PM Ujjwala Yojana: పేద మహిళలకు ఉచితంగా ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) అందిస్తోంది. పేద కుటుంబాలకు స్వచ్ఛమైన వంట ఇంధనాన్ని అందిస్తూ మహిళల ఆరోగ్యాన్నికాపడడం, కాలుష్యాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రతి 14.2 కిలోల సిలిండర్ పై రూ.300 సబ్సిడీ అందుబాటులో ఉంది. దేశవ్యాప్తంగా లక్షల మంది ఉజ్వల యోజన ద్వారా గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నారు. అయితే, ప్రస్తుతం దేశంలో ఎల్‌పీజీ కొరత ఏర్పడింది. గ్యాస్ సిలిండర్లు దొరకడం ఇబ్బందిగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉజ్వల యోజన కింద గ్యాస్ వినియోగిస్తున్న వారికి కీలక సూచనలు చేసింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులు రూ.300 సబ్సిడీ పొందాలంటే తప్పనిసరిగా బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ (eKYC) పూర్తి చేయాలని, ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఒకసారి ఈ ప్రక్రియను చేయాల్సి ఉంటుందని ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేసింది. 'ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు అలర్ట్. 14.2 కిలోల సిలిండర్లకు 8వ, 9వ రీఫిల్ పై డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా రూ.300 సబ్సిడీ పొందాలంటే ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఒకసారి తప్పనిసరిగా బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేయాలి. ఇక 5 కిలోల సిలిండర్లు అయితే, 21 రీఫిల్ నుంచి ఈ రూల్ వర్తిస్తుంది.' అని హెచ్‌పీసీఎల్ తెలిపింది.
డీబీటీ ద్వారా రూ.300 సబ్సిడీని కోల్పోవద్దు అనుకుంటే మార్చి 31, 2026లోపు ఇకేవైసీ పూర్తి చేయాలనిహెచ్‌పీసీఎల్ సూచించింది. ఇ-కేవైసీ పూర్తి చేయడం ద్వారా ఎల్‌పీజీ రీఫిల్స్ ఎలాంటి అంతరాయం లేకుండా పొందవచ్చని తెలిపింది. డీబీటీ సబ్సిడీ అనేది ఒక ఆర్థిక సంవత్సరంలో 9 రీఫిల్స్ వరకే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇది 14.2 కిలోల సిలిండర్లకు అయితే రూ.300గా ఉంటుందని తెలిపింది. వినియోగదారులు ఇంట్లో నుంచి సైతం ఈ కేవైసీ పూర్తి చేయవచ్చని, సెల్ఫ్ బయోమెట్రిక్ ఇ-కేవైసీ పూర్తి చేసేందుకు హెచ్‌పీ పే మొబైల్ యాప్ ద్వారా పూర్తి చేయవచ్చని తెలిపింది. లేదా ఎల్‌పీజీ డెలివరీ చేసే వ్యక్తి ద్వారానూ ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చని సూచించింది. ప్రతి సంవత్సరం కేవైసీ పూర్తి చేసిన వారికే ఎలాంటి ఇబ్బంది లేకుండా రీఫిల్ బుకింగ్, డెలివరీ ఉంటుందని హెచ్‌పీసీఎల్ ప్రకటన ద్వారా తెలుస్తోంది.

