Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రభాస్‌కు ఆ సినిమా కరెక్ట్ కాదేమో అనిపించింది.. జనం కొట్టిన దెబ్బకు మాడు పగిలిపోయింది: నిర్మాత ఎంఎస్ రాజు

ప్రభాస్‌కు ఆ సినిమా కరెక్ట్ కాదేమో అనిపించింది.. జనం కొట్టిన దెబ్బకు మాడు పగిలిపోయింది: నిర్మాత ఎంఎస్ రాజు

Telugu Samayam 1 month ago

టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్స్ లో ఎంఎస్ రాజు ఒకరు. 'సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్' బ్యానర్‌పై ఆయన ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.

'శత్రువు', 'దేవి', 'మనసంతా నువ్వే', 'ఒక్కడు', 'వర్షం', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' వంటి బ్లాక్ బస్టర్స్ ఆయన నిర్మాణంలోనే రూపొందాయి. ఒకప్పుడు భారీ బడ్జెట్ తో స్టార్ హీరోలతో మూవీస్ చేసిన అగ్ర నిర్మాత ఎంఎస్ రాజు.. గత కొన్నేళ్లుగా స్టార్స్ తో సినిమాలు చేయడం లేదు. మెగా ఫోన్ పట్టుకొని దర్శకుడిగా తక్కువ బడ్జెట్ లో 'డర్టీ హరి' లాంటి న్యూ ఏజ్ సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు 'అగధ' అనే చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తున్నారు.

MS రాజు దర్శకత్వం వహించిన 'అగధ' చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. స్టార్ హీరోలతో సినిమాలు చేయకపోవడానికి గల కారణాలను వెల్లడించారు. తాను హీరోలను దృష్టిలో పెట్టుకొని కథలు రెడీ చేయనని, కథకు ఎవరు సూట్ అవుతారో వాళ్లతోనే సినిమాలు చేస్తానని తెలిపారు. ప్రభాస్, మహేష్ బాబు, వెంకటేష్ లాంటి హీరోలతో కథను నమ్ముకొని చేసిన సినిమాలు హిట్టయ్యాయని.. అదే సమయంలో హీరోలను బేస్ చేసుకొని చేసిన చిత్రాలు మాత్రం ప్లాప్ అయ్యాయని ఎంఎస్ రాజు చెప్పారు.

''నేను కథను బేస్ చేసుకుని తీసిన సినిమాలన్నీ బాగానే ఆడాయి. హీరోని బేస్ చేసుకొని తీసిన సినిమాలేవీ ఆడలేదు. పౌర్ణమి, దేవి పుత్రుడు లాంటి సినిమాలు బాగుంటాయి కానీ ఆడలేదు. బేసిక్ గా నాకు వాళ్లతో ఉన్న ఆబ్లిగేషన్స్ తో ఆ సినిమాలు తీయాల్సి వచ్చింది. అప్పటికి నేనే వాళ్లను పైకి పెంచేశాను. 'వర్షం' సినిమా తీసిన నేనే 'పౌర్ణమి' తీశాను. ప్రభాస్ తో కొత్తగా తీయాలని ఫీల్ అయ్యాను. నా దగ్గర ఉన్న కథ ప్రభాస్ కు కరెక్ట్ కాదేమో అని నా మనసులో అనిపించింది. కానీ తీశాను. ఎందుకు తీశానంటే.. హీరో, డైరెక్టర్లతో నాకు మంచి ర్యాపో ఉంది. ఒకరితో 'వర్షం' తీశాను.. ఇంకొకరితో 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' తీశాను. ఇద్దరితో నాకు కంఫర్ట్ ఉంది. అందుకే వాళ్లిద్దరినీ కలిపి సినిమా చేయాలనుకున్నా. అప్పుడు ప్రభాస్ కి కూడా ఈ స్టోరీ డిఫరెంట్ గా ఉంటుందని అనుకున్నా. కానీ జనం తిప్పి కొట్టారు. 'నువ్వేంట్రా డిఫరెంట్ గా తీసేది. మాకు ఛత్రపతి ఇవ్వరా, వర్షం లాంటి సినిమా ఇవ్వరా' అని తెలియజెప్పారు. నాకు మాడు పగిలిపోయింది'' అని ఎంఎస్ రాజు అన్నారు.

