Dailyhunt
స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా వెండితెరపై ప్రభంజనం.. టాలీవుడ్‌లో ఏకైక హీరోగా రికార్డు!

స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా వెండితెరపై ప్రభంజనం.. టాలీవుడ్‌లో ఏకైక హీరోగా రికార్డు!

Telugu Samayam 1 week ago

తెలుగు తెరపై 'గంగోత్రి' సినిమాతో అడుగుపెట్టినప్పుడు 'వీడు హీరో ఏంట్రా?' అన్న విమర్శలు ఎదుర్కొన్న ఒక కుర్రాడు.. నేడు దేశం గర్వించదగ్గ 'నేషనల్ అవార్డ్ విన్నర్'గా ఎదిగారు.

తన కష్టం, అంకితభావం, అద్భుతమైన డాన్సులతో స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్గా రూపాంతరం చెందిన అల్లు అర్జున్ (బన్నీ) నేడు తన 44వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రస్థానంలోని అరుదైన మైలురాళ్లపై ప్రత్యేక కథనం.

గంగోత్రి నుంచి గ్లోబల్ స్టార్ వరకు..
2003లో విడుదలైన 'గంగోత్రి' సినిమాతో హీరోగా పరిచయమైన బన్నీ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'ఆర్య' సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆ సినిమా కేవలం తెలుగులోనే కాదు, కేరళలో కూడా భారీ విజయం సాధించి ఆయనను 'మల్లు అర్జున్'గా మార్చేసింది. అక్కడి నుండి వరుస విజయాలతో దూసుకుపోతున్న క్రమంలో 'పుష్ప: ది రైజ్' ఆయన కెరీర్‌నే మార్చేసింది. తగ్గేదే లే అంటూ ఆయన చూపించిన మేకోవర్, మేనరిజమ్స్ పాన్ ఇండియా స్థాయిని దాటి గ్లోబల్ గుర్తింపును తెచ్చిపెట్టాయి.

'పుష్ప 2'తో బాక్సాఫీస్ షేక్
ఇక 'పుష్ప 2: ది రూల్' భారతీయ సినిమా చరిత్రలోనే మునుపెన్నడూ చూడని రికార్డులను తిరగరాసింది. మొదటి రోజే ఏకంగా ₹294 కోట్ల వసూళ్లు సాధించి భారతీయ చిత్ర చరిత్రలో రికార్డ్ సృష్టించింది. అంతేకాదు దంగల్, బాహుబలి 2 తర్వాత అత్యధిక కలెక్షన్లు రాబట్టిన మూడో భారతీయ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ సినీ మ్యాగజైన్ 'ది హాలీవుడ్ రిపోర్టర్' కవర్‌ పేజీపై స్థానం పొందిన ఘనత ఆయనది. ఇన్‌స్టాగ్రామ్‌లో 28 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో దక్షిణాదిలోనే అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోగా నిలిచారు.

సినిమా కోసం ఏదైనా చేసే 'బన్నీ'
సినిమా పట్ల అల్లు అర్జున్‌కు ఉన్న అంకితభావం అమోఘమనే చెప్పాలి. 'దేశముదురు' సినిమా కోసం తెలుగు ఇండస్ట్రీకి సిక్స్ ప్యాక్ సంస్కృతిని పరిచయం చేశారు. 'బద్రీనాథ్' కోసం మలేషియా వెళ్లి కత్తి యుద్ధం నేర్చుకున్నారు. గుణశేఖర్ నిర్మించిన 'రుద్రమదేవి' కష్టాల్లో ఉన్నప్పుడు, సినిమాకు ఊపు తేవడానికి పైసా పారితోషికం తీసుకోకుండా గోనగన్నారెడ్డి పాత్ర పోషించి తన పెద్ద మనసును చాటుకున్నారు.

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు, హాస్యనటుడు అల్లు రామలింగయ్య మనవడు అయిన అల్లు అర్జున్ ఏప్రిల్ 8, 1982న జన్మించారు. స్నేహారెడ్డిని వివాహం చేసుకున్న ఆయనకు అయాన్, అర్హ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయనకు ఐశ్వర్యరాయ్ అంటే ఎంతో అభిమానం, అలాగే 'టైటానిక్', 'ఇంద్ర' సినిమాలను ఎన్నిసార్లు చూశారో లెక్కే లేదట. ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం (₹300 కోట్లు) తీసుకుంటున్న హీరోగా అల్లు అర్జున్ రికార్డుల 'రప్పా రప్పా' వేట కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రంపై భారీ అంచనాలున్నాయి. బన్నీ మరిన్ని అద్భుతమైన సినిమాలు చేస్తూ, తెలుగు సినిమా కీర్తిని విశ్వవ్యాప్తం చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. హ్యాపీ బర్త్‌డే బన్నీ.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam