ఐపీఎల్ 2026 నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ నిష్క్రమించింది. బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్..
వైభవ్ సూర్యవంశీ విధ్వంసంతో 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు స్కోరు చేసింది. అనంతరం జోఫ్రా ఆర్చర్ సూపర్ బౌలింగ్‌తో సన్ రైజర్స్ బ్యాటింగ్ యూనిట్‌ను కకావికలం చేశాడు. దీంతో హైదరాబాద్ జట్టు 19.2 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌట్ అయింది. 47 రన్స్ తేడాతో నాకౌట్ మ్యాచులో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫయర్-2కు చేరుకుంది.
ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 243/8 స్కోరు చేసింది. మంచి నీళ్లు తాగినంత సులువుగా బౌండరీలు బాదిన వైభవ్ సూర్యవంశీ.. 5 ఫోర్లు, 12 సిక్సుల సాయంతో 29 బంతుల్లోనే 97 పరుగులతో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీ ముంగిట వైభవ్ ఔటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన ధ్రువ్ జురెల్ 21 బంతుల్లో 50 పరుగులతో చెలరేగాడు. దీంతో రాజస్థాన్ 260-270 పరుగులు చేసేలా కనిపించింది. కానీ చివరి ఐదు ఓవర్లలో సన్‌రైజర్స్ బౌలర్లు పుంజుకొని రాజస్థాన్‌ను 243 పరుగులకు పరిమితం చేశారు.
అనంతరం ఛేజింగ్ ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ఆదిలోనే ఆర్చర్ షాక్ షాకిచ్చాడు. నిప్పులు చెరిగే బంతులు విసిరిన ఈ ఇంగ్లిష్ బౌలర్.. సన్ రైజర్స్ టాప్ ఆర్డర్‌ను కకావికలం చేశాడు. తొలి ఓవర్ రెండో బంతికే అభిషేక్ శర్మను రెండో బంతికే డకౌట్ చేసి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ (11 బంతుల్లో 33 రన్స్), ట్రావిస్ హెడ్ (8 బంతుల్లో 17 రన్స్)ను పెవిలియన్ పంపించాడు. దీంతో సన్ రైజర్స్ ఓటమి దాదాపు ఖరారైపోయింది. ఈ సీజన్లో అద్భుతంగా ఆడిన హెన్రిచ్ క్లాసెన్ (18) కూడా ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. నితీశ్ కుమార్ రెడ్డి 20 బంతుల్లో 38 రన్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివరకు సన్ రైజర్స్ హైదరాబాద్.. 19.2 ఓవర్లలో 196 పరుగులకు కుప్పకూలింది.
ఈ ఫలితంతో రాజస్థాన్ రాయల్స్.. ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2కు చేరుకుంది. క్వాలిఫయర్-1లో ఓడిన గుజరాత్ టైటాన్స్‌తో.. రాజస్థాన్ రాయల్స్.. క్వాలిఫయర్-2లో తలపడనుంది. మే 29న ముల్లాన్‌పూర్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. మే 31న జరిగే ఫైనల్స్‌కు ఆర్సీబీ ఇప్పటికే అర్హత సాధించింది.
గూగుల్ ట్రెండ్స్‌లో మ్యాచ్ స్కోర్ కార్డ్..
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఊచకోతతో రాజస్థాన్ రాయల్స్ పరుగుల మోత మోగించింది. దీంతో ఈ మ్యాచ్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఐపీఎల్ అభిమానులు ఆసక్తి చూపారు. ఫలితంగా sunrisers hyderabad vs rajasthan royals match scorecard కీవర్డ్ 2 మిలియన్లకుపైగా సెర్చ్ వాల్యూమ్‌తో గూగుల్ ట్రెండ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది.