''వెంకటేష్ తో 'శత్రువు' సినిమా చేస్తే పెద్ద హిట్ అయింది. ఒక స్టేజ్ లో మళ్లీ 'దేవీ పుత్రుడు'తో కాంబినేషన్ రిపీట్ చేశాను. కథ ఎండింగ్ లో నాకు కొంచెం తేడా అనిపించింది. అయినా సినిమాని రిలీజ్ చేశాను. బాగానే కలెక్షన్స్ రాబట్టింది. కానీ నేను అనుకున్నంత ఆడలేదు. ఏదైనా సినిమా నేను అనుకున్నట్లు ఆడకపోతే, అది నా దృష్టిలో ఆడనట్లే లెక్క. వెంకటేష్ తో అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇంకో సినిమా చేయలేదు. కథను బట్టి వెంకటేష్ దగ్గరకు వెళ్ళాలే తప్ప, వెంకటేష్ ను బట్టి కథ రెడీ చేయకూడదు అనేది నా ఉద్దేశ్యం. మా ఇద్దరి మధ్య చనువుతో, ఎప్పుడైనా కలిసినప్పుడు కథ రెడీ చేస్తున్నావా? అని తను నన్ను అడిగేవాడు. 'కథ రానివ్వండి బాబు.. నేను చెప్తాను' అనేవాడిని. అంతేకానీ ఆయన చెప్పాడు కదా అని, కథ లేకుండా దూకేసే రకం మనిషిని కాదు నేను''

''అలానే ప్రభాస్, మహేష్ కూడా ఎన్నోసార్లు అడిగారు. కానీ వాళ్ల కోసం నా దగ్గర కథ లేదు. కాబట్టి నేను 'డర్టీ హరి', 'అగధ' లాంటి వేరే సినిమాలు చేస్తున్నాను. దర్శక రచయితలను పిలిచి 'ఫలానా హీరోతో సినిమా చేయాలి. కథ రెడీ చేయమ'ని నేను చెప్పను. ఎప్పుడూ నేను స్టోరీ రెడీ అయిన తర్వాతే హీరోని ఫైనలైజ్ చేస్తాను. 'ఒక్కడు' సినిమా కూడా అంతే. గుణశేఖర్ ని మహేష్ బాబు నా దగ్గరకు పంపించాడు. 'సౌండింగ్ బాగుంది. కానీ కొంచం ఏదో కన్ఫ్యూజన్ ఉంది. నీలాంటి వాళ్లు వింటే బాగుంటుంది' అని మహేష్ అన్నారు. ఆ కథ మహేష్ కి సెట్ అవుతుందని అనిపిస్తేనే సినిమా చేద్దాం అనుకున్నాను. కథ విన్నప్పుడు నాకు మహేష్ బాబే కనిపించాడు''

''గుణశేఖర్ చెప్పింది కొంచం కథే. దాన్ని ఇద్దరం కలిసి పెద్దది చేశాం. ఒకవేళ 'ఒక్కడు' స్టోరీ మహేష్ బాబుకి సూట్ అవ్వదు, ఆయనకు కరెక్ట్ కాదని నేను అనుకోని ఉంటే.. మహేష్ చెప్పినా ఆ సినిమా చేసేవాడిని కాదు. కానీ ఆ కథ ఆయనకు కరెక్ట్ గా సూట్ అవుతుంది. నేను మహేష్ బాబు దగ్గరకు వెళ్లి అదే చెప్పాను. 'బాబూ.. ఈ కథలో నాకు మీరే కనిపించారు. స్టోరీలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ మేమిద్దరం కలిసి సాల్వ్ చేస్తాం. నువ్వు సైలెంట్ గా కూర్చో. కథ మొత్తం రెడీ అయ్యాక మీకు వినిపిస్తాము' అని చెప్పాను. పరుచూరి బ్రదర్స్ తో కూర్చొని నేనూ, గుణశేఖర్ కలిసి కథ రెడీ చేశాం. ఆ తర్వాత ఇద్దరం కలిసి వెళ్లి మహేష్ కు నేరేషన్ ఇచ్చాం" అని MS రాజు చెప్పుకొచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam