ప్రియుడితో కలిసి భర్తను మేడపై నుంచి తోసేసింది. అయితే అప్పటికీ అతడు చనిపోకపోవడంతో.. ఆసుపత్రి బెడ్‌పై చికిత్స పొందుతున్న అతడి నరాల్లోకి ఏకంగా టాయిలెట్ క్లీనర్ అయిన హార్పిక్‌ను ఇంజెక్షన్ ద్వారా ఎక్కించి ప్రాణాలు తీసింది. మోపాల్ మండలం న్యాల్‌కల్ గ్రామంలో జరిగిన ఈ భయంకర సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. తొలుత ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా అందరినీ నమ్మించినప్పటికీ.. పోస్ట్‌మార్టం నివేదికతో ఈ వికృత హత్యోదంతం వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిందంటే..?
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యాల్‌కల్ గ్రామానికి చెందిన ప్రశాంత్‌కు, సంధ్య అనే మహిళకు చాలా అళ్ల క్రితమే వివాహం జరిగింది. అయితే కుటుంబ పోషణ నిమిత్తం ప్రశాంత్ గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ కష్టపడి పని చేస్తూ భార్యకు డబ్బులు పంపుతున్నాడు. భర్త ఊరిలో లేని సమయాన్ని ఆసరాగా చేసుకున్న సంధ్య.. బంటి అనే స్థానిక యువకుడితో పరిచయం పెంచుకుంది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇదిలా ఉండగా.. ప్రశాంత్ గల్ఫ్ నుంచి స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. ఈ క్రమంలోనే తన భార్య సంధ్యకు బంటి అనే యువకుడితో ఉన్న అక్రమ సంబంధం గురించి అతనికి తెలిసింది. దీంతో భార్యాభర్తల మధ్య గత కొన్ని రోజులుగా తీవ్ర స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి. తమ బంధానికి ప్రశాంత్ శాశ్వతంగా అడ్డంగా మారాడని భావించిన సంధ్య, ప్రియుడు బంటితో కలిసి అతడిని వదిలించుకోవాలని ఒక భయంకరమైన స్కెచ్ వేసింది.మేడపై నుండి తోసేసి.. ఆపై ఆసుపత్రిలోనే కిరాతకం!
గత నెల 30వ తేదీన సంధ్య తన ప్లాన్‌ను అమలు చేసింది. భర్త ప్రశాంత్‌తో అత్యధికంగా మద్యం తాగించింది. అతడు పూర్తిగా మత్తులోకి జారుకున్నాక.. ప్రియుడు బంటి సహాయంతో ప్రశాంత్‌ను ఇంటి పైకప్పు మీద నుంచి క్రిందికి తోసేసింది. తీవ్ర గాయాలపాలైన ప్రశాంత్‌ను కుటుంబ సభ్యులు గమనించి తక్షణమే నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే పైనుంచి పడినా భర్త ప్రాణాలతో బ్రతకడాన్ని సంధ్య తట్టుకోలేకపోయింది. ఆసుపత్రిలో ప్రశాంత్ బెడ్‌పై ఉన్న సమయంలో.. ఎవరికీ అనుమానం రాకుండా ప్రియుడు బంటి తెచ్చిన సిరంజి సహాయంతో ప్రాణాంతకమైన హార్పిక్‌ను నేరుగా ప్రశాంత్ చేతికి పెట్టిన సెలైన్‌లోకి ఇంజెక్ట్ చేసింది. ఆ కెమికల్స్ శరీరంలో కలవడంతో ప్రశాంత్ అక్కడికక్కడే విలవిలలాడుతూ ప్రాణాలు విడిచాడు. మరోవైపు మద్యం మత్తులో బిల్డింగ్ పైనుంచి పడిపోవడం వల్లే ప్రశాంత్ చనిపోయాడని సంధ్య అందరినీ నమ్మించి ఏడ్చింది.ఇదీ చూడండి: భర్తను చంపి.. బాత్రూంలో కొత్త టైల్స్ వేసిన భార్యపోస్ట్మార్టంలో తేలిన అసలు గుట్టు..
అయితే ప్రశాంత్ మరణంపై అనుమానం రావడంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ పరీక్షల్లో ప్రశాంత్ శరీరంలోకి, నరాల్లోకి టాయిలెట్ క్లీనర్ వెళ్లడం వల్లే అంతర్గత అవయవాలు దెబ్బతిని చనిపోయాడనే షాకింగ్ నిజం బయటపడింది. దీంతో పోలీసులు భార్య సంధ్యను తమదైన శైలిలో విచారించగా.. ప్రియుడు బంటితో కలిసి తానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అంగీకరించింది. పోలీసులు నిందితులు ఇద్దరినీ కస్టడీలోకి తీసుకుని కేసును విచారిస్తున్నారు.