Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రూపాయికే ఎగ్ రైస్.. రూ.2కే ప్లేట్ గోబీ.. ఎగబడిన జనం..

రూపాయికే ఎగ్ రైస్.. రూ.2కే ప్లేట్ గోబీ.. ఎగబడిన జనం..

Telugu Samayam 2 weeks ago

ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. పెరుగుతున్న నిత్యావసర సరుకులు.. మధ్యతరగతి బాధలు చూసి ఓ సినీ రచయిత ఆవేదనతో రాసిన పాట ఇది. మార్కెట్లో కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగిన ప్రతిసారీ..

సగటు మధ్యతరగతి జీవి మెదిలే పాట కూడా ఇదే. అయితే రూపాయి ఉంటే ఎగ్ రైస్ కొనొచ్చు. రూ.2 ఉంటే గోబీ తినొచ్చు కూడా. ఏంటీ రూ.1 కే ఎగ్ రైస్, రూ.2లకే ప్లేట్ గోబీనా అని నోరెళ్లబెడుతున్నారా.. ఈ కాలంలో రూపాయికే ఏం వస్తుంది.. చివరకు అగ్గిపెట్టె కూడా రాదనుకుంటున్నారా.. అయితే మీరు నంద్యాలకు వెళ్లాల్సిందే.

నంద్యాలలోని డేనియల్‍పురం వద్ద ఉన్న లక్కీ ఫాస్ట్‌ఫుడ్ నిర్వాహకులు కస్టమర్లకు ఈ ఆఫర్ ప్రకటించారు. దీంతో సోమవారం ఆ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ వద్ద పండగ వాతావరణం నెలకొంది. ఎగ్ రైస్, గోబీ రుచిచూసేందుకు పిల్లల నుంచి పెద్దల వరకూ షాపు ముందు క్యూ కట్టారు. తమ వంతు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసి.. ఆనక రూ.1కే ఎగ్ రైస్, రూ.2లకే గోబీ, ఎగ్ నూడుల్స్ రుచి చూశారు. అయితే మార్కెట్లో రేట్లు ఇంతలా పెరుగుతుంటే ఈ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ ఎలా ఇలా అందించిందని ఆలోచిస్తున్నారా.. అదేనండి మార్కెటింగ్ జిమ్మిక్కు.

సోమవారం రోజునే ఈ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఆఫర్ ప్రకటించారు. అంతటితో ఊరుకోలేదు,. ఈ ఆఫర్ గురించి సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం చేశారు. ఇంకేముంది సోమవారం షాపు తెరవకముందే.. అక్కడ జనాలు ప్రత్యక్షమయ్యారు. సగటు ఇండియన్ సైకాలజీ తెలిసిన ఫాస్ట్‌ఫుడ్ నిర్వాహకులు.. అలా తమ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ గురించి వినూత్నంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. మార్కెటింగ్ కోసం చేసే ఖర్చు కంటే ఈ రకంగా జరిగే మౌత్ పబ్లిసిటీ ద్వారా ఎక్కువ ప్రచారం జరుగుతుందని. తమ వ్యాపారం బాగుంటుందని ఆ రకంగా ఆలోచన చేశారన్నమాట.

ఇక ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. ప్రారంభోత్సవం సందర్భంగా రూపాయికే ఇలా ఎగ్ రైస్ అందిస్తే.. తొలిరోజు భారీగా జనాలు వస్తారు. కానీ వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే మాత్రం నాణ్యత, రుచి విషయంలో రాజీ పడకూడదని.. అప్పుడే వ్యాపారం మరింత లాభసాటిగా నడుస్తుందని అక్కడికి వచ్చిన జనం అభిప్రాయపడుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam