Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే ఐదో తరం యుద్ధ విమానం తయారీ.. రంగంలోకి మూడు ప్రైవేటు సంస్థలు

శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే ఐదో తరం యుద్ధ విమానం తయారీ.. రంగంలోకి మూడు ప్రైవేటు సంస్థలు

Telugu Samayam 1 week ago

India AMCA RFP Issued: భారతదేశ రక్షణ, వైమానిక రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. దేశీయంగా అభివృద్ధి చేయనున్న మొట్టమొదటి ఐదో తరం అధునాతన స్టెల్త్ ఫైటర్ జెట్ 'అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్' (ఏఎమ్‌సీఏ) ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ జారీ చేసింది.

అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో ఎప్పుడూ ముందుండే ప్రభుత్వ రంగ సంస్థ 'హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్' (హెచ్ఏఎల్)ను పక్కన పెట్టి మరీ.. రక్షణ మంత్రిత్వ శాఖ చరిత్రలోనే తొలిసారిగా మూడు దిగ్గజ ప్రైవేట్ కూటములను ఆహ్వానించడం విశేషం.

రూ. 15,000 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ఈ మెగా ప్రాజెక్ట్ రేసులో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, ఎల్‌అండ్‌టీ బెల్ డైనమాటిక్ కన్సార్టియం, భారత్ ఫోర్జ్ బీఈఎమ్‌ఎల్ డేటా పాటర్న్స్ కూటమి నిలిచాయి. ఈ ప్రాజెక్టు ద్వారా లభించే కాంట్రాక్ట్ ఆధారంగా ఎంపికైన ప్రైవేట్ భాగస్వామి ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించబోయే సరికొత్త గ్రీన్‌ఫీల్డ్ ఫెసిలిటీలో ఐదు ఏఎమ్‌సీఏ నమూనాలను నిర్మించాల్సి ఉంటుంది.

పుట్టపర్తి వేదికగా ప్రైవేట్ భాగస్వామ్యం..

ఈ భారీ ప్రాజెక్టుకు అవసరమైన రూ. 15,000 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా సమకూరుస్తుంది. ఎంపికయ్యే ప్రైవేట్ సంస్థ.. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) పరిధిలోని 'అరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ' (ఏడీఏ)తో కలిసి పని చేయాల్సి ఉంటుంది. అయితే ఆంధ్ర ప్రదేశ్‌లోని పుట్టపర్తిలో 650 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న సరికొత్త అత్యాధునిక హబ్‌లో ఐదు ఫ్లయింగ్ ప్రొటోటైప్‌లను, ఒక స్ట్రక్చరల్ టెస్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను వీరు సంయుక్తంగా తయారు చేస్తారు. ఈ ప్రాజెక్టు కోసం 2025 మధ్యలో ఏడీఏ, డీఆర్‌డీఓలు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను ఆహ్వానించగా ఏడు సంస్థలు పోటీ పడ్డాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన సాంకేతిక మూల్యాంకన అనంతరం పైమూడు ప్రైవేట్ కూటములను షార్ట్‌లిస్ట్ చేశారు. వీరికి వివరణాత్మక బిడ్లను దాఖలు చేయడానికి రెండు నుంచి మూడు నెలల సమయం ఇచ్చారు. ఆ తర్వాత అత్యల్ప ధర బిడ్డర్ ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి.. 2027 జనవరి నుంచి మార్చి నాటికి కాంట్రాక్ట్ అవార్డు చేయనున్నారు.

2028 నుంచి 2032 మధ్య తొలి విమానం సిద్ధం..

ప్రస్తుత ప్రణాళికల ప్రకారం.. ఏఎమ్‌సీఏ మొదటి ప్రొటోటైప్ విమాన పరీక్ష 2028 నుంచి 2032 సంవత్సరాల మధ్య జరిగే అవకాశం ఉంది. అన్ని పరీక్షలు విజయవంతంగా ముగిశాక.. 2035 తర్వాత పుట్టపర్తి కేంద్రంగా ఈ యుద్ధ విమానాల భారీ ఉత్పత్తి ప్రారంభమై భారత వైమానిక దళంలోకి చేరుతాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కేవలం అమెరికా (F-22 రాప్టర్, F-35 లైట్నింగ్), చైనా (J-20), రష్యా (Su-57) దేశాల వద్ద మాత్రమే ఐదో తరం అధునాతన యుద్ధ విమానాలు ఉన్నాయి. ఏఎమ్‌సీఏ రాకతో ఈ అగ్రదేశాల సరసన భారత్ కూడా చేరనుంది.

భారత్ తయారు చేసే ఐదోతరం యుద్ధ విమానం స్పెషాలిటీ ఇదే..!

ఈ యుద్ధ విమానం సింగిల్ సీట్, ట్విన్ ఇంజన్ సామర్థ్యంతో ఉండి.. అమెరికా, రష్యా విమానాల తరహాలోనే శత్రువుల రాడార్ల కంటికి చిక్కని అధునాతన స్టెల్త్ కోటింగ్, అంతర్గత ఆయుధశాలను కలిగి ఉంటుంది. ఇది గరిష్టంగా 55,000 అడుగుల ఎత్తులో ప్రయాణించగలదు. అలాగే 6,500 కేజీల ఇంధన సామర్థ్యంతో పాటు అంతర్గతంగా 1,500 కేజీలు, బాహ్యంగా మరో 5,500 కేజీల అత్యంత శక్తివంతమైన క్షిపణులు, బాంబులను మోసుకెళ్లగలదు. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ రక్షణ రంగంలో స్వయంసమృద్ధి సాధించాలనే మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి ఈ ప్రాజెక్ట్ ఒక గేమ్ చేంజర్ కానుంది.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam