Tamil Nadu Secretariat Relocation 2026: తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ష్ట్ర ప్రభుత్వ పరిపాలనా కేంద్రంగా, చట్టసభల వేదికగా దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న చారిత్రాత్మక 'ఫోర్ట్ సెయింట్ జార్జ్' కోట నుంచి శాసనసభ, సచివాలయాన్ని బయటకు తరలించి..
ఒకే చోట అన్ని సదుపాయాలు ఉండే నూతన సమీకృత కాంప్లెక్స్‌ను నిర్మించాలని ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ భావిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల వేదికగానే రూల్ 110 కింద ఎలాంటి చర్చ లేకుండా నేరుగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
కొత్త ప్రాంతాల కోసం అన్వేషణ
చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లోని ప్రధాన భవనంలో అసెంబ్లీతో పాటు సీఎం, పలువురు మంత్రుల కార్యాలయాలు ఉన్నాయి. స్థలం ఎక్కువగా లేకపోవడంతో.. బీసీ, ఎంబీసీ, కార్మిక సంక్షేమ శాఖల మంత్రుల ఆఫీసులను గ్యారేజ్ బ్లాక్‌లో నిర్వహించాల్సి వస్తోంది. ప్రస్తుతం సీఎం ఆఫీసును తాత్కాలికంగా ఫోర్ట్ ఆవరణలోని నామక్కల్ కవిజ్ఞర్ మాళిగై 10వ అంతస్తుకు మారుస్తున్నారు. ఈ క్రమంలోనే శాశ్వత పరిష్కారం కోసం గిండిలోని హైవేస్ రీసెర్చ్ స్టేషన్ క్యాంపస్ (35 ఎకరాలు), పట్టినాపక్కమ్/ఫోర్‌షోర్ ఎస్టేట్ (20 ఎకరాలు), అలాగే నందంబాక్కమ్‌లోని ఫిన్‌టెక్ సిటీకి ఎదురుగా ఉన్న స్థలాలను (20 ఎకరాలు) ఎంపిక కమిటీ పరిశీలిస్తోంది. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యూడీ) మంత్రి ఆదవ్ అర్జున ఆదేశాల మేరకు రెవెన్యూ, పీడబ్ల్యూడీ అధికారులు ఇప్పటికే ఈ ప్రదేశాలను స్వయంగా తనిఖీ చేశారు.గతంలోనూ సచివాలయం తరలింపుకు ప్రయత్నాలు..!
సచివాలయాన్ని కోట దాటించే ప్రయత్నం జరగడం ఇది తొలిసారేమీ కాదు. 2003లో అప్పటి సీఎం జయలలిత.. అన్నా యూనివర్సిటీ సమీపంలోని కొట్టూర్ పురంలో 43.2 ఎకరాల్లో కొత్త భవనానికి శంకుస్థాపన చేసినప్పటికీ.. ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. ఆ తర్వాత 2010లో ఓమందూరార్ గవర్నమెంట్ ఎస్టేట్‌లో నూతన అసెంబ్లీ సముదాయాన్ని నిర్మించి శాసనసభను అక్కడికి మార్చారు. అయితే 2011లో జయలలిత మళ్లీ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీని తిరిగి పాత ఫోర్ట్ సెయింట్ జార్జ్ కోటకే తరలించి, ఓమందూరార్ కాంప్లెక్స్‌ను మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, మెడికల్ కాలేజీగా మార్చేశారు.విమానాశ్రయం వివాదం..
ఓవైపు పరిపాలనా భవనాల మార్పు వార్తలు వస్తుండగానే.. మరోవైపు పరందూర్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్‌ను రద్దు చేయడంపై అసెంబ్లీలో టీవీకే, డీఎంకే సభ్యుల మధ్య పరస్పర తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయ భూముల నష్టం, స్థానికుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని పరందూర్ ప్రాజెక్ట్‌ను రద్దు చేస్తున్నట్లు సీఎం విజయ్ రూల్ 110 కింద ప్రకటించగా.. దీనికి ప్రత్యామ్నాయ స్థలాన్ని అన్వేషిస్తామని తెలిపారు. అయితే ఈ నిర్ణయం వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాలు ఉన్నాయంటూ మంత్రులు సీటీఆర్ నిర్మల్ కుమార్, ఆదవ్ అర్జున ఆరోపించగా.. డీఎంకే ఎమ్మెల్యే తంగం తెన్నరసు తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఈ వివాదాల నడుమ నూతన సచివాలయ నిర్మాణ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.
