కోరుతున్నట్లు ఆమె తెలిపింది. అంతేకాకుండా కాబోయే పెళ్లి కుమారుడికి కనీసం రూ.10 కోట్ల విలువైన ఆస్తులు ఉండాలని డిమాండ్లు పెడుతున్నారని వెల్లడించింది. ఇక అబ్బాయి తండ్రి కూడా ఆర్థికంగా బలమైన స్థితిలో ఉండాలని షరతులు పెడుతున్నారని పేర్కొంది.


ఇక అబ్బాయి వయసు కూడా అమ్మాయి కంటే కేవలం 2, 3 ఏళ్లు మాత్రమే ఎక్కువగా ఉండాలని.. అంతకంటే ఎక్కువ ఉండకూడదనే కండిషన్లు కూడా పెడుతున్నారని తెలిపింది. ఇక నెలకు రూ.15 వేల జీతంతో ఉద్యోగం చేస్తున్న ఒక యువతి కుటుంబం కూడా వరుడికి కనీసం రూ.25 లక్షల వార్షిక వేతనంతోపాటు.. రూ.5 కోట్ల విలువైన ఆస్తులు ఉండాలని.. ఆర్థికంగా కూడా బలమైన కుటుంబం కావాలని వారు కోరుతున్నారని ఆ మహిళ వెల్లడించింది. ఇక వారికి పెళ్లి అయిన తర్వాత తల్లిదండ్రుల నుంచి విడిగా నివసించేందుకు ముందుగానే అంగీకరించాలని కోరినట్లు పేర్కొంది.

ఇక ఈ మహిళ పోస్ట్ చేసిన వీడియో క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు అమ్మాయి, ఆమె కుటుంబం పెట్టిన డిమాండ్లకు మద్దతుగా కామెంట్లు పెడుతుండగా.. మరికొందరు మాత్రం తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. జీవన వ్యయం, ఉద్యోగ భద్రత, భవిష్యత్ ఆర్థిక స్థిరత్వం దృష్ట్యా అమ్మాయి తల్లిదండ్రులు కొన్ని అంచనాలు పెట్టుకోవడం సహజమని పేర్కొంటున్నారు.

మరోవైపు.. అతిగా ఆర్థిక ప్రమాణాలకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మంచి సంబంధాలు, కుటుంబాలను కోల్పోయే ప్రమాదం ఉందని.. వ్యక్తిత్వం, పరస్పర అవగాహన, కుటుంబ విలువలు కూడా పెళ్లి సమయంలో చూడాల్సిన అత్యంత ముఖ్యమైన విషయాలు అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేసినా.. ఎన్ని ఆస్తులు ఉన్నా.. పెళ్లి తర్వాత భార్యాభర్తలు కలిసిపోకుండా, గొడవలతో వేరుపడితే.. సమాజంలో పరువు పోవడంతోపాటు.. ఆర్థికంగా కూడా తీవ్ర నష్టమేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam