ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పిఠాపురంలో పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన, ప్రజా సేవల అమలు తీరుపై సోమవారం రోజున వివిధ శాఖల అధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్షించారు.
తన కార్యాలయ సిబ్బందిని క్షేత్ర స్థాయి పరిశీలన కోసం నియోజకవర్గానికి పంపిన పవన్ కళ్యాణ్.. వారు సమర్పించిన నివేదికలను పరిశీలించారు. నియోజకవర్గంలో నూతనంగా నిర్మించిన రోడ్ల నాణ్యత, నాగులాపల్లి సమగ్ర రక్షిత తాగునీటి పథకం పనులు, భజన మందిరాల నిర్మాణం, దేవాదాయ శాఖ అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు తెలుసుకున్నారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు.. పిఠాపురంలో 288 సిమెంట్ రోడ్ల నిర్మాణాన్ని అధికారులు పూర్తి చేశారు. క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లిన పవన్ కళ్యాణ్ కార్యాలయం సిబ్బంది.. రోడ్ల నాణ్యతను పరిశీలించి నివేదిక అందజేశారు. నాగులాపల్లి సమగ్ర రక్షిత తాగునీటి పథక విస్తరణ పనులు పూర్తయ్యి, ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు పవన్ కళ్యాణ్‌కు తెలియజేశారు. ఈ నేపథ్యంలో త్వరలో పిఠాపురం పర్యటనలో ఈ పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా సన్నాహాలు చేయాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఓవర్‌హెడ్ ట్యాంకులు, పైప్‌లైన్లు, ఫిల్టర్ బెడ్లు, సంపుల నిర్మాణంపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు.
పిఠాపురంలోని ప్రధాన ఆలయాల్లో దేవాదాయ శాఖ సహకారంతో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపైనా పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. టీటీడీ సౌజన్యంతో నిర్మించనున్న భజన మందిరాల ఏర్పాటు ప్రణాళికలను పవన్ కళ్యాణ్ సమీక్షించారు. పిఠాపురంలో100 భజన మందిరాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వీటికోసం స్థల సేకరణ, ఆలయ కమిటీల ఏర్పాటు అంశాల్లో ఉన్న ఇబ్బందులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎల్‌నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో.. నియోజకవర్గంలో నెలకొన్న సాగునీటి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని స్పష్టం చేశారు.

