Biocon Successor: భారత బయోటెక్నాలజీ దిగ్గజ సంస్థ బయోకాన్ భవిష్యత్తు వారసురాలిపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. ఆ కంపెనీ వ్యవస్థాపకురాలు, మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ మజుందార్ షా తన వారుసురాలిగా మేనకోడలు క్లెయిర్ మజుందార్ ను ఎంచుకున్నారు.
ఇప్పటికే బయోకాన్ బోర్డులో క్లెయిర్ అడిషన్ డైరెక్టర్‌గా నియమిస్తూ ఆ కంపెనీ అధికారిక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. దశాబ్దాల పాటు కిరణ్ మజుందార్ షా నిర్మించిన ఈ బయోకాన్ సామ్రాజ్యాన్ని ముందుకు నడిపించే బాధ్యతలు ఇప్పుడు యువ రక్తం చేతుల్లోకి వెళ్లనుండటంపై కార్పొరేట్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ క్రమంలో క్లెయిర్ మంజుదార్ గురించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఎవరీ క్లెయిర్ మంజుదార్?
కిరణ్ మజుందార్ షా సోదరుడి కుమార్తెనే ఈ క్లెయిర్ మంజుదార్. కేవలం బంధుత్వం వల్లే ఈ పదవిలోకి ఆమె రాలేదు. ఈ రంగంలో క్లెయిర్ మంజుదార్‌కు అపారమైన అనుభవం, అద్భుతమైన విద్యా నేపథ్యం ఉంది. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి బయో ఇంజనీరింగ్‌లో క్లెయిర్ పీహెచ్‌డీ చేశారు. అలాగే మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. గతంలో జెమినీ థెరప్యూటిక్స్ వంటి అంతర్జాతీయ కంపెనీల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. బయోటక్నాలజీ, ఇన్వెస్ట్‌మెంట్ రంగాల్లో మంచి పట్టు కలిగి ఉన్నారు. ఫార్చూన్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కిరణ్ మజుందార్ షా ఈ నిర్ణయంపై మాట్లాడారు. నాలుగు దశాబ్దాల క్రితం బయోకాన్‌ను ఏర్పాటు చేసిన కిరణ్ మజుందార్ షాకు పిల్లలు లేరు. దీంతో తన కంపెనీని తదుపరి దశకు తీసుకెళ్లే బాధ్యతలను మేనకోడలు క్లెయిర్ మజుందార్‌కు అప్పగించినట్లు తెలిపారు.వారసత్వ నిర్ణయం వెనుక కారణాలు
కిరణ్ మంజుదార్ షా వయసు రీత్యా, అలాగే కంపెనీని గ్లోబల్ మార్కెట్లో తదుపరి స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. బయోకాన్ ప్రస్తుతం బయోసిమిలర్స్, కొత్త మందుల తయారీలో ప్రపంచ వ్యాప్తంగా పోటీ పడుతోంది. ఇలాంటి సమయంలో సైంటిఫిక్ పరికజ్ఞానం, వ్యాపార మెళుకువలు రెండూ ఉన్న క్లెయిర్ మంజుదార్ వంటి వ్యక్తి నాయకత్వం సంస్థకు అవసరమని భావించినట్లు తెలుస్తోంది.భారతదేశంలోని టాప్ ఐటీ, ఫార్మా కంపెనీల్లో వారసత్వ బదిలీలు ఈ మధ్య కాలంలో చాలా కీలకంగా మారాయి. కిరణ్ మజుందార్ షా తన వారసురాలిని చాలా జాగ్రత్తగా, సరైన సమయంలో ఎంపిక చేసినట్లు అర్థమవుతోంది. ఇలా చేయడం ద్వారా ఇన్వెస్టర్లలో భరోసా నింపారని చెప్పవచ్చు. క్లెయిర్ నియామకం ఈ నెల రెండో వారం నుంచే అమలులోకి వస్తుందని సమాచారం.

