ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ అభిమాన పేసర్, 'యార్కర్ మ్యాన్' టి.నటరాజన్‌ను మళ్లీ సొంత గూటికి రప్పించుకుంది.
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన సక్సెస్ ఫుల్ ప్లేయర్ ట్రేడ్ ద్వారా నటరాజన్ తిరిగి ఎస్ఆర్‌హెచ్ జట్టులోకి వచ్చాడు. ఈ ట్రేడింగ్‌లో భాగంగా యంగ్ లెగ్ స్పిన్నర్ జీషన్ అన్సారీ.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జతకట్టాడు. ఇరు జట్ల మధ్య జరిగిన ఈ ట్రేడ్ డీల్ క్రికెట్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది.
గతంలో 2025 ఐపీఎల్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 10.75 కోట్ల భారీ ధరకు నటరాజన్‌ను కొనుగోలు చేసింది. అయితే ఆ జట్టు తరఫున రెండు సీజన్లలో కలిపి 12 మ్యాచ్‌లు ఆడిన అతడు.. కేవలం 5 వికెట్లు మాత్రమే తీశాడు. దీంతో ఇప్పుడు రూ. 5 కోట్ల సవరించిన ధరకు అతడిని సన్‌రైజర్స్ ట్రేడ్ చేసుకుంది. ఇక జీషన్ అన్సారీ విషయానికి వస్తే.. అతడు తన పాత ఫీజు అయిన రూ. 40 లక్షలతోనే ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కొనసాగనున్నాడు.
నటరాజన్‌కు సన్‌రైజర్స్ ఫ్రాంచైజీతో విడదీయరాని అనుబంధం ఉంది. 2020 నుంచి 2024 వరకు ఎస్ఆర్‌హెచ్‌కు ప్రాతినిధ్యం వహించిన నట్టూ.. 2024 సీజన్‌లో అద్భుతంగా రాణించి 19 వికెట్లతో జట్టు తరఫున లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఆ ఏడాది సన్‌రైజర్స్ ఫైనల్‌కు దూసుకెళ్లడంలో నటరాజన్ కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా ఐపీఎల్‌లో 73 మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ 32.97 సగటుతో 72 వికెట్లు పడగొట్టాడు. 2017లో పంజాబ్ జట్టుతో ఐపీఎల్ ప్రయాణం ప్రారంభించిన నటరాజన్, ఆ తర్వాత ఎస్ఆర్‌హెచ్‌తో అడుగుపెట్టి సత్తా చాటాడు.
మరోవైపు జీషన్ అన్సారీ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ తరఫున 10 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్ అరంగేట్రంలోనే ఢిల్లీపై 3 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించిన ఈ 26 ఏళ్ల ఉత్తరప్రదేశ్ లెగ్ స్పిన్నర్, ఆ సీజన్‌లో మొత్తం 6 వికెట్లు పడగొట్టాడు. 2026 సీజన్ కోసం ఎస్ఆర్‌హెచ్ అతడిని రిటైన్ చేసుకున్నప్పటికీ తుది జట్టులో అవకాశం దక్కలేదు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని ఈ యువ స్పిన్నర్ పట్టుదలగా ఉన్నాడు.

