Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'ప్రభుత్వ టీచర్లంతా టెట్ పాస్ కావాల్సిందే': సుప్రీంకోర్టు సంచలన తీర్పు

'ప్రభుత్వ టీచర్లంతా టెట్ పాస్ కావాల్సిందే': సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Telugu Samayam 2 weeks ago

Supreme Court Judgement on TET: దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల అర్హతలపై సర్వోన్నత న్యాయస్థానం మరోసారి అత్యంత కీలకమైన స్పష్టతనిచ్చింది.

విద్యాహక్కు చట్టం నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులంతా నిర్దేశిత సమయంలోగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాసి ఖచ్చితంగా అర్హత సాధించాల్సిందేనని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. గతంలో తాము ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును సవాలు చేస్తూ వివిధ ఉపాధ్యాయ సంఘాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను న్యాయస్థానం పూర్తిగా కొట్టేసింది. అయితే ఉపాధ్యాయుల భవిష్యత్తును, విద్యార్థుల విద్యావ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని.. టెట్ పాస్ కావడానికి ఇది వరకు ఇచ్చిన రెండేళ్ల గడువును మాత్రం మూడేళ్లకు పెంచుతూ కొంత ఉపశమనం కల్పించింది.

జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు సంచలన తీర్పును వెలువరించింది. ఈ తాజా సవరణ ప్రకారం.. ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణత సాధించడానికి ఇదివరకు ఉన్న 2027 ఆగస్టు 31 డెడ్‌లైన్.. ఇప్పుడు 2028 ఆగస్టు 31 వరకు పొడిగించబడింది. ఈ ఒక్క మార్పు మినహా గతంలో ఇచ్చిన తీర్పులోని మిగతా అన్ని అంశాలు యథావిధిగా అమలులో ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది.

69 ఉపాధ్యాయ సంఘాల పిటిషన్లు తిరస్కరణ..

విద్యాహక్కు చట్టం రాకముందు నియమితులై, తమ ఉద్యోగ విరమణకు ఐదేళ్లకు పైగా సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు అందరూ.. ఉద్యోగంలో కొనసాగాలన్నా లేదా పదోన్నతులు పొందాలన్నా రెండేళ్లలో టెట్ పాస్ కావాలని 2025 సెప్టెంబరు 1న సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళనకు దారి తీసింది. దీనిని సవాలు చేస్తూ దాదాపు 69 ఉపాధ్యాయ సంఘాలు గత ఏడాది అక్టోబరు 12న సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై ఈ నెల 13న సుదీర్ఘంగా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఆ పిటిషన్లన్నింటినీ తోసిపుచ్చుతూ తుది తీర్పునిచ్చింది. విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చి 15 ఏళ్లు దాటిన తర్వాత కూడా పరీక్ష పాస్ కావడానికి తమకు తగినంత సమయం లేదని ఉపాధ్యాయులు చెప్పడం ఎంతమాత్రమూ సమర్థనీయం కాదని న్యాయమూర్తులు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

రాష్ట్రాలకు కీలక ఆదేశాలు..!

ఉపాధ్యాయులు పరీక్షలు రాసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత విద్యాశాఖ అధికారులు కనీసం ప్రతి రెండేళ్లకు ఒకసారైనా తప్పనిసరిగా టెట్ నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ప్రతి పరీక్షకు మధ్య కనీసం ఆరు నెలల సమయం ఉండాలని స్పష్టం చేసింది. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ టెట్ అర్హత గడువును 2028 కంటే ముందుకు పొడిగించే ప్రసక్తే లేదని ధర్మాసనం ఖరాఖండీగా చెప్పేసింది.

గతంలో విధించిన కఠిన నిబంధనల వల్ల వేలాది మంది ఉపాధ్యాయులు ఒకేసారి ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని.. తద్వారా పాఠశాలల్లో ప్రాథమిక విద్య నిరాటంకంగా సాగడానికి ఆటంకం ఏర్పడి విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని ఉపాధ్యాయ సంఘాలు కోర్టు దృష్టికి తెచ్చాయి. ఈ మానవీయ కోణాన్ని పరిశీలించిన ధర్మాసనం.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తమకు ఉన్న అసాధారణ అధికారాలను ఉపయోగించి గడువును మరో ఏడాది పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రాథమిక విద్యకు ఎలాంటి అడ్డంకులు కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ తుది అవకాశం ఇస్తున్నట్లు న్యాయమూర్తులు స్పష్టం చేశారు.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam