డబ్బులు ఊరకే రావు అని గుండు అంకుల్ కనిపిచ్చినప్పుడల్లా జనాలకు హితబోధ చేస్తుంటాడు. డబ్బులే ఊరక రానప్పుడు అలాంటిది బంగారాన్ని ఎవరైనా ఉత్తి పుణ్యానికి ఇస్తారా చెప్పండి.
అదీ రోడ్డుపై దొరికితే తీసుకుని పరిగెత్తుతారు కానీ బజార్లో నిలబెట్టి బేరాలు ఆడరు కదా! ఒకవేళ ఇద్దరం ఒకేసారి బంగారాన్ని చూశాం ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకుందాం అంటున్నారంటే మీకు మస్కా కొడుతున్నట్టే అని గుర్తుంచుకోండి. ప్రకాశం జిల్లా దర్శలో ఓ వృద్ధురాలిని బంగారం బిస్కెట్ పేరుతో బురిడీ కొట్టించి ఒంటిపై ఉన్న బంగారం మొత్తం దోచేశారు.
ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలెం గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు రోడ్డుపై నడిచి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని మహిళ రోడ్డుపై బంగారం బిస్కెట్‌లా కనిపిస్తున్న వస్తువును పడేసింది. సరిగ్గా ఆ ముసలావిడ రాగానే ఆ వస్తువు దగ్గరకు వెళ్లి తనకు బంగారు బిస్కెట్ దొరికినట్లు నమ్మించింది. ఆ తర్వాత ఇద్దరం చూశాం కాబట్టి సరి సమానంగా పంచుకుందామని చెప్పింది.
చూడటానికి బంగారం బిస్కెట్‌లాగే ఉంది. పైగా ధగధగ మెరిసిపోతుండేప్పటికీ ఆ వృద్ధురాలు కూడా ఆ మహిళ చెప్పిన మాటలకు సరే ఉంది. ఊరికే సగం వస్తుందిగా పోయేదేముంది అనుకుంది. కానీ, ఆ తర్వాతే మహిళ తన ప్లాన్ అమలు చేసింది. తనకు ముఖ్యమైన పని ఉందని, బిస్కెట్ నువ్వే ఉంచుకుని దానికి బదులుగా ఒంటిపై ఉన్న బంగారు వస్తువులు ఇవ్వాలని వృద్ధురాలిని కోరింది.
మహిళ మాటలకు బుట్టలో పడిన వృద్ధురాలు ఒంటిపై సొమ్ము పోయినా చేతిలో పెద్ద బంగారు బిస్కెట్‌గా ఉందనుకుని తన చెవి కమ్మలు, ఒక ఉంగరం తీసి ఇచ్చింది. తీరా ఇంటికి వెళ్లి ఆ బంగారం బిస్కెట్‌ను బాగా పరిశీలించగా అది నకిలీదని తేలింది. ఇక చేసేదేమీ లేక ఆ వృద్ధురాలు పోలీసుల దగ్గరికి వెళ్లి తనకు జరిగిందంతా చెప్పి ఫిర్యాదు చేసింది. ఎవరైనా రోడ్డు మీద వస్తువులు పడేసి మోసం చేసే అవకాశం ఉందని పోలీసులు అవగాహన కల్పిస్తున్నా ప్రజల్లో అవగాహన కొరవడి ఇలాంటివి చోటుచేసుకుంటున్నాయి.

