ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన కేంద్ర మంత్రిమండలి రూ.84,084 కోట్ల అంచనా వ్యయంతో 'సముద్ర మంథన్' అనే జాతీయ ఆఫ్‌షోర్ ఇంధన అన్వేషణ పథకానికి ఆమోదముద్ర వేసింది. గతేడాది ఆగస్టు 15వ తేదీన ఎర్రకోట వేదికగా ప్రధాని చేసిన వికసిత్ భారత్‌యే లక్ష్యంగా.. సముద్ర గర్భంలోని అపారమైన ఇంధన వనరులను వెలికితీసే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును రూపొందించారు.
పెరుగుతున్న దిగుమతుల భారం.. తగ్గుతున్న స్వదేశీ ఉత్పత్తి
ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు వినియోగదారుగా ఉంది. అయితే స్వదేశీ చమురు క్షేత్రాలైన ముంబై, అస్సాం ప్రాంతాలలోని పాత బావుల్లో ఉత్పత్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. 2014-15లో భారత్ చమురు దిగుమతుల ఆధార పడటం 78.5 శాతంగా ఉండగా.. 2025-26 నాటికి అది ఏకంగా 88.7 శాతానికి పెరిగింది. అలాగే 2015 ఆర్థిక సంవత్సరంలో 189.4 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉన్న ముడి చమురు దిగుమతులు, 2026 నాటికి 245.3 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరాయి. సహజ వాయువుతో కలిపి దేశ మొత్తం ఇంధన దిగుమతుల ఆధారపడటం 80.7 శాతంగా నమోదైంది. అయితే దిగుమతులను తగ్గించి.. స్వదేశీ ఉత్పత్తిని పెంచాలనే ఉద్దేశ్యంతోనే కేంద్ర ప్రభుత్వం సముద్ర మంథన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 'సముద్ర మంథన్' నమూనా.. రూ.84,084 కోట్ల కేటాయింపులు
2031 మార్చి 31 వరకు అమలయ్యే ఈ మొదటి విడత పథకానికి రూ.84,084 కోట్లు కేటాయించారు. అయితే ఈ నిధుల్లోంచి సముద్ర గర్భంలో ఆధునిక సీస్మిక్ డేటాను సేకరించి, ప్రాసెస్ చేయడానికి రూ.28,534 కోట్లు వాడనున్నారు. అలాగే 60 లోతైన సముద్రపు అన్వేషణ బావుల తవ్వకానికి రూ.43,200 కోట్లు కేటాయించారు. ఇందులో ప్రభుత్వం ప్రతి బావికి 50 శాతానికి పైగా లేదా గరిష్ఠంగా రూ.675 కోట్ల సాయం అందిస్తుంది. అంతేకాకుండా ఆఫ్‌షోర్ మౌలిక సదుపాయాల కేంద్రాల అభివృద్ధికి రూ.10,000 కోట్లు కేటాయించారు. దేశీయంగా పరికరాలు, సాంకేతిక తయారీని ప్రోత్సహించేందుకు రూ.2,000 కోట్ల నిధులు సమకూర్చనున్నారు. ఈ పథకంతో భారత్‌కు దక్కే ప్రయోజనాలివే..!
ఈ పథకం విజయవంతమైతే.. ప్రస్తుతం ఏడాదికి 62 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉన్న దేశీయ చమురు, గ్యాస్ ఉత్పత్తి 80 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరుగుతుంది. ఇది విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేస్తూ. వార్షికంగా సుమారు రూ.1 లక్ష కోట్ల రూపాయల దిగుమతి భారాన్ని తగ్గిస్తుంది. "ఇంధన దిగుమతుల కోసం మనం వెచ్చిస్తున్న వేల కోట్లను దేశంలో పేదరికం నిర్మూలనకు, యువత భవిష్యత్తుకు, రైతుల సంక్షేమానికి ఉపయోగించవచ్చు" అని గతంలో ప్రధాని పేర్కొన్న మాటలను ఈ సందర్భంగా పెట్రోలియం శాఖ వర్గాలు గుర్తు చేశాయి. ప్రభుత్వ ఈ చొరవ ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, స్వదేశీ తయారీ రంగానికి కొత్త ఊపిరి పోస్తుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.