Dailyhunt
'శ్రీకాకుళం జిల్లా ప్రజల కోరిక నెరవేరబోతోంది'.. మూలపేట పోర్టుపై మంత్రి అచ్చెన్న కీలక ప్రకటన

'శ్రీకాకుళం జిల్లా ప్రజల కోరిక నెరవేరబోతోంది'.. మూలపేట పోర్టుపై మంత్రి అచ్చెన్న కీలక ప్రకటన

Telugu Samayam 1 week ago

శ్రీకాకుళం జిల్లావాసుల చిరకాల కోరిక మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టుతో త్వరలోనే నెరవేరనుందన్నారు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు. గత ప్రభుత్వ హయాంలో మూలపేట పోర్టు పనులు కేవలం 20 శాతం మాత్రమే జరిగితే..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 70 శాతానికి పైగా పూర్తి చేశామన్నారు. మిగిలిన పనులను మరింత వేగవంతం చేసి ఈ ఏడాది చివరి నాటికి, కుదిరితే నవంబర్ నాటికి పూర్తి చేసి ఆపరేషన్లు ప్రారంభించేలా చూడాలని అధికారులకు సూచించామని తెలిపారు. మంత్రి అచ్చెన్నాయుడు ఆర్ అండ్ బీ మంత్రి జనార్దన్ రెడ్డితో కలిసి మూలపేట పోర్టును పరిశీలించారు.. అక్కడ జరుగుతున్న పనులపై కీలక వ్యాఖ్యలు చేశారు.

గత ప్రభుత్వ హయాంలో పోర్టుకు అత్యంత కీలకమైన ఉప్పు భూముల కోసం కేంద్రానికి ఒక్క లేఖ కూడా రాయలేదన్నారు అచ్చెన్నాయుడు. కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవతో దాదాపు 400 ఎకరాల భూములను 99 ఏళ్ల లీజుకు సాధించామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆలస్యం చేసిన మూలపేట పోర్టు రోడ్డు, రైల్వే పనులను కూడా వేగవంతం చేస్తున్నామన్నారు. పోర్టుకు అనుబంధంగా పరిశ్రమలు వస్తే స్థానికంగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. మూలపేట పోర్టు వల్ల ఉద్యోగ అవకాశాలు రావని.. పోర్టు పరిసరాల్లో పరిశ్రమలతో ఉద్యోగాలు, ఉపాధి లభిస్తుందన్నారు. ఇప్పటికే 17 కంపెనీలు భూమి కోసం దరఖాస్తు చేశాయన్నారు.

గతంలో బ్రేక్‌వాటర్‌ పనులు 28.9శాతం జరిగితే.. ప్రస్తుతం 92.38 శాతం పూర్తయ్యాయన్నారు అచ్చెన్నాయుడు. బెర్త్‌ల పనులు గతంలో 26శాతం పూర్తయితే.. ప్రస్తుతం 77.83శాతం పూర్తి చేశామన్నారు. పోర్టు నిర్వాసితులైన మూలపేట, విష్ణుచక్రానికి చెందిన వారికి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల్లో రోడ్లు, కాలువలు, విద్యుత్‌, తాగునీటి సమస్యలు కూడా పరిష్కరించామన్నారు. మూలపేట పోర్టు నిర్మాణం పూర్తయితే శ్రీకాకుళం జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధితోపాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు మూలపేట పోర్టు విషయంలో రాజకీయ ఉనికి కోసం పాట్లు పడుతున్నారన్నారు. మూలపేట పోర్టుపై మాట్లాడుతున్న నేతలు ఈ 20 నెలల నుంచి నిద్రపోయారా అంటూ ఎద్దేవా చేశారు. మూలపేట పోర్టును సందర్శించడానికి వైఎస్సార్‌సీపీ నేతల్ని ఆహ్వానిస్తున్నామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam