మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు శాసనసభకు ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా.. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ ముగిసింది. బరిలో నిలిచిన అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులకు సంబంధించిన ఆస్తులు, ఇతర వివరాలు ఆసక్తికరంగా మారాయి.
ఈ ఎన్నికల్లో తిరుచ్చి జిల్లా లాల్‌గుడి నియోజకవర్గంలో ఎన్డీయే కూటమిలోని అన్నాడీఎంకే పార్టీ తరఫున పోటీ చేస్తున్న లీమా రోజ్ అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచారు. ఆమె సమర్పించిన నామినేషన్ పత్రాల ప్రకారం.. లీమా రోజ్ ఆస్తులు విలువ రూ.1,000 కోట్లకు పైమాటే. తన పేరిట రూ. 139.62 కోట్ల విలువైన చరాస్తులున్నట్టు పేర్కొన్న ఆమె... తనకు రూ. 909.94 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని అఫిడ్‌విట్‌లో ప్రకటించారు. ఇందులో ఆమె కుటుంబం ఆస్తుల వివరాలు కూడా ఉన్నాయి. టీవీకే అధినేత విజయ్ జోసెఫ్ కంటే ఈమె ఆస్తులు రెట్టింపు కావడం విశేషం. విజయ్ తన పేరిట రూ.600 కోట్లకుపైగా చర, స్థిరాస్తులు ఉన్నట్టు అఫిడ్‌విట్‌లో ప్రకటించారు.
ఎవరీ లీమా రోజ్?
ఆమె ఆల్ ఇండియా క్రిస్టియన్ ఉదయర్ సంఘం (మహిళా విభాగం) అధ్యక్షురాలిగా, పార్కవకుల మున్నేట్ర సంఘం (మహిళా విభాగం) కార్యదర్శిగానూ పనిచేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎల్జేకేకు రాజీనామా చేసిన లీమా రోజ్.. అన్నాడీఎంకేలో చేరారు. డీఎంకే 2006 నుంచి గెలుస్తూ వస్తున్న లాల్‌గుడి నియోజకవర్గం నుంచి ఆమెను బరిలోకి దింపింది. లాల్‌గుడిలో ఉదయర్ సామాజిక వర్గం ఓట్లు దాదాపు 40 శాతం ఉంటుందని అంచనా. క్రిస్టియన్ల కూడా ఎక్కువగా ఉంటారు. దీంతో లీమాకు ఇది కలిసొచ్చి, 20 ఏళ్ల తర్వాత లాల్‌గుడిలో రెండాకుల జెండా ఎగురుతుందని అన్నాడీఎంకే భారీగా ఆశలు పెట్టుకుంది.
ఈ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (SPA), అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయేతో పాటు తొలిసారి బరిలో నిలిచిన నటుడు విజయ్ తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ మధ్య ప్రధానంగా పోటీ ఉండనుంది. లౌకికవాద ప్రగతిశీల కూటమి (SPA)లోని డీఎంకే 164 స్థానాల్లో పోటీచేస్తుండగా.. కాంగ్రెస్ పార్టీకి 28, డీఎండీకేకు 10 సహా మిత్రపక్షాలకు 70 సీట్లను కేటాయించింది.

