బాల్యాన్ని గుర్తు చేసే చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. గడిచిన ఆ బాల్యం, తిరిగిన రాని ఆ బాల్యం అంటే అందరికీ మధరమే. నాటి రోజుల్ని తలుచుకుని మురిసిపోతారంతా.
అలాంటి బాల్యాన్ని గుర్తు చేసేందుకు 'సమ్మర్ హాలీడేస్' అనే సినిమాని తీసుకు వచ్చారు. ధీరజ్ మొగిలినేని నిర్మాణంలో శ్రీకర్ నయన్ తెరకెక్కించిన ఈ సినిమాలో రోహన్ రాయ్, అరుణ్ దేవ్, ఖుషీ సోని, జయసుధ, రాజీవ్ కనకాల, హర్ష వర్దన్, వాసుకి ప్రధాన పాత్రలు పోషించారు. మరి ఈ సినిమా నేడు ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ కథ ఏంటి? అన్నది ఓ సారి చూద్దాం.
కథ
రావూరి వెంకటేశ్ అలియాస్ ఆర్‌వీ (అరుణ్ దేవ్) తండ్రికి భయపడుతూ ఉంటాడు. క్రికెట్ ఆడాలని మనసులో ఎంత ఉన్నా కూడా.. తండ్రి మీదున్న భయంతో పుస్తకాలతోనే కుస్తీ పడుతుంటాడు. తండ్రి కోరినట్టుగా ఫస్ట్ ర్యాంక్ కాకుండా పదో ర్యాంకుని సాధిస్తాడు. ఇక సమ్మర్ హాలీడేస్ అని ఆర్‌వీ తన అమ్మమ్మ సుశీలమ్మ (జయసుధ) ఊరు తోటవారిపాలెంకి వెళ్తాడు. అక్కడ ఆర్‌వీకి ఓ కొత్త ఫ్రెండ్ కేవీ.. కాశీ వెంకటేశ్వర్లు పరిచయం అవుతాడు. కాశీ ఆర్థిక పరిస్థితి ఏమీ బాగుండదు. తల్లికి ఓ కొత్త చీర కొనిపెట్టాలనే లక్ష్యంతో వర్మ (రాజీవ్ కనకాల) వద్ద ఉన్న మామిడి చెట్లను లీజ్‌కి తీసుకుని సాగు చేస్తుంటాడు. ఆ సాగుతో వచ్చిన డబ్బుతో అమ్మకి కొత్త చీర కొనాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ఆర్‌వీ, కేవీ స్నేహం ఎలా ముందుకు సాగుతుంది? ఒకరి జీవితంపై మరొకరు ఏ విధంగా ప్రభావితం చూపించారు? మార్కులే జీవితం అని అనుకునే ఆర్‌వీ తండ్రి (హర్ష వర్దన్) చివరకు తన ధృక్కోణాన్ని మార్చుకుంటాడా? లేదా? చివరకు ఏం జరుగుతుంది? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
సమ్మర్ హాలీడేస్‌లో కొత్తగా కథ అంటూ ఏమీ ఉండదు. కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే బాగుంటాయి. మార్కులే జీవితం కాదని కొన్ని సీన్స్‌లో చెప్పే ప్రయత్నం చేశాడు. కథ ఒక దగ్గర స్టార్ట్ అయి.. ఎటెటో వెళ్లిపోయి.. ఎక్కడో ఆగినట్టు అనిపిస్తుంది. ఇక ఈ కథలో పెద్ద సంఘర్షణ కూడా ఏమీ కనిపించదు. ఒక కథకు హీరో, విలన్ చాలా ఇంపార్టెంట్. ఇందులో ఆ రెండూ కనిపించవు. కేవలం ఇద్దరు పిల్లల చుట్టూనే తిరుగుతుంది. అందుకే చాలా వరకు కాన్ ఫ్లిక్ట్ ఎక్కువగా కనిపించదు. ఏదో సినిమా ముందుకు సాగుతోంది అంటే.. సాగుతోంది అన్నట్టుగా ఉంటుంది.
సిటీలో పిల్లాడు.. మార్కుల కోసం మందలించే తండ్రి.. ఆటలు పాటలకు దూరంగా ఉండే ఆ పిల్లాడు.. అమ్మమ్మ ఊరికి రావడంతో కథ కాస్త ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. అక్కడ పిల్లలిద్దరి స్నేహం బాగుంటుంది. కొన్ని ఎపిసోడ్స్ అయితే బాల్యాన్ని గుర్తు చేస్తాయి. కథ ఊరికి షిఫ్ట్ అయిన తర్వాత కేవీ పాత్రే హైలెట్‌గా నిలుస్తుంది. ఒకరికొకరు తోడుగా నిలవడం, వారి స్నేహబంధం చూడటానికి ముచ్చటగా ఉంటుంది. ఇక మామిడి చెట్టు సాగు చుట్టూ సెకండాఫ్ తిరుగుతుంది. అయితే ఎక్కడా కూడా ఏ పాత్ర కూడా పూర్తి స్థాయి నెగెటివ్ యాంగిల్, విలనిజాన్ని చూపించదు. అయితే సెకండాఫ్‌లో అమ్మమ్మ ఇంట్లోని కొన్ని ఎపిసోడ్స్ బాగుంటాయి.
చదువుకున్నోడు పని చేస్తే ఉద్యోగం అంటారు.. చదువుకోనోడు పని చేస్తే కూలీ అంటారు.. కోపంగా చెప్తే వినాలని అనిపించదు.. ప్రేమగా చెప్తే వినాలనిపిస్తుంది.. అనే కొన్ని డైలాగ్స్ బాగుంటాయి. పిల్లల మీద మార్కులు, ర్యాంకులు అనే ఒత్తిడి ఉండకూడదు, పిల్లల బాల్యాన్ని తల్లిదండ్రులు చిదిమేయకూడదు అని దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ మాత్రం బాగుంటుంది. పాయింట్ వరకు, మెసెజ్ వరకు బాగానే అనిపించినా.. పూర్తి స్థాయి సినిమా మాత్రం అంత ప్రభావవంతంగా అనిపించదు. ఏదో వెలితి మాత్రం కనిపిస్తూ ఉంటుంది.
ఆర్టిస్టుల్లో పిల్లలిద్దరూ బాగా చేశారు. రోహన్, అరుణ్ ఇద్దరూ పోటీ పడి మరీ నటించారు. జయసుధ, వాసుకి, హర్ష వర్దన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజీవ్ కనకాల కనిపించినంత వరకు హుందాగా ఉంటాడు. పిల్లాడి తల్లిగా యాంకర్ హర్షిణి అద్భుతంగా నటించారు. ఆమె లుక్, యాక్టింగ్ చాలా నేచురల్‌గా అనిపిస్తుంది. రమణ భార్గవ్ ఇలా మిగిలిన వారంతా తమ తమ పాత్రల్లో అందరూ పరిధి మేరకు మెప్పిస్తారు.
టెక్నికల్‌గా చూసుకుంటే ఊరి వాతావరణం మాత్రం చక్కగా చూపించారు. ఎక్కువగా మామిడి తోటలోనే షూటింగ్ చేసినట్టు అనిపిస్తుంది. కెమెరా వర్క్ బాగుంటుంది. సింజిత్ పాటలు, బీజీఎం హృదయానికి హత్తుకునేలా ఉంటాయి. మాటలు గుర్తు పెట్టుకునేలా ఉంటాయి. ఉన్న బడ్జెట్‌లో మంచి క్వాలిటీ ప్రొడక్ట్ అందించినట్టు అనిపిస్తుంది. ఎడిటింగ్, ఆర్ట్, కాస్ట్యూమ్ అన్నీ కూడా బాగుంటాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంటాయి.
చివరగా 'సమ్మర్ హాలీడేస్' అద్భుతాలు సృష్టించకపోవచ్చు కానీ.. బాల్యాన్ని గుర్తు చేసే ఓ సింపుల్, అందమైన సినిమాగా అయితే నిలుస్తుంది. ఇప్పటి పిల్లలకి కూడా ఈ చిత్రం నచ్చే అవకాశం ఉంది.

