Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సినీ గేయ రచయిత చంద్రబోస్ సోదరుడి మృతిపై అనుమానాలు.. దుండిగల్ స్టేషన్‌లో కేసు నమోదు

సినీ గేయ రచయిత చంద్రబోస్ సోదరుడి మృతిపై అనుమానాలు.. దుండిగల్ స్టేషన్‌లో కేసు నమోదు

Telugu Samayam 2 weeks ago

ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన సోదరుడు రాజేందర్ (60) అనుమాస్పద స్థితిలో మరణించారు. ఆదివారం (మే 3) ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా కలికిరిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

తొలుత ఇది గుండెపోటుగా భావించినప్పటికీ.. మృతుడి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ కేసు అనూహ్య మలుపు తిరిగింది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా పరకాలకు చెందిన రాజేందర్ హైదరాబాద్‌లోని మియాపూర్‌లో నివాసం ఉంటున్నారు. ఆయన ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేస్తూనే రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నారు.

రెండు రోజుల క్రితం వ్యాపార నిమిత్తం బెంగళూరు వెళ్లిన ఆయన అక్కడ పనులు ముగించుకుని మదనపల్లె చేరుకున్నారు. అనంతరం కలికిరిలో తన స్నేహితుడు శ్రీనివాసులు రెడ్డిని కలిసేందుకు వెళ్లగా.. ఆయన హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలియడంతో శనివారం రాత్రి అక్కడే బస చేశారు. ఆదివారం ఉదయం గుండెనొప్పి రావడంతో ప్రైవేటు ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా రిపోర్టులు సాధారణంగానే వచ్చాయి. ఆ తర్వాత టిఫిన్ చేసి రోడ్డుపైకి వచ్చిన రాజేందర్ ఒక్కసారిగా కుప్పకూలి మరణించారు.

రాజేందర్ మృతి వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు అన్నమయ్య జిల్లాకు చేరుకున్నారు. అయితే రాజేందర్ ఒంటిపై గాయాలు ఉన్నాయని ఆయన మరణంపై తమకు అనుమానాలు ఉన్నాయని భార్య వసంత హైదరాబాద్‌లోని దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా చేతిపై బొబ్బలు ఉండటం, చర్మం ఊడిపోవడం వంటి అంశాలను ఆమె ప్రస్తావించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు. రాజేందర్ మృతదేహాన్ని ప్రస్తుతం బాచుపల్లిలోని మమతా ఆస్పత్రికి తరలించారు.

కాగా, కలికిరి పోలీసులు ప్రాథమికంగా ఇది గుండెపోటుగా భావిస్తున్నారు. రాజేందర్ మరణించిన తర్వాత మృతదేహం గంటపాటు రోడ్డుపైనే ఎండలో ఉండటం వల్ల, ఆయనకు మధుమేహం ఉన్నందున చర్మంపై బొబ్బలు వచ్చాయని పోలీసులు చెబుతున్నారు. అయితే కుటుంబ సభ్యుల ఫిర్యాదు నేపథ్యంలో పోస్టుమార్టం నివేదిక వస్తేనే మరణానికి గల అసలు కారణాలు తెలుస్తాయని భావిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబోస్ తన సోదరుడి మరణవార్త విన్న వెంటనే ప్రయాణమై హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. రాజేందర్ మరణంతో వారి స్వగ్రామమైన పరకాలలోనూ విషాద ఛాయలు అలముకున్నాయి. రైతు కుటుంబం నుంచి వచ్చి అగ్ర స్థాయికి ఎదిగిన చంద్రబోస్ కుటుంబానికి రాజేందర్ పెద్ద దిక్కుగా ఉండేవారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam