చుట్టూ కొండలు, పచ్చని ప్రకృతి సోయగం, జంగిల్ సఫారీతో పాటుగా అలా నల్లమల అడవిలో నుంచి వెళ్లి ఆలయాలను పర్యాటకులు సందర్శిస్తుంటారు. కానీ మూడు నెలల పాటూ నల్లమల అడవిలోకి నో ఎంట్రీ..
జంగిల్ సఫారీ, పుణ్యక్షేత్రాల సందర్శన ఉండదు. అటవీశాఖ మూడు నెలల పాటూ విరామం ప్రకటించింది.. జనాల్ని నల్లమలలోకి సెప్టెంబర్ 30 వరకు అనుమతించరు. ఇప్పుడు పులుల పునరుత్పత్తి సమయం కావడంతో ఎన్టీసీఏ ఆదేశాలతో అడవిలోకి ప్రవేశంపై నిషేధం విధించారు. మూడు నెలల పాటూ అటవీ ప్రాంతంలోని ఆలయాల సందర్శన నిలిపివేశారు, జంగిల్ సఫారీ కూడా ఉండదు. కేవలం బఫర్ ఏరియాలో ఉండే ఎకో టూరిజంలో మాత్రమే విడిదికి అవకాశం ఉంటుంది. భక్తులు, పర్యాటకులు ఈ విషయాన్ని గమనించాలని అటవీశాఖ అధికారులు సూచించారు. దేశ వ్యాప్తంగా ఉన్న 55 పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్న సంగతి తెలిసిందే.
నల్లమల అడవిలో నాగార్జున సాగర్-శ్రీశైలం పులుల అభయారణ్యం ఉంది. గతంలో 85 పులులు ఉండగా.. గతేడాది ఆ సంఖ్య 90కి చేరింది. వీటిలో 32 మగ పులులు, 40 ఆడ పులులు ఉన్నాయి. పిల్లలు 14, అవయవ నిర్ధారణ కానివి 4 ఉన్నాయి. ప్రతి ఏటా జులై సెప్టెంబర్ మధ్య సంతానోత్పత్తికి సిద్ధమవుతాయి. కాబట్టి పులులకు ఏకాంతం కల్పిస్తూ ఈ ఆంక్షలు విధిస్తున్నారు. ఒకవేళ వాటి ఏకాంతానికి ఇబ్బంది కలిగిస్తే దాడి చేస్తాయి. అందుకే పులుల అభయారణ్యం పరిధిలోని పర్యాటక కేంద్రాలు, జంగిల్ సఫారీని నిలిపివేశారు. మార్కాపురం అటవీ డివిజన్, ఆత్మకూరు అటవీ డివిజన్, నంద్యాల డివిజన్‌లోని సఫారీ నిలిపివేశారు. మార్కాపురం అటవీ డివిజన్‌లో ఉన్న ఇష్టకామేశ్వరీదేవి ఆలయం, వెలుగోడు రేంజ్‌లోని రుద్రకోడూరు క్షేత్రం, గుండ్ల బ్రహ్మేశ్వర ఆలయాల సందర్శనకు భక్తుల్ని అనుమతించరు.
నల్లమలలో పెద్ద పులులతో పాటుగా చిరుతలు, ఎలుగుబంట్లు, దుప్పులుు, పక్షులు సహా ఎన్నో ఉన్నాయంటున్నారు అటవీశాఖ అధికారులు. వర్షాకాలంలో ఈ మూడు నెలలు పులుల సంతానోత్పత్తికి అనుకూల సమయమని.. అందుకే ఈ సమయంలో పులులు ప్రశాంత వాతావరణం, ఏకాంతాన్ని కోరుకుంటాయంటున్నారు. అందుకే ఆంక్షలు విధిస్తున్నామని.. భక్తులు, పర్యాటకులు, స్థానికులు సహకరించాలని కోరారు. మొత్తం మీద ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా మూడు నెలల పాటూ నల్లమల అడవిలోకి నో ఎంట్రీ అమల్లోకి వచ్చింది.

