నాగాలాండ్‌లోని సొవిమా క్రికెట్ స్టేడియంలో సోమవారం జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో భారత దేశవాళీ క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే అద్భుతం ఆవిష్కృతమైంది.
మిజోరాం తరఫున బరిలోకి దిగిన 29 ఏళ్ల ముంబై క్రికెటర్ చిన్మయ్ సుతార్ అజేయంగా 400 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో ప్రపంచవ్యాప్తంగా క్వాడ్రపుల్ సెంచరీ (400) సాధించిన కేవలం 10 మంది ఆటగాళ్ల ఎలైట్ జాబితాలో సుతార్ చోటు సంపాదించుకున్నాడు. భారత్ తరఫున 1948-49లో మహారాష్ట్ర ఆటగాడు బావుసాహెబ్ నింబాల్కర్ (443*) చేసిన రికార్డు తర్వాత, 78 ఏళ్ల అనంతరం భారత్‌లో మరో బ్యాటర్ ఈ అరుదైన ఘనతను అందుకోవడం విశేషం.
ముంబైలోని థానేలో జన్మించి, పాల్ఘర్ జిల్లాలోని చిన్న గ్రామం చించానీలో పెరిగిన సుతార్‌కు ముంబై రంజీ జట్టులో ఆడే అవకాశం లభించలేదు. దీంతో మిజోరాం జట్టు తరఫున అతడు బరిలోకి దిగాడు. తన రెండో ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లోనే ఈ అద్భుతం చేసి చూపించాడు. "నేను బ్యాటింగ్ చేస్తున్నంతసేపు నాకు ఈ రికార్డు గురించి అసలు తెలియదు. మేం 581/9 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన తర్వాతే అసలు విషయం తెలిసింది" అని సుతార్ పేర్కొన్నాడు. ఫిట్‌నెస్, సరైన ఆహారపు అలవాట్లు, అంకితభావం వల్లే 200, 300, 400 పరుగులు చేయగలిగానని అతడు ఆనందం వ్యక్తం చేశాడు.
ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగం చేస్తున్న సుతార్.. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్ ఆటగాళ్లతో కలిసి ఆడిన అనుభవం కలిగి ఉన్నాడు. ముంబై క్రికెట్ సంస్కృతిలో పెరగడం వల్ల వచ్చే 'ఖాదూస్' (ఎంతమాత్రం ఓటమికి తలవంచని) తత్వమే తనను ఇంత దూరం తెచ్చిందని సుతార్ వెల్లడించాడు. మైదానంలో ఎంతసేపైనా క్రీజులో నిలదొక్కుకుని పరాజయాలను అంగీకరించని ఆ ముంబై రెడ్-బాల్ క్రికెట్ నేర్పిన పాఠాలే తన విజయానికి పునాది అని పేర్కొన్నాడు. చిన్మయ్ సుతార్.. తండ్రి రాజేష్ సుతార్ కూడా ముంబై తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడటంతో పాటు సెలెక్టర్‌గా కూడా సేవలు అందించడం విశేషం.
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. మిజోరం 581/9 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇందులో 400 పరుగులు చిన్మయ్ ఒక్కడే సాధించడం గమనార్హం. అనంతరం నాగాలాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 50 రన్స్ చేసింది.

