Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పొగాకు రైతులకు గుడ్ న్యూస్.. మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన

పొగాకు రైతులకు గుడ్ న్యూస్.. మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన

Telugu Samayam 4 days ago

రాష్ట్రంలోని పొగాకు రైతులకు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శుభవార్త చెప్పారు. పొగాకు బోర్డు పరిధిలోకి రాని కౌలు రైతులకు కూడా వడ్డీలేని రుణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

రెండు సంవత్సరాల వెసులుబాటుతో ప్రతి రైతుకూ అండగా నిలుస్తూ ఈ రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే లోగ్రేడ్ పొగాకుకు కిలోకు పదిరూపాయల వంతున ఆర్థిక సాయం చేయనున్నామని.. గురువారం నుంచి ఈ సాయం పంపిణీ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. పొగాకు రైతుల సంక్షేమంపై జగన్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలని మండిపడ్డారు. రైతులపై జగన్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాస్తవాలు, గణాంకాలతో బహిరంగ చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు.

బర్లీ పొగాకు రైతుల నుంచి 25 మిలియన్ కిలోల పొగాకు కొనుగోళ్లకు గతంలో రూ.280 కోట్లు వెచ్చించామన్న అచ్చెన్నాయుడు.. 2014-15లో ఎఫ్‌సీవీ పొగాకు ధరలు పడిపోయినప్పుడు, ప్రతి కిలోకు రూ.20 ఆర్థిక సహాయం అందించిన చరిత్ర టీడీపీ ప్రభుత్వానిదని అన్నారు. 2019లో 124 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి జరిగి ధర రూ.121 నుంచి రూ.123కి పడిపోతే, వైసీపీ ప్రభుత్వం కేవలం 11.8 మిలియన్ కిలోలు మాత్రమే కొనుగోలు చేసి రైతులను గాలికి వదిలేసిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఆ తర్వాతి ఏడాది కూడా 128 మిలియన్ కిలోల ఉత్పత్తి జరిగితే.. ఒక్క కిలో కూడా కొనుగోలు చేయలేదని ఆరోపించారు.

పొగాకు ధరలు 2019లో కేజీ రూ.142 ఉంటే, 2024లో రూ.326, 2025లో రూ.300, 2026లో రూ.275గా నమోదైనట్లు అచ్చెన్నాయుడు వివరించారు. ఈ ఏడాది పొగాకు బోర్డు లక్ష్యం 131 మిలియన్ కిలోలు కాగా, రైతులు 241 మిలియన్ కిలోలు ఉత్పత్తి చేశారని పేర్కొన్నారు. అధిక ఉత్పత్తితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పొగాకు రైతులను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం.. 100 మిలియన్ కిలోల పొగాకుకు కిలోకు రూ.10 చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించిందని వెల్లడించారు.

ఈ ఆర్థిక సహాయం పంపిణీని గురువారం నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. అంచనాకు మించి పొగాకు వచ్చినా కూడా కిలోకు రూ.10 చొప్పున ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ప్రతి పొగాకు బ్యారన్‌కు రూ.50,000 వడ్డీలేని రుణం అందిస్తోందని.. పొగాకు రైతులనుఎవరు ఆదుకున్నారో, ఎవరు గాలికి వదిలేశారో చర్చకు జగన్ సిద్ధమా అని అచ్చెన్న సవాల్ చేశారు.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam