Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సైన్యంలోకి అందాల యువరాణి.. రాజకుటుంబానికి చెందిన తొలి మహిళగా చరిత్ర సృష్టించిన ఇసాబెల్లా

సైన్యంలోకి అందాల యువరాణి.. రాజకుటుంబానికి చెందిన తొలి మహిళగా చరిత్ర సృష్టించిన ఇసాబెల్లా

Telugu Samayam 1 week ago

డెన్మార్క్ యువరాణి ఇసాబెల్లా 11 నెలల సైనిక శిక్షణను ప్రారంభించి, పూర్తిస్థాయి సైనిక సేవలో చేరిన డానిష్ రాజకుటుంబం మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు.

కింగ్ ఫ్రెడరిక్, క్వీన్ మేరీల పెద్ద కుమార్తె అయిన 19 ఏళ్ల ఇసాబెల్లా.. హైస్కూల్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన కొద్దివారాలకే ఆగస్టు 3న స్లాగెల్స్‌లోని ఆంట్వేర్క్స్‌వ్ బ్యారక్స్‌లో సైనిక విధులకు హాజరైనట్టు Nine.com.au నివేదించింది. వేసవి సెలవుల అనంతరం తన మొదటి రోజున ఎవరి కంటపడకుండా కారులో స్వయంగా బ్యారక్స్‌కు వెళ్లారు.

జీన్స్, స్వెడ్ జాకెట్‌తో సాధారణ దుస్తుల్లో పెద్ద బ్యాక్‌ప్యాక్‌తో బ్యారెక్స్‌లోకి ప్రవేశించిన ఆమె... ఎంట్రీ గేట్ వద్ద విధుల్లో ఉన్న గార్డుకు తన గుర్తింపు పత్రాలను చూపించారు. లోపలికి వెళ్లే ముందు అక్కడ ఉన్న కొద్దిమంది జర్నలిస్ట్‌లు, ఫోటోగ్రాఫర్లకు ఆమె అభివాదం చేశారు. ఇదే బ్యారెక్స్‌లో సైనిక శిక్షణ పూర్తిచేసుకుని, ప్రస్తుతం సెకెండ్ లెఫ్టినెంట్‌గా ఉన్న తన అన్నయ్య, యువరాజు క్రిస్టియన్ బాటలోనే ఇసాబెల్లా నడిచారు. డెన్మార్క్ రాజకుటుంబానికి చెందినవారు సాంప్రదాయకంగా సాయుధ దళాలలో సేవలందించడం ఆనవాయితీగా వస్తున్నా... దేశవ్యాప్తంగా విస్తరించిన సైనిక నిర్బంధం కింద శిక్షణలో చేరిన రాజకుటుంబానికి చెందిన తొలి మహిళ ఇసాబెల్లానే కావడం విశేషం.

సాధారణ సైనికులతో పోల్చితే యువరాణి ఇసాబెల్లా తనకు రావాల్సిన జీతం లేదా రోజువారీ భత్యాలను తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. సైనిక సేవలో ఉన్న సమయంలో ప్రభుత్వ నుంచి ఎటువంటి ఆర్థిక సౌకర్యాలను తీసుకోరని, తన తల్లిదండ్రుల మద్దతుపైనే ఆధారపడతారని డెన్మార్క్ రాజకుటుంబం స్పష్టం చేసింది. సాధారణంగా డెన్మార్క్‌లో 11 నెలల సైనిక సేవ చేసే అభ్యర్థులకు నెలవారీ జీతంతో పాటు పన్ను రహిత రోజువారీ భత్యం లభిస్తుంది.

సైనిక సేవను విస్తరిస్తోన్న డెన్మార్క్

ఉక్రెయిన్‌లో యుద్ధం, ఆర్కిటిక్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతల సహా ఐరోపాలో పెరుగుతున్న భద్రతా ఆందోళనల నేపథ్యంలో డెన్మార్క్ తన సాయుధ దళాలను బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా మహిళలకు కూడా నిర్బంధ సైనిక సేవలను 2024లో తప్పనిసరి చేసిన తరుణంలో ఇసాబెల్లా సైన్యంలో చేరింది. గతంలో నాలుగు నెలలు ఉండగా.. దీనిని 11 నెలలకు పొడిగించింది. ఈ వారంలో సుమారు 1,600 మంది యువత కొత్తగా పొడిగించిన సైనిక శిక్షణ ప్రారంభించారు. ఈ నెల చివర్లో విధుల్లో భాగంగా కొంతమంది రిక్రూట్లను మొదటిసారిగా గ్రీన్‌ల్యాండ్‌కు పంపనున్నారు. ఇటీవల గ్రీన్‌ల్యాండ్ తరుచూ వార్తల్లో నిలుస్తోన్న విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపమైన దీనిని స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలు తీవ్ర ఉద్రిక్తతలకు కారణమయ్యాయి.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam