తెలంగాణ రాజకీయాల్లో దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ క్లైమాక్స్‌కు చేరింది. కొండా కుమార్తె సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేయగా..
టీపీసీసీ మంత్రికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని టీపీసీసీ హైకమాండ్‌కు నివేదిక పంపింది. దీంతో ప్రస్తుతం ఈ వ్యవహారంపై ఢిల్లీలో మంతనాలు జరుగుతున్నాయి. సీఎం రేవంత్, పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ సహా మంత్రి కొండా ఢిల్లీలో బిజిబిజీగా గడుపుతున్నారు. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించటం ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో బుధవారం కాంగ్రెస్ జాతీయఅధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో సమావేశమైన కొండా సురేఖ తన వివరణను లేఖ రూపంలో అందజేశారు. అనంతరం మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన కొండా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన కూతురు చేసిన వ్యాఖ్యలకు తనను ఎందుకు బాధ్యులను చేస్తారని ప్రశ్నించారు. తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వటమే తప్పు అని.. అలా ఇవ్వాల్సి వస్తే సీఎం రేవంత్ రెడ్డికే ముందుగా షోకాజ్ నోటీసులు ఇవ్వాలని అన్నారు.
' నేను ఏ తప్పు చేయలేదు. అయినా నాపై చర్యలకు సిద్ధమవుతున్నారు. నా బిడ్డ మాట్లాడితే నాకేం సంబంధం. తనకు పెళ్లయి.. కుటుంబం ఉంది. ఆమె రాజకీయం ఆమెది.. నా రాజకీయం నాది. తనకు ఎమ్మెల్యే కావాలని కోరిక ఉంది. ముందు సీఎం రెచ్చగొట్టేలా మాట్లాడితేనే తను స్పందించింది. అయినా అభ్యర్థులను ముందుగా సీఎం ఎలా ప్రకటిస్తారు. తాను పదేళ్లు సీఎంగా ఉంటానని తనకు తాను ఎలా ప్రకటించారు. ఇది పార్టీ లైన్ క్రాస్ చేయటం కాదా..? సీఎం అలా ప్రకటించుకోవటం పట్ల చాలా మంది మంత్రులు, సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారు.
నాపై చర్యలు తీసుకోవాలంటే ముందుగా సీఎం రేవంత్ రెడ్డిపైనే చర్యలు తీసుకోవాలి. నా కూతురు చేసింది తప్పు అయితే సీఎం చేసింది కూడా తప్పే. నేను మంత్రిగా చాలా బాగా పని చేస్తున్నాను.ఒక్క అవినీతి ఆరోపణ లేదు. మంత్రి వర్గంలో చాలా మందిపై ఆరోపణలు ఉన్నాయి. ఓ మంత్రితో పాటు మరో మంత్రి భార్య కమీషన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు వచ్చాయి. వారిపై చర్యలు ఎందుకు తీసుకోరు. నేనో బీసీ బిడ్డను కాబట్టే ఇలా చేస్తున్నారు. నాకు బీసీల మద్దతు ఉంది. నాపై కుట్రలు చేస్తూ ఎమ్మెల్యేతో ప్రెస్‌మీట్లు పెట్టించి తిట్టించారు. ఇలా మంత్రిని తిట్టడం సరైందేనా.. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోరా..? నాపై చర్యలు తీసుకుంటే పార్టీకే నష్టం.
నేను చెప్పాలనుకున్న విషయాలను లేఖ రూపంలో ఖర్గేకు ఇచ్చా. ప్రియాంక, మీనాక్షి సహా మరికొందరికి మెయిల్ రూపంలో పంపా. మహిళలను ప్రోత్సహించాలని రాహుల్ చెబుతుంటే.. ఇక్కడ మాత్రం తొక్కేయాలని చూస్తున్నారు. నాకు అన్ని వర్గాల మద్దతు ఉంది. నన్ను మంత్రి పదవి నుంచి వెదొలగాలని ఇప్పటి వరకు ఎవరూ ఆదేశించలేదు. అలా చెబితే నేను ఏం చేయాలో నాకు తెలుసు.' అని కొండా సురేఖ మీడియాతో చిట్‌చాట్‌గా వెల్లడించారు.

