Reliance Investment in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. ఇప్పటికే విశాఖపట్నంలో రూ. 1.35 లక్షల కోట్ల పెట్టుబడితో గూగుల్..
డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో దిగ్గజ సంస్థ.. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అంతకంటే ఎక్కువ మొత్తం పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తుంది. దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ క్లస్టర్‌ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ఈ వార్తల నేపథ్యంలో ఏప్రిల్ 28న రిలయన్స్ షేరు దూసుకెళ్తోంది:
Reliance Industries Share Price: దేశంలోనే మార్కెట్ విలువ పరంగా అతిపెద్ద కంపెనీ.. దిగ్గజ పారిశ్రామిక వేత్త, భారత్‌లోనే అత్యంత ధనవంతుడు.. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. భారతదేశంలోనే అతిపెద్దదిగా చెప్పుకుంటున్న డేటా సెంటర్ క్లస్టర్‌ను.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.. విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్నట్లు ఈ వ్యవహారం గురించి తెలిసిన వ్యక్తుల్ని ఉటంకిస్తూ ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. ఇందులో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ సుమారు రూ. 1.6 లక్షల కోట్లు (17 బిలియన్ డాలర్లకుపైగా) పెట్టుబడి పెట్టనున్నట్లు సమాచారం. ఇది వైజాగ్‌లోని అన్ని డేటా సెంటర్లకు మాతృకగా వ్యవహరిస్తుందని సమాచారం. 1.5 గిగావాట్ సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానికంగా వేలాది సంఖ్యలో ఉపాధి అవకాశాలు కూడా కల్పించనుంది రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ పెట్టుబడి వార్తల నేపథ్యంలో మార్కెట్లు పతనం అవుతున్నప్పటికీ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు లాభాల్లో కదలాడుతోంది. దీంతో ఇన్వెస్టర్లకు కూడా లాభాలు వస్తున్నాయి.

ఈ డేటా సెంటర్ క్లస్టర్‌తో సహా దానిని నిర్వహించేందుకు అవసరమైన సోలార్ విద్యుత్ బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్‌ను కూడా రిలయన్స్ నిర్మించనుంది. మరోవైపు.. విశాఖపట్నంలోనే గూగుల్ 1 గిగావాట్ సామర్థ్యం ఉన్న డేటా సెంటర్లను నిర్మిస్తుండగా.. గూగుల్ ఏఐ డేటా హబ్‌కు ఏప్రిల్ 28నే శంకుస్థాపన జరిగింది. రిలయన్స్ డేటా సెంటర్ క్లస్టర్.. అంతకంటే పెద్దది కావడం విశేషం. సామర్థ్యంలోనూ.. పెట్టుబడుల్లోనూ.. గూగుల్‌ను రిలయన్స్ మించిపోనుందని చెప్పుకుంటున్నారు.
3 దశల్లో డేటా సెంటర్ క్లస్టర్..

తెలిసిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ కమిటీ.. ఈ రిలయన్స్ పెట్టుబడులకు గత శనివారం మీటింగ్‌లోనే ఆమోదం తెలిపినట్లు తెలిసింది. రిలయన్స్ ఈ గిగా స్కేల్ ఏఐ డేటా సెంటర్ క్లస్టర్‌ను 3 దశల్లో ఏర్పాటు చేయనుంది. క్లస్టర్ ఏర్పాటు కోసం.. ప్రభుత్వం నుంచి సుమారు 935 ఎకరాలు రిలయన్స్ కోరిందని సమాచారం. కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కోసం ఒక ఎకరం, డిశాలినేషన్ ప్లాంట్ కోసం 80 ఎకరాలు కావాలని ప్రభుత్వాన్ని అడిగినట్లు తెలిసింది. పూర్తి వివరాల కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే వరకు ఎదురుచూడాలి.
డేటా సెంటర్ క్లస్టర్ అంటే?

ఇక డేటా సెంటర్ క్లస్టర్ అనేది.. అధిక కంప్యూటింగ్ పవర్, డేటా స్టోరేజ్ సహా ఫాస్ట్ నెట్‌వర్కింగ్ కోసం ఒక ప్రదేశంలో ఏర్పాటు చేసిన బహుళ డేటా సెంటర్ల సమూహం. భారీ డేటాను ప్రాసెస్ చేసేందుకు.. ఏఐ అప్లికేషన్లకు, క్లౌడ్ సేవలకు సపోర్ట్‌గా పనిచేస్తుంటాయి. వందల, వేలాది సర్వర్ల ద్వారా పెద్ద మొత్తంలో డేటాను ప్రాసెస్ చేస్తాయి. ఒక డేటా సెంటర్లో సమస్య వచ్చినా.. మిగతా వాటికి ఇబ్బంది ఉండదు.
రిలయన్స్ షేరుకు లాభాలు..

ఏపీలో పెట్టుబడి వార్తల నేపథ్యంలో మంగళవారం సెషన్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు దూసుకెళ్లింది. ఒకవైపు మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నప్పటికీ.. ఈ స్టాక్ ఇంట్రాడేలో దాదాపు 2 శాతం వరకు పెరిగి రూ. 1387.80 వద్ద సెషన్ గరిష్ఠాన్ని తాకింది. కిందటి సెషన్‌లో రూ. 1365.80 వద్ద ముగియగా.. ఆరంభంలో నష్టాల్లోనే ప్రారంభమైనా ఈ వార్తలు వచ్చాక ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరిపారు. ప్రస్తుతం వార్త రాసే సమయంలో మధ్యాహ్నం 1.40 గంటలకు చూస్తే 1.40 శాతానికిపైగా పెరిగి రూ. 1385 స్థాయిలో కొనసాగుతోంది.
పెరిగిన రిలయన్స్ మార్కెట్ విలువ..

షేరు విలువ పెరిగిన నేపథ్యంలో.. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ కూడా పెరిగింది. ప్రస్తుతం రూ. 18.74 లక్షల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 1611.80 కాగా.. కనిష్ఠ ధర రూ. 1290 గా ఉంది. గత నెల వ్యవధిలో రిలయన్స్ షేరు 3 శాతం పెరగ్గా.. 6 నెలల్లో 7 శాతం తగ్గింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 12 శాతం తగ్గింది. ఏడాది వ్యవధిలో చూస్తే ఫ్లాట్‌గానే ఉంది.
స్టాక్ మార్కెట్లకు నష్టాలు..

ఇక భారత స్టాక్ మార్కెట్లు ఏప్రిల్ 28న (మంగళవారం) నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 400 పాయింట్లకుపైగా నష్టంతో 76,900 స్థాయిలో ఉండగా.. నిఫ్టీ 100 పాయింట్లు తగ్గి 23,990 స్థాయిలో కదలాడుతోంది. ఎస్బీఐ, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, ఇండిగో నష్టాల్లో ట్రేడవుతుండగా.. ఎయిర్‌టెల్, బీఎస్ఈ, టాటా పవర్, పేటీఎం, డీమార్ట్ వంటివి లాభాల్లో ఉన్నాయి.

