Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
"శశి థరూర్‌కు సోనియా గాంధీ మద్దతిచ్చారు": కొచ్చి టస్కర్స్ ఐపీఎల్ వివాదంపై లలిత్ మోదీ సంచలనం

"శశి థరూర్‌కు సోనియా గాంధీ మద్దతిచ్చారు": కొచ్చి టస్కర్స్ ఐపీఎల్ వివాదంపై లలిత్ మోదీ సంచలనం

Telugu Samayam 1 week ago

Lalit Modi IPL Allegations: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత సంచలనం సృష్టించిన 2010 నాటి 'కొచ్చి టస్కర్స్ కేరళ' ఫ్రాంచైజీ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.

ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ.. అప్పటి యూపీఏ ప్రభుత్వంపై, ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేతలపై సంచలన ఆరోపణలు చేశారు. కొచ్చి జట్టు యాజమాన్య నిర్మాణం, సునంద పుష్కర్ పాత్రపై తాను ప్రశ్నలు లేవనెత్తినప్పుడు.. అప్పటి ప్రభుత్వం తనపై తీవ్ర రాజకీయ ఒత్తిడి తీసుకు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో లలిత్ మోదీ ఆనాటి తెరవెనుక రాజకీయాలను బయటపెట్టారు.

రూ. 10ల షేర్.. రూ. 1 లక్ష ఎలా అయింది?

లలిత్ మోదీ తెలిపిన వివరాల ప్రకారం.. కొచ్చి కన్సార్టియం 350 మిలియన్ డాలర్ల భారీ మొత్తంతో ఐపీఎల్ ఫ్రాంచైజీ హక్కులను దక్కించుకుంది. అయితే ఈ జట్టు ఆర్థిక నిర్మాణంలో తీవ్ర అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. "కన్సార్టియంలోని 75 శాతం మంది వాటాదారులు 100 శాతం ఖర్చును భరిస్తుంటే.. ఎలాంటి పెట్టుబడి పెట్టని సునంద పుష్కర్‌కు 25 శాతం ఉచిత ఈక్విటీ, 15 శాతం రాబడిని ఎలా కట్టబెడతారు?" అని మోదీ ప్రశ్నించారు. ఫ్రాంచైజీ దక్కిన రోజున సునంద పుష్కర్ రూ. 10 విలువైన షేర్ విలువ ఏకంగా రూ. 1 లక్షకు చేరిందని.. ఈ అక్రమ ఒప్పందం కారణంగానే ఆ జట్టు రెండు సంవత్సరాల్లోనే కుప్పకూలిపోయిందని ఆయన విమర్శించారు.

సోనియా గాంధీ అండతో శశి థరూర్ బెదిరించారంటూ!

ఈ వివాదంలో కాంగ్రెస్ నేత శశి థరూర్‌కు వెనుక ఉండి మద్దతు ఇచ్చింది ఎవరనే ప్రశ్నకు లలిత్ మోదీ నేరుగా "సోనియా గాంధీ" అని సమాధానం ఇచ్చారు. ఆ సమయంలో తనను చుట్టుముట్టి టార్గెట్ చేశారని, కాంగ్రెస్ సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, ప్రణబ్ ముఖర్జీల నుంచి తనకు ఫోన్ కాల్స్ వచ్చాయని చెప్పారు. అలాగే రాజీవ్ శుక్లా కూడా తన వద్దకు వచ్చి 'ఇలా చేయి.. అలా చేయి' అంటూ ఒత్తిడి తెచ్చారని వెల్లడించారు.



బెంగళూరులో జరిగిన ఒక సమావేశంలో వాటాదారులందరి అసలు గుర్తింపు తెలిసే వరకు తాను ఫ్రాంచైజీ ఒప్పందంపై సంతకం చేయనని తిరస్కరించినట్లు మోదీ గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత అప్పటి విదేశాంగ శాఖ సహాయ మంత్రి శశి థరూర్ తనకు ఫోన్ చేశారని లలిత్ మోదీ ఆరోపించారు. "శశి థరూర్ నాకు ఫోన్ చేసి.. లలిత్.. సునంద పుష్కర్ గురించి ఎక్కువగా ప్రశ్నించకు. ఆమె నాకు మంచి స్నేహితురాలు. ఒకవేళ నువ్వు వినకుంటే రేపు ఉదయమే నీపై ఐటీ దాడులు చేయిస్తాను' అని బెదిరించారు. దానికి నేను భయపడకుండా.. నువ్వు విదేశాంగ మంత్రివి కావచ్చు. కానీ నన్ను బెదిరించొద్దు అని చెప్పి ఫోన్ పెట్టేశాను" అని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఒత్తిడితో సంతకం.. ట్విట్టర్ సంభాషణలు

కేరళలో సరైన స్టేడియం లేకపోయినా థరూర్ వచ్చి బతిమిలాడటంతోనే తాను కొచ్చి జట్టుకు మద్దతు ఇచ్చానని మోదీ అంగీకరించారు. ఆ తర్వాత ఒకరోజు అర్ధరాత్రి అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ తనకు ఫోన్ చేసి.. కొచ్చి ఒప్పందంపై వెంటనే సంతకం చేయాలని ఆదేశించారని చెప్పారు. తాను నిరాకరించినప్పటికీ వినకపోవడంతో.. "నేను ఈ పత్రంపై తీవ్ర ఒత్తిడి కింద సంతకం చేస్తున్నాను" అని ఆ ఫైల్‌పై నోట్ రాసి మరీ సంతకం చేసినట్లు మోదీ స్పష్టం చేశారు. ఇక 2014లో సునంద పుష్కర్ మరణించడానికి కొన్ని గంటల ముందు ఆమె ట్విట్టర్ వేదికగా తనతో మాట్లాడిందని.. నేను నిజాలు బయటపెట్టాలా అని అడగ్గా... ధైర్యంగా ముందడుగు వేసి నిజాలు చెప్పు అని సూచించినట్లు లలిత్ మోదీ వెల్లడించారు. అయితే ఆమెను తాను ఎప్పుడూ నేరుగా కలవలేదన్నారు. ఈ వివాదం కారణంగానే 2010 ఏప్రిల్‌లో శశి థరూర్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత 2011లో బీసీసీఐ కొచ్చి ఫ్రాంచైజీని రద్దు చేసింది.

ఐపీఎల్ క్రికెట్ చరిత్రను శాసించిన అత్యంత వివాదాస్పద 'కొచ్చి టస్కర్స్' వ్యవహారం దశాబ్దం తర్వాత మళ్లీ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. 2010 నాటి ఈ ఉదంతంలో జట్టు వాటాదారుల అక్రమ ఒప్పందాలు, సునంద పుష్కర్ పాత్రను తాను ప్రశ్నించినందుకు అప్పటి యూపీఏ ప్రభుత్వం తనను ఎలా టార్గెట్ చేసిందో ఐపీఎల్ మాజీ బాస్ లలిత్ మోదీ సంచలన నిజాలను బయటపెట్టారు. శశి థరూర్ వెనుక సోనియా గాంధీ ఉండి నడిపించారంటూ.. తనను ఐటీ దాడులతో బెదిరించారంటూ సంచలన షాకింగ్ కామెంట్లు చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam