Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తల్లిదండ్రులు కొన్ని తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు, పిల్లలు మిమ్మల్ని గౌరవించరు

తల్లిదండ్రులు కొన్ని తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు, పిల్లలు మిమ్మల్ని గౌరవించరు

Telugu Samayam 11 months ago

ల్లిదండ్రుల్ని చూసే పిల్లలు ఏదైనా నేర్చుకుంటారు. తల్లిదండ్రులు చేసే కొన్ని తప్పులు, చూపించే ప్రవర్తన కారణంగా పిల్లలు వారి పట్ల గౌరవం కోల్పోతారు.

పిల్లల పెంపకం అనేది ఒక సవాలుతో కూడుకుంది. తల్లిదండ్రులకు ఇది ఎంతో సంతృప్తినిచ్చే ప్రయాణం. పిల్లలు మంచివారిగా ఎదగడానికి తల్లిదండ్రులు కీలక పాత్ర పోషిస్తారు. అంతేకాదు.. పిల్లలు చెడు ప్రవర్తన కూడా కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులే కారణమవుతున్నారు. చిన్నతనంలో పిల్లలు ప్రతి విషయంలో తల్లిదండ్రులను అనుకరిస్తారు. వారు ఏం చెప్పినా నమ్ముతారు. వారి ప్రవర్తన నుంచి జీవితాన్ని ఎలా లీడ్ చేయాలో నేర్చుకుంటారు. కానీ కొన్నిసార్లు తెలియకుండా చేసే కొన్ని తప్పులు పిల్లల దృష్టిలో తల్లిదండ్రుల గౌరవాన్ని తగ్గిస్తాయి. పిల్లల ముందు వారి గౌరవం దెబ్బతినకుండా ఉండటానికి తల్లిదండ్రులు నివారించాల్సిన ఆ తప్పులు ఏంటో ఓ లుక్కేద్దాం.తల్లిదండ్రులు పిల్లల ముందు గొడవ పడినప్పుడు

​భార్యాభర్తల మధ్య ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. కానీ పిల్లల ముందు ఎప్పుడూ గొడవ పడకూడదు. తల్లిదండ్రులు పిల్లల ముందు గొడవ పడటం, కోపంతో అరుచుకోవడం, చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద కేకలు వేసుకోవడం, దుర్భాషలు వాడటం లేదా ఒకరితో ఒకరు చెడుగా ప్రవర్తించడం వంటివి చేయకూడదు. ఒకవేళ చేస్తే పిల్లల దృష్టిలో తల్లిదండ్రుల పట్ల గౌరవం క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా, తల్లిదండ్రుల ఈ ప్రవర్తన పిల్లల మనస్సులపై చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణంగా వారి మానసిక పెరుగుదల కూడా ప్రభావితమవుతుంది.


పిల్లల ముందు అబద్ధాలు చెప్పడం, ఇచ్చిన మాట తప్పడం

పిల్లలు తమ తల్లిదండ్రుల ప్రతి మాటను, చర్యను చాలా జాగ్రత్తగా గమనిస్తారు. తల్లిదండ్రులు పదే పదే అబద్దం చెబితే గౌరవం కోల్పోతారు. అంటే వేరే ఎవరికైనా లేదా పిల్లలకే అయినా అబద్ధాలు చెప్పడం చేస్తే.. అదే వారు సరైంది అని నమ్ముతారు. అంతేకాకుండా పిల్లలకు ఫలానాది చేస్తే అని చెప్పి.. మాట తప్పితే.. వారికి మీ మీద నమ్మకం తగ్గడం ప్రారంభమవుతుంది. వీళ్లు ఏది చెప్పినా సరే చేయరు అన్న నమ్మకం వారికి ఏర్పడుతుంది. దీంతో క్రమంగా మీ మీద గౌరవాన్ని కోల్పోతారు.


అతి గారాబం

కొందరు తల్లిదండ్రులు పిల్లల్ని అతి గారాబంగా పెంచుతారు. పిల్లలు అడిగినవన్నీ ఇచ్చేయడం, వారు ఏ తప్పు చేసినా మందలించకుండా వదిలేయడం వల్ల వారికి క్రమశిక్షణ లోపిస్తుంది. తమకు ఏది కావాలంటే అది దక్కుతుందని, తాము ఏం చేసినా చెల్లుతుందని భావిస్తారు. ఇది పెద్దయ్యాక తల్లిదండ్రుల పట్ల అగౌరవానికి దారితీస్తుంది. అందుకే పిల్లల్ని క్రమశిక్షణతో పెంచండి.


ఇతరుల ముందు పిల్లల్ని తిట్టడం లేదా అవమానించడం

కొన్నిసార్లు తల్లిదండ్రులు కోపంగా ఉండి, ఇతరుల ముందు పిల్లలను తిడతారు లేదా ఇబ్బంది పెడతారు. ఈ ప్రవర్తన పిల్లల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. ఇది పదేపదే జరిగితే, తల్లిదండ్రులు తనను గౌరవించడం లేదని పిల్లలు అనుకునే ప్రమాదముంది. ఇది పిల్లల మనస్సులో కోపం, దూరానికి దారితీస్తుంది. దీంతో నెమ్మదిగా పిల్లలు తల్లిదండ్రుల నుంచి తనను తాను దూరం చేసుకోవడం ప్రారంభిస్తారు. ఈ పని పిల్లల దృష్టిలో తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని కూడా తగ్గిస్తుంది.


పిల్లల్ని పట్టించుకోకపోవడం

ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు బిజీ లైఫ్‌స్టైల్ లీడ్ చేస్తున్నారు. దీంతో తమ పిల్లలకు తగిన సమయం ఇవ్వలేకపోతున్నారు. పిల్లల అభిప్రాయాలను, భావాలను పట్టించుకోకపోవడం, వారికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం వల్ల వారు తమ తల్లిదండ్రులు తమను అర్థం చేసుకోరని భావిస్తారు. దీనివల్ల వారు తమను తాము తక్కువగా భావించి, తల్లిదండ్రుల పట్ల కోపం లేదా అగౌరవాన్ని పెంచుకోవచ్చు. అందుకే పిల్లలకు కాస్తా సమయం కేటాయించి వారి బాగోగులు చూసుకోవాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.


చెడు ఆదర్శం

తల్లిదండ్రులు ఇతరుల పట్ల లేదా పెద్దల పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తే, పిల్లలు దానిని చూసి నేర్చుకుంటారు. పెద్దలు ఎలా ప్రవర్తిస్తే, పిల్లలు కూడా అలాగే ప్రవర్తించడానికి ప్రయత్నిస్తారు. తల్లిదండ్రులు ఇతరులను గౌరవించకపోతే, పిల్లలు తమ తల్లిదండ్రులను కూడా గౌరవించడం నేర్చుకోరు. తల్లిదండ్రులు ఇతరులను గౌరవించడం లేదని పిల్లలు భావించినప్పుడు, వారి మనస్సులో తల్లిదండ్రుల మంచి ఇమేజ్ చెడిపోతుంది. అందుకే పొరపాటున కూడా పిల్లల ముందు ఎవరితోనూ చెడుగా ప్రవర్తించవద్దు.

గమనిక
ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించేముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి. తెలుగు సమయం ఈ విషయాల్ని ధృవీకరించడం లేదు. ఖచ్చితత్వం, ప్రభావానికి తెలుగు సమయం బాధ్యత వహించదు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam