Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
S-400ల లోకేషన్లు గుర్తించేందుకు పాక్ కుటిల ప్రయత్నాలు.. రంగంలోకి గూఢచారులు, స్లీపర్ సెల్స్.. మాజీ అధికారి సంచలన వ్యాఖ్యలు

S-400ల లోకేషన్లు గుర్తించేందుకు పాక్ కుటిల ప్రయత్నాలు.. రంగంలోకి గూఢచారులు, స్లీపర్ సెల్స్.. మాజీ అధికారి సంచలన వ్యాఖ్యలు

Telugu Samayam 2 weeks ago

'ఆపరేషన్ సింధూర్' సమయంలో భారత్‌కు చెందిన గగనతల రక్షణ వ్యవస్థ S-400ల లొకేషన్లను గుర్తించేందుకు గూఢచారులను, స్లీపర్ సెల్స్‌ను పాకిస్థాన్ రంగంలోకి దించిందని రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ క్షిపణి వ్యవస్థ ఆచూకీ తెలుసుకోవడానికి 'సాధ్యమైన అన్ని రకాల పన్నాగాలను' దాయాది ఉపయోగించిందని తెలిపారు. ఈ మేరకు ఏఎన్‌ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జితేంద్ర మిశ్రా పేర్కొన్నారు. పాకిస్థాన్ వైమానిక దళాలకు చెందిన విమానాలను, ఆస్తులను S-400 వ్యవస్థ పదేపదే అడ్డుకోవడంతో తమకు అతిపెద్ద ముప్పుగా ఇస్లామాబాద్ భావించిందని తెలిపారు.

ఈ వైమానికదళ రక్షణ వ్యవస్థల లోకేషన్లను గుర్తించేందుకు జరిపిన ప్రయత్నాల్లో ఇతర దేశాల నుంచి ఉపగ్రహాల సాయం, గగనతల నిఘా, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సామర్థ్యాలను సైతం పాకిస్తాన్ ఉపయోగించుకుందని ఆయన వివరించారు. ''ఆపరేషన్ సింధూర్ సమయంలో S-400 ఎక్కడ ఉందో కనుక్కోవడానికి వారు మన దేశంలో గూఢచారులను దింపారు.. తమ స్లీపర్ సెల్స్‌ను యాక్టివేట్ చేశారు'' అని యుద్ధంలో ఇస్లామాబాద్ జరిపిన కుట్రలను మిశ్రా వివరించారు. ఇతర దేశాల నుంచి పాక్ ఉపగ్రహ వ్యవస్థల సహాయం పొందిందని వెల్లడించిన ఆయన.. ఆ దేశం పేరు చెప్పడానికి మాత్రం నిరాకరించారు.

''ఇతర దేశాల శాటిలైట్ సహాయాన్ని వినియోగిస్తున్నారు.. నేను ఆ దేశం పేరును ఇక్కడ చెప్పాలనుకోవడం లేదు'' అని మిశ్రా తెలిపారు. ఆదంపూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌పై పాకిస్థాన్ దాడి చేయడానికి కారణం అక్కడ S-400 వ్యవస్థలు ఉన్నాయని వారు నమ్మడమేనని మిశ్రా పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో S-400 వ్యవస్థ 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలోని పాకిస్థాన్‌కు చెందిన భారీ యుద్ధ విమానాన్ని కూల్చివేసిందని వైమానిక దళ వర్గాలు తెలిపాయి.

సంఘర్షణ సమయంలో పాక్ వైమానిక ముప్పును తిప్పికొట్టడంలో ఈ వ్యవస్థ కీలక పాత్ర పోషించింది. నాలుగోది కూడా అందుబాటులోకి రావడంతో వైమానిక దళం తన గగనతల రక్షణ వ్యవస్థ పరిధిని మరింత విస్తరించింది. ఇది ముఖ్యమైన సైనిక, వ్యూహాత్మక ఆస్తులను సంరక్షించే భారత సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసింది. శత్రువులవైపు నుంచి ముప్పును ముందే గుర్తించడం, విభిన్న రకాల క్షిపణులను ప్రయోగించే సౌలభ్యం, వివిధ వర్గాలకు చెందిన వైమానిక దాడులను అడ్డుకునే శక్తి కలిగిన S-400 వ్యవస్థ.. భారత్ బహుళ అంచెల వైమానిక రక్షణ వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన భాగాలలో ఒకటిగా నిలిచింది. గతేడాది ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam